Tuesday, December 24, 2024

భూముల ధరలకు మళ్ళీ రెక్కలు

- Advertisement -
- Advertisement -

నేటి నుంచి పెరగనున్న భూమి విలువలు
ఆరు నెలల వ్యవధిలో మరోసారి పెంపు
చివరి రోజు కిటకిటలాడిన రిజిస్ట్రేషన్ కార్యాలయాలు
ఉమ్మడి జిల్లాలో అఖరి రోజు 470 రిజిస్ట్రేషన్లు
వారం రోజుల నుంచి జోరుగా రిజిస్ట్రేషన్లు

మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి : భూముల ధరలకు మళ్ళీ రెక్కలు వచ్చాయి. ఆరు నెలల క్రితమే ప్రభుత్వ మార్కెట్ విలువలను పెంచిన ప్రభుత్వం తిరిగి నేటి నుంచి మళ్ళీ భూమి ధరలను పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది. ఫిబ్రవరి 1 నుంచి భూముల ధరలను పెంచాలని రిజిస్ట్రేషన్ శాఖ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈమేరకు ఉమ్మడి జిల్లా కమిటీలు ప్రతిపాదించిన ధరలను జిల్లా కలెక్టర్ అమోదించారు. దీంతో వ్యవసాయ భూముల ధరలు 50 శాతం, ప్లాట్స్ ధరలు 35 శాతం, అపార్ట్‌మెంట్‌ల చదరపు అడుగులు 25 శాతం పెరగనున్నాయి.

ఫిబ్రవరి 1నుంచి పెరిగిన ఛార్జీలు అమలులోకి వస్తున్నందున చివరిరోజైన సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒకే రోజు 470 రిజిస్ట్రేషన్లు జరిగాయి. 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడాయి. రాష్ట్ర రాజధాని తరువాత ఖమ్మం జిల్లాలో రియల్ ఎస్టేట్ భూం ఉపందుకుంటున్న సమయంలో మరోసారి ప్రభుత్వ భూముల విలువలు పెరిగాయి. గత ఏడాది జూలై 22న భూముల విలువలను పెంచిన ప్రభుత్వం ఆరేళ్ళు తిరకగముందే మళ్ళీ పెంచింది. గతంలో రెండేళ్ల కోసారి భూముల మార్కెట్ విలువలను పెంచేవారు. కానీ ఇప్పుడు ఏడాదిలోనే రెండు పర్యాయాలు పెంచడం గమన్హారం. పెరిగిన ఛార్జీలు మంగళవారం నుంచి అమలులోకి రానున్నాయి. వ్యవసాయ భూములపై 50 శాతం పెంచారు. అంటే ప్రస్తుతం గజం రూ.3 లక్షలు ఉన్న వ్యవసాయభూమి ధర నేటి నుంచి రూ.4.50 లక్షలు పెరుగుతుంది.

తిరుమలాయపాలెం, వేంసూరు, పెనుబల్లి, కూసుమంచి ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉంటుంది. సత్తుపల్లి మండలంలో ఎకరం భూమి విలువ రూ.4.50 లక్షలు ఉండగా అదిఇప్పుడు రూ.6.75 లక్షలకు పెరిగింది.ఆశ్వారావుపేట మండలంలో ఎకరం భూమిపై ప్రభుత్వ మార్కెట్ విలువ రూ3.75 లక్షలు ఉండగా దానిని రూ.5.65లక్షలకు పెంచారు. గ్రామాల్లో ఎకరం రూ.1.80 లక్షలు ఉండగా ఇది ఇప్పుడు రూ.2.70లక్షలకు పెరిగింది. గత జూలై నెలలో కూడా వ్యవసాయ భూములపై అప్పట్లో ఉన్న ధరలపై 50 శాతం పెంచారు. మళ్లీ 50 శాతం పెంచారు. ఇక వ్యవసాయేతర భూములు అంటే ప్లాట్స్ గజం ధర ను 35శాతం పెంచారు. ఆరు నెలల క్రితం అప్పుడు ఉన్న మార్కెట్ ధరపై 50 శాతం పెంచి ఇప్పుడు 35 శాతమే పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఉదాహరణకు ప్రస్తుతం గజం ధర రూ.1000 ఉంటే నేటి నుంచి రూ.1350కి పెరుగుతుంది. గజం భూమి ధర రూ.10వేలు ఉంటే 13500కు పెరుగుతుంది. అదేవిధంగా అపార్ట్‌మెంట్‌లపై 25 శాతం పెంచారు. ఉదాహరణకు ప్రస్తుతం చదరపు అడుగులు ధర రూ.1600 ఉంటే నేటి నుంచి అది రూ.2000కు పెరుగుతుంది.

వాణిజ్య భవనాల్లో చదరపు అడుగు ధర రూ.3000 నుంచి రూ.3800కి పెరిగింది. సుడా పరిధిలోని మున్సిపల్ పట్టణాల్లో చదరపు అడుగు ధర రూ.1200 నుంచి 1500 కి పెరుగుతుంది. ఖమ్మం నగరంలో కొత్త బస్టాండ్ బైపాస్ రోడ్డు ప్రాంతంలో ప్రస్తుతం గజం ప్రభుత్వ మార్కేట్ భూమి విలువ రూ.15.750 ఉండగా అది నేటి నుంచి రూ 21.300కి పెరగనుంది. అదేవిధంగా నగరంలో గాంధీచౌక్, వైరా రోడ్డు, కమాన్ బజార్, కస్బా బజార్, మయూరీ సెంటర్ తదితర ప్రాంతాల్లో గజం భూమి ధర ప్రస్తుతం రూ.39వేలు ఉండగా దానిని రూ.47 వేలకు పెంచారు. భూముల విలువలు పెంపుతో రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ ఛార్జీలు కూడా పెరగున్నాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరనుంది.

కిక్కిరిసిన రిజిస్ట్రేషన్ కార్యాలయాలు

ఫిబ్రవరి 1నుంచి మార్కెట్ విలువలు పెరుగుతుండంతో జనవరి 31వ తేదీ సోమవారం ఉమ్మడి జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లు కిటకిటలాడాయి. మార్కెట్ విలువలు పెరిగితే అటోమెటిక్‌గా రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ చార్జీలు పెరుగుతాయనే ఉద్దేశ్యంతో వినియోగదారులు గత నాలుగు రోజులు నుంచి పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్లను పూర్తి చేసుకున్నారు. ఫిబ్రవరి 1 నుంచి మార్కెట్ విలువలు పెరుగుతాయని ప్రకటించిన నాటి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపురులంతా రిజిస్ట్రేషన్లను అగమేఘాలమీద పూర్తి చేసుకోవడం ప్రారంభించారు.

చివరిరోజైన సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1200 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఒక ఖమ్మం అర్బన్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనే 200 రిజిస్ట్రేషన్లు పూర్తి అయ్యాయి. సాధారణంగా ఇక్కడ రోజుకు ఇక్కడ 72 స్లాట్స్‌ను బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్లు చేస్తారు. కానీ ఒక్క రోజే 200 డాక్యుమెంట్లు పూర్తి అయ్యాయి. దీంతో ఒక ఖమ్మం అర్బన్ బస్ రిజిస్ట్రర్ ఆఫీస్ నుంచి ఒక కోటీ 60లక్షల ఆదాయం సమకురినట్లయింది. సర్వర్ సమస్యకూడా తలెత్తకపోవడంతో నిర్విరామంగా 200 రిజిస్ట్రేషన్లు జరిగాయి. మధిరలో 35, బుర్గంపహాడ్‌లో ఐదు, కల్లూరులో 23, వైరాలో 40, కుసుమంచిలో 75, కొత్తగూడెంలో 35, భద్రాచలంలో 1, ఖమ్మం రూరల్‌లో 32, ఇల్లెందులో నాలుగు, సత్తుపల్లిలో 30 డాక్యుమెంట్లు రిజిస్ట్రర్ అయ్యాయి.

అన్ని ఏర్పాట్లు చేశాం

భూముల విలువల పెంపుపై అన్ని ఏర్పాట్లు చేశాం. కాడ్‌లో కూడా నమోదైయాయి. ప్రభుత్వం నుంచి జీవో రాగానే పెరిగిన విలువలతో రిజిస్ట్రేషన్లు చేస్తాం. ఆరునెలల వ్యవధిలోనే ప్రభుత్వ మార్కెట్ విలువలు పెరగడం వల్ల వినియోగదారులకు ప్రయోజనాలు ఉన్నాయి. వ్యవసాయ భూములపై రుణ పరపతి పెరుగుతుంది. అమ్మకం దారులకు రెట్టింపు అదాయం వస్తుంది. ప్రభుత్వ అసవరాలకు భూములను సేకరించినట్లయితే భూమి యజమానులకు అధికంగా నష్టపరిహారం అందుతుంది.
– అడప రవీంధ్రబాబు,
సబ్ రిజిస్ట్రార్ 1, ఖమ్మం అర్బన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News