Saturday, November 16, 2024

కులాల వారీగా భూకేటాయింపులా?

- Advertisement -
- Advertisement -
హైటెక్ రాష్ట్రంలో ఇదేం విధానమంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసిన హైకోర్టు

హైదరాబాద్ : కులాల వారీగా భూములు కేటాయించడమేంటని హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కులాల వారీగా భూములు కేటాయించడం ఆర్టికల్ 14కి విరుద్ధమని వ్యాఖ్యానించింది. ‘ప్రభుత్వం తీరు సమాజంలో కుల విభజనకు దారి తీసేలా ఉంది. 21వ శతా బ్దాంలో.. అందునా హైటెక్ రాష్ట్రంలో ఇదేం విధానం? కులాల వారీగా భూకేటాయింపులు అసంబద్ధం, తప్పు’ అని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. కమ్మ, వెలమ సంఘాలకు భూకేటాయింపులపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. కెయు విశ్రాంత ప్రొఫెసర్ వినాయక్‌రెడ్డి దాఖలు చేసిన పిల్‌పై సిజె జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారణ చేపట్టింది.

2021లో ఖానామెట్‌లో ప్రభుత్వం కమ్మ, వెలమ సంఘాలకు ఐదెకరాల చొప్పున కేటాయించిందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం ఎస్‌సి, ఎస్‌టి, అణగారిన వర్గాలకు మాత్రమే భూములు ఇవ్వాలని, కులాంతర వివాహాలను ప్రోత్సహించడం వంటి విధానాలు ఉండాలని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇరుకైన ఆలోచనలు విడనాడి, విశాలంగా ఆలోచించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. జీయర్ వేదిక్ అకాడమీ, శారదా పీఠంకు భూముల కేటాయింపుపై హైకోర్టులో విచారణ జరిగింది.

సికింద్రాబాద్‌కు చెందిన వీరాచారి వేసిన పిటిషన్‌పై సిజె జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. రూ.కోట్ల విలువైన భూములను ఎకరానికి రూపాయి చొప్పున ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఎజి ప్రసాద్ సంప్రదాయాలు, వేదాలను ప్రొత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జీయర్ అకాడమీ, విశాఖ శారదాపీఠానికి భూకేటాయింపులపై విచారణ జులై 24కి, జీయర్ అకాడమీకి భూకేటాయింపుపై విచారణ ఆగస్టు 1కి వాయిదా వేసింది. అదే విధంగా రెడ్డి కాలేజీ సొసైటీకి బద్వేల్‌లో భూమి కేటాయింపుపై సామాజిక కార్యకర్తలు రాజేశ్వరరావు, విజయ్‌కుమార్ దాఖలు చేసిన పిల్‌పైనా హైకోర్టు విచారణ చేపట్టింది. రూపాయికి ఎకరం చొప్పున ఐదు ఎకరాలు కేటాయించడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

2018లో భూమి కేటాయిస్తే 5 ఏళ్ల తర్వాత పిల్ ఎందుకు వేశారని హైకోర్టు ప్రశ్నించింది. జివొను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయలేదని పిటిషనర్ల తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ తెలిపారు. పిల్ వేయడంలో జాప్యానికి కారణాలు, భూమి ప్రస్తుతం ఏ దశలో ఉందో అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు జూన్ 23కి వాయిదా వేసింది. మరోవైపు దర్శకుడు ఎన్.శంకర్‌కు మోకిలలో ఐదెకరాల కేటాయింపుపై కరీంనగర్‌కు చెందిన జె.శంకర్ వేసిన పిటిషన్‌పైనా హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. రూ.కోట్ల విలువైన భూమిని ఎకరం రూ.5 లక్షలకే కేటాయించారని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు.

ఎఫ్‌డిసి సిఫార్సు మేరకు రాయితీ ధరతో కేటాయించే అధికారం కేబినెట్‌కు ఉందని ఎజి వివరించారు. సినీ స్టూడియో నిర్మాణం కోసం ఎన్.శంకర్‌కు భూమి కేటాయించినట్లు తెలిపారు. ఉమ్మడి ఎపిలో పలు సినీ స్టూడియోలకు భూములు కేటాయించారని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. భూమి కేటాయింపులో ఎలాంటి పక్షపాతం, నిబంధనల ఉల్లంఘన లేదని శంకర్ తరపు న్యాయవాది తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత స్థానికులను ప్రొత్సహించాలన్న విధానంలో భాగంగానే కేటాయించారన్నారు. భూ కేటాయింపులపై 2007 తర్వాత చట్టాలు మారాయని పిటిషనర్ తరపు న్యాయవాది వెల్లడించారు. తదుపరి విచారణను జులై 5కి హైకోర్టు వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News