నోటిఫికేషన్ జారీ చేసిన హెచ్‌ఎండిఏ
మేడ్చల్ జిల్లాలోని బహదూర్‌పల్లి,
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం తొర్రూర్ లే ఔట్‌లోని ప్లాట్ల వేలం
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలతోపాటు ఆదాయం వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాల్లో భూములు విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందులో భాగంగా భూముల వేలానికి సంబంధించి మరో నోటిఫికేషన్‌ను హెచ్‌ఎండిఏ విడుదల చేసింది. భూముల అమ్మకం ద్వారా వచ్చే నిధులతో సంక్షేమ పథకాలు కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే మేడ్చల్ జిల్లాలోని బహదూర్‌పల్లి లే ఔట్‌లో ఉన్న ప్లాట్లతో పాటు రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం తొర్రూర్ లే ఔట్‌లోని ప్లాట్లను విక్రయించాలని హెచ్‌ఎండిఏ నిర్ణయించింది. ఈ వేలంలో పాల్గొనాలనుకునే వారు వచ్చేనెల 10వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. మూడురోజుల క్రితం 9 జిల్లాలో (చిన్నవి, పెద్దవి, కమర్షియల్ ప్లాట్లు కలిపి 1,408) ఓపెన్ ప్లాట్లలను మార్చి 14, 15, 16, 17 తేదీల్లో ప్లాట్లను వేలం వేసేందుకు హెచ్‌ఎండిఏ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ వేలం వచ్చే నెల 14, 15, 16, 17 తేదీల్లో
ఈ రెండు వేలాలకు సంబంధించి ఫ్రీ బిడ్ సమావేశం ఈనెల 24, 25 వచ్చేనెల 04, 09వ తేదీల్లో అధికారులు నిర్వహించనున్నారు. ఈ ప్లాట్లను చూడాలనుకుంటే ఈనెల 18, 25, వచ్చేనెల 07, 09వ తేదీల్లో అధికారులు అందుబాటులో ఉంటారని హెచ్‌ఎండిఏ తెలిపింది. బహదూర్‌పల్లికి సంబంధించిన ఈ వేలం వచ్చే నెల 14, 15వ తేదీల్లో, తొర్రూరుకు సంబంధించి 14, 15, 16, 17 తేదీల్లో నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. బహదూర్‌పల్లికి సంబంధించి చదరపు గజం ధరను రూ.25 వేలుగా, తొర్రూర్ చ.గ.ధరను రూ.20 వేలుగా అధికారులు నిర్ణయించారు.
నేషనల్ హైవే రోడ్లకు కనెక్టివిటీ
మేడ్చల్ జిల్లాలోని బహదూర్‌పల్లి లే ఔట్ ఎన్‌హెచ్ 765 (నర్సాపూర్ రోడ్డు) ఎన్‌హెచ్ 44 నాగ్‌పూర్ రోడ్డు)లకు కనెక్టివిటీని కలిగిఉందని, దీంతోపాటు ఓఆర్‌ఆర్ 5 (దుండిగల్), 6 (కండ్లకోయ)లకు ఎగ్జిట్‌ల మధ్యలో ఉందని హెచ్‌ఎండిఏ తెలిపింది. ఈ లే ఔట్‌కు 3 కి.మీల సమీపంలో ఐటి దిగ్గజం టెక్‌మహీంద్రా ట్రైనింగ్ సెంటర్ ఉంది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం తొర్రూర్ లే ఔట్ ఎన్‌హెచ్ 65 (హయత్‌నగర్), నాగార్జునసాగర్, ఎన్‌హెచ్ (ఇంజాపూర్)లకు వెళ్లడానికి రోడ్డు కనెక్టివిటీతో పాటు ఓఆర్‌ఆర్ 11 (పెద్ద అంబర్‌పేట), 12 (బొంగళూరు)లకు ఎగ్జిట్‌ల మధ్యలో ఉంది.
ఈ బ్రోచర్లు హెచ్‌ఎండిఏ వెబ్‌సైట్‌లో
అన్ని వివరాలతో పాటు ప్రతి సైటుకు సంబంధించిన ఈ బ్రోచర్లు హెచ్‌ఎండిఏ వెబ్‌సైట్‌లో (auction.hmda.gov.in) అందుబాటులో ఉంచినట్టు అధికారులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం హెచ్‌ఎండిఏ 9154843213, 7702743488, ఎంఎస్‌టిసి నెంబర్లు 9177067332, 9650554645లో సంప్రదించాలని అధికారులు తెలిపారు.