Monday, December 23, 2024

కాలువల భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

గజ్వేల్ : కాలువల భూ సేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. శనివారం గజ్వేల్ ఐఓసిలో నీటిపారుదల శాఖ, రెవెన్యూ, సర్వే అధికారులు, రాష్ట్ర ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిఎం కెసిఆర్ రైతులకు మేలు చేయడానికి పెద్ద ఎత్తున రిజర్వాయర్‌లను యుద్ద ప్రాతిపదికన నిర్మాణం పూర్తి చేశారు. జిల్లాలో రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ లాంటి రిజర్వాయర్‌ల నుంచి తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి కాలువల ద్వారా జిల్లాలోని ప్రతి చెరువులో నీటిని నింపడానికి కావల్సిన భూసేకరణ ప్రక్రియలో రెవెన్యూ, సర్వేయర్‌ల పాత్ర కీలకమన్నారు.

ప్రతి గ్రామంలో ఏ ఒక్క చెరువు కూడా ఎండకుండా ఎండాకాలంలో సైతం నీటితో కలకలాడితే రైతులకు ఎంతో మేలు చేసిన వాళ్లం అవుతామన్నారు. గ్రామాల్లో మండల తహశీల్దార్ సర్వేయర్లు, ఆర్డీఓల సహకారంతో కాలువల భూ సేకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. సర్వేయర్ అందించిన భూ సేకరన సంబంధిత ఇరిగేషన్ అనుమతులను వెంటనే తహశీల్దార్‌లకు అందించిన వెంటనే రైతులకు నష్టపరిహారం అందజేసి భూమిని అధీనంలోకి తీసుకోవాలన్నారు. కాలువలో భూమిని కోల్పోయిన రైతులు అధైర్యపడొద్దని మంచి పరిహారం ఇప్పిస్తామన్నారు. మీ త్యాగం వల్ల జిల్లా మొత్తం సస్యశ్యామలం అవుతుందన్నారు. భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి అవరోధాలు ఎదురైన పక్కా ప్రణాళికతో పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను అదేశించారు.

ఈ కార్యక్రమంలో సిద్దిపేట, గజ్వేల్ ఆర్డీఓలు రమేశ్‌బాబు, విజేందర్ రెడ్డి, గడా ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి, గజ్వేల్ ఇరిగేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ వేణు, ఎడి సర్వే ల్యాండ్ వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ఆర్ ఆండ్ ఆర్ కాలనీ వాసులు కాలనీ సమస్యలను కలెక్టర్‌కి తెలుపగా నిర్వాహుకులకు అందాల్సిన నష్ట పరిహారం ,ఓపెన్ ప్లాట్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు సంబంధించి అన్నింటిని అతి త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News