ప్రకృతి ప్రసాదితమైన భూమిని మానవుడు తన స్వార్థప్రయోజనాల కోసం అనేక రకాలుగా నష్టపరుస్తున్నాడు. మానవ జాతి మనుగడకు ఆధారమైన భూమిని శాస్త్రసాంకేతిక రంగాల్లో సంభవించిన పలుమార్పులను ప్రణాళికా రహితంగా అభివృద్ధి పేరుతో విధ్వంసం చేస్తు ‘ఆహార కొరత’ను సృష్టించడం వల్ల దేశంలో ఆకలి కేకలు రాజ్యమేలుతున్నాయి. ఆహారం జీవనాన్ని ఇచ్చే భూమిని నాశనం చేస్తూ పర్యావరణ విధ్వంసం అప్రతిహతంగా కొనసాగుతోంది. ‘గృహ వ్యర్థాలు’ చెత్తా చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలతో భూసారం దెబ్బ తింటున్నది. ప్రస్తుతం మన దేశంలో ప్రతి రోజూ 15 వేల టన్నుల కంటే ఎక్కువ చెత్త ఉత్పత్తి అవుతున్నట్లు అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. మార్కెట్‌లో ప్లాస్టిక్ వినియోగం పెరిగింది. వస్తువుల నిలువ, రవాణాలో ప్లాస్టిక్‌ను అధికంగా ఉపయోగిస్తున్నారు.
వివిధ రకాల ప్లాస్టిక్ వ్యర్థాలు కొన్ని వందల సంవత్సరాల వరకు భూమిలో నాశనం కాకుండా నిల్వ వుండడం వల్ల భూమి ఉత్పాదకత శక్తి తగ్గుతుంది. జాతీయ ఉత్పత్తి, ఉత్పాదకత తగ్గి ప్రజల ఆదాయాలు, జీవనప్రమాణాలు కొనుగోలుశక్తి ఆశించిన మేరకు పెరగలేదు. పశువులు, పక్షులు ప్లాస్టిక్ వ్యర్ధాలను తినడం వల్ల చనిపోతున్నాయి. ప్లాస్టిక్ కాలుష్యం పర్యావరణానికి ప్రమాదకరంగా పరిణమించింది. ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక’ ప్రకారం భారత్‌లో ఏటా 56 లక్షల టన్నుల చెత్త పోగుపడుతుంది. ఈస్థితి ఇలానే కొనసాగితే 2020 నాటికి దేశంలో 12 బిలియన్ల చెత్తను శుభ్రపరచడానికి వందల సంవత్సరాలు పడుతుందని ఆ సంస్థ తన సర్వేలో వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు భూ కాలుష్యా న్ని అరికట్టడానికి సమగ్రమైన విధానాలను అమలు చేయాలి. పెరుగుతున్న జనాభాను అరికట్టాలి. భూమి ఉత్పాదకతను పెంచాలి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. ప్లాస్టిక్ వినియోగంపై జరిమానా విధించాలి. ప్రభుత్వం ఐర్లాండ్ దేశంలో మాదిరి ప్లాస్టిక్ వినియోగంపై భారీ జరిమానాలువిధించాలి.
మలేషియాలో జరిమానాల మూలం గా ప్లాస్టిక్ వినియోగం 94% తగ్గింది. చిత్తడి నేలల పెంపకం, సామాజిక వనాల పెంపకం చిట్టడవుల సంరక్షణ, ఉద్యాన వనాలు, పబ్లిక్ పార్కులు ప్రజల రిక్రియేషన్ సౌకర్యాలు కలిగించాలి. పబ్లిక్ పార్కుల నిర్వహణ పాలనలో నగరాలలో ‘రెసిడెన్షియల్ అసోసియేషస్స్‌కు భాగస్వామ్యం కలిగించాలి. పచ్చదనం, పరిశుభ్రత ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమాలలో స్వచ్ఛందంగా ప్రజల పౌర సమాజం భాగస్వామ్యం పెరగాలి. భూమి, నీరు, సహజ వనరుల సంరక్షణ ఉద్యమంగా కొనసాగాలి. జీవావరణం, పర్యావరణం కాలుష్య నియంత్రణ సమన్వయంతో ఏక (ఒకే) కాలంలో జరుగాలి. ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపట్ల అవగాహన, చైతన్య సదస్సులు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం, యువత, సామాజిక, సాంస్కృతిక సంస్థలు సంయుక్తంగా నిర్వహించాలి. సమాజంలో భూమి రక్షణ స్పృహను స్ఫూర్తిని పెంచాలి. రండి భూమిని కాపాడదాం.
భూమికి ప్రత్యామ్నాయం లేదు. భూమి రక్షణ సమాజం సామాజిక బాధ్యతగా గుర్తెరిగి మసులుకుందాం. ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయ విధానాలను గ్రామీణ ప్రాంతాలలో విస్తృత స్థాయిలో ప్రచారం చెయ్యాలి. పంటల అధికోత్పత్తి కోసంభూమిని కాలుష్యం పరిచే రసాయనిక ఎరువులు, ఫెస్టిసైడ్స్ (పురుగు మందుల) వాడకాన్ని తగ్గించాలి. నీటి నిలువ, భూమి కోత నివారణ, నీటి కాలువల నిర్వహణ విధానాల మీద వ్యవసాయదారులతో, వ్యవసాయ కూలీలతో అవగాహన, చైతన్య సదస్సులు నిర్వహించాలి. భూ కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వకూడదు. చెత్త, వ్యర్థాల శుద్ధి తగినంత రీసైక్లింగ్ పునరుత్పాదక శక్తుల అమలు పారిశ్రామిక, దేశీయ వ్యర్థాలను శుద్ధి చేయడం ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా నేల కాలుష్యాన్ని అరికట్టాలి. వర్షాల వల్ల వచ్చే వరదల తాకిడి నుండి భూమి కోతకు గురికాకుండా వరద నీటి నిలువ నిర్వహణను మెరుగుపరచాలి.
చిన్న నీటి వనరులను గొలుసుకట్టు చెరువులను ప్రభుత్వం అభివృద్ధి చేయాలి. భూమిపై జనాభాను పెంచగలం కాని భూమిని పెంచలేం. సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగం పట్ల ప్రజలకు అవగాహన కలిగించాలి. సోలార్ విద్యుచ్చక్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించే కార్యాచరణతో ప్రభుత్వాలు ముందుకు వచ్చి భూరక్షణే జన రక్షణ అన్నస్పృహను సమాజంలో కలిగించాలి. ప్రకృతి రక్షణే లక్ష్యంగా సమగ్ర ధరిత్రి విధానాన్ని ప్రభుత్వం రూపొందించాలి. పర్యావరణ సానుకూల ఉత్పత్తులను ఉపయోగించాలి. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలి. పునర్వినియోగానికి ఉపయోగపడే వాటర్ బాటిల్స్, బ్యాగులనే వాడాలి. భూమి సంరక్షణ పాఠశాల, కళాశాల స్థాయిలో పాఠ్యాంశంగా ప్రవేశపెట్టి భూమి రక్షణ పట్ల విద్యార్థులకు చైతన్యం కల్పించాలి. మానవులు, పరిశ్రమలు చేసే కాలుష్యం వల్ల ప్రపంచ ఉష్ణోగ్రత పెరిగిపోతున్నది. సమస్త భూగోళం వినాశం దిశగా అడుగులు వేస్తోంది. మన వారసులకు సిరిసంపదలు, ఆహ్లాదకరమైన భూమిని కాకుండా కలుషితమైన వాతావరణాన్ని వారసత్వ ఆస్తిగా ఇవ్వబోతున్న దుస్థితిరాకుండా జాగ్రత్తపడాలి. భూరక్షణే జనరక్షణ లక్ష్యం గా సమగ్రమైన భూరక్షణ విధానాలను ప్రభుత్వం అమలు చేయాలి.
నేదునూరి కనకయ్య
9440245771