న్యూఢిల్లీ: ఉద్యోగాల కోసం భూ కుంభకోణానికి సంబంధించి రాష్ట్రీయ జనతాదళ్(ఆర్‌జెడి) మాజీ నేత అరుణ్ యాదవ్, ఆయన భార్య కిరణ్ దేవితో సంబంధం ఉన్న బీహార్‌లోని పాట్నా, భోజ్‌పూర్‌లోని తొమ్మిది చోట్ల సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెష్టిగేషన్(సిబిఐ) మంగళవారం సోదాలు నిర్వహించింది. అలాగే ఉద్యోగాల కుంభకోణంలో రాజ్యసభ ఎంపీ ప్రేమ్ గుప్తాకు చెందిన నోయిడా, ఢిల్లీ, గురుగ్రామ్‌లలో సిబిఐ సోదాలు నిర్వహించింది.
ఈ కేసుకు సంబంధించి బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై సిబిఐ విచారణ జరుపుతోంది. బీహార్, ఢిల్లీ, హర్యానా, నోయిడాలోని తొమ్మిది వేర్వేరు ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి. భోజ్‌పూర్‌లోని అగియోన్ గ్రామంలోని దేవి నివాసానికి సిబిఐ బృందం చేరుకుని సోదాలు నిర్వహించింది. సిబిఐకి చెందిన మరో బృందం హజ్ భవన్ సమీపంలోని పాట్నాలోని ఆమె అధికారిక నివాసంలో భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య సోదాలు నిర్వహించింది.