Saturday, January 18, 2025

రెవెన్యూలో.. రాబందుల రాజ్యం

- Advertisement -
- Advertisement -

పాలమూరు జిల్లాలో ప్రభుత్వ అసైన్డ్,
భూదాన్ భూములన్నీ హాంఫట్
మహబూబ్‌నగర్, భూత్పూర్, జడ్చర్లలో భూదందా
ప్రజాప్రతినిధులకు, రియల్టర్లకు ధారాదత్తం
చక్రం తిప్పిన కలెక్టర్లు, తహశీల్దార్లు, డిటిలు
రూ. కోట్లలో జేబులు నింపుకున్న వైనం
భూముల విలువ రూ. వేల కోట్లలోనే..
ఈడీ విచారిస్తే పేలనున్న అవినీతి ఆటంబాంబులు

పాలమూరులో పెద్ద ఎత్తున భూకబ్జాలు

మహబూబ్‌నగర్ మున్సిపాల్టీ,మండల పరిధిలో కూడా చెరువులు,కుంటలు, దేవుని మాన్యాలు, అసైన్డ్ భూములు, భూదాన్ భూములు కూడా ఆన్యాక్రాంతంకు గురయ్యాయి. గతంలో కాంగ్రెస్ నాయకుడు ఒకరు సాక్షాధారాలతో సహా బయట పెట్టారు.అయితే వాటిపై ఇప్పటికీ అతిగతీ లేదు. మున్సిపాల్టీతో పాటు రూరల్ మండల పరిధిలో కూడా వందల కోట్లు విలువ చేసే బూములన్నీ ఆక్రమణకు పాల్పడ్డారు. సర్వే నెంబర్ 523 95 ఎకరాలకు గానూ వాటిలోనూ కబ్జాలు జరిగాయి. దేవుని మాన్యాలు, అసైన్డ్ భూములు, ట్రస్ట్ భూములు కూడా అన్యాక్రాంతంకు గురైనట్లు ఆరోపణలు వచ్చాయి.

మన తెలంగాణ/ మహబూబ్‌నగర్ బ్యూరో : మహబూబ్‌నగర్ జిల్లాలో గత ప్రభుత్వంలో ప్రజా పాలన కంటే దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు.. పరిపాలన పేరుతో ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా ఆక్రమించుకున్నారు. పేదలకు కాస్తంత జాగా ఇవ్వకుండా,నిరుపేదలకు డబుల్ బెడ్ రూంలు ఇవ్వకుండా పేదల పేర్లతో మభ్య పెట్టి వ్యక్తిగత ఆస్తులను కోట్లలో సంపాదించుకున్నారు. ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సి కొందరు ( అందరూ కాదు నిజాయితీపరులు కూడా ఉన్నారు).

రెవెన్యూ రాబందులు ప్రభుత్వ భూములను రాజకీయ నాయకుల కాళ్ల దగ్గర దారాదత్తం చేశారు. రాజకీయనాయకులు, రియల్టర్లు ఇచ్చే మోచితీ నీళ్లు తాగి వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ అసైన్డ్, భూధాన్,శీలింగ్ భూములు, దేవాలయభూములు, చెరువులు, కుంటలు, అడవులను సైతం అప్పనంగా అప్పగించారు. భావీ తరాలకు అందాల్సిన సహజ వనరులన్నింటినీ నిట్టనిలువునా దోచుకుతిన్నారు. ఈ వ్యవహారంలో గత ప్రభుత్వంకు జీ హుజూర్ అంటూ నిబంధనలకు గాలికి వదిలేసి నిసిగ్గుగా ప్రభుత్వ ఆస్తులను రాసిచ్చారు. ఈ తతంగంలో కొందరు కలెక్టర్లు మొదలుకొని తహశీల్దార్లు, డిప్యూటి తహశీల్దార్ల వరకు ఉన్నారు.

భూకబ్జాల విధ్వంసం

ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏ సమావేశంలోనేనా ఓకే పదం అంటున్నారు. అదే పాలమూరు విద్వంసం జరిగిందని…నిజంగా పాలమూరు జిల్లా విద్వంసం జరిగిందనే చెప్పాలి. పరిపాలన ఏమో కాని ప్రజలకు ఉపయోగపడాల్సిన సహజ సంపదంతా దోచుకుతిన్నారు. మహబూబ్‌నగర్ మున్సిపాల్టీ, రూరల్ మండలం, జడ్చర్ల, భూత్పూర్, బాలనగర్, రాజాపూర్ మండలాల్లో ఉన్న ప్రభుత్వ భూములన్నీ ఆక్రమణకు,అన్యాక్రాంతంకు గురయ్యాయి. వేల కోట్లు విలువ చేసే భూములన్నీ రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్లాయి.కలెక్టర్లకు ఉన్న ఎన్‌ఒసి (నో అబ్జెక్సన్ సర్టిఫికెట్) ఇచ్చే అధికారం ఆధారంగా ప్రభుత్వ భూములన్నీ మార్పులు చేసి ధరణిలో రిజిష్టర్ చేయించుకొన్నారు.

అంతేకాదు రైతు బందు డబ్బులను కూడా దండుకున్నారు. ఎన్‌ఓసిల పేర్లతో తహశీల్దార్లు,ఆర్‌డిఓలు,కలెక్టర్లు కొందరు ( గతంలోని వారు ) అందిన కాడికి వెనుకేసుకున్నారు.జడ్చర్లలో 422 ఎకరాలు, భూత్పూర్‌లో 1068 ఎకరాలు, మహబూబ్‌నగర్‌లో సుమారు 300 ఎకరాలు భూధాన్ బూముల్లో చాలా వరకు అన్యాక్రాంతం అయ్యాయి. భూత్పూర్‌లో అయితే పెద్ద ఎత్తున బూధాన్ భూములన్నీ రియల్ ఎస్టేట్‌గా మారి పోయాయి. కొందరు రాజకీయ గద్దలు కోట్లలో వెనుకేసుకున్నారు. భూత్పూర్‌కు చెందిన గత పార్టీ నాయకుడు, ప్రస్తుత ప్రజాప్రతినిధి ఒకరు పెద్ద ఎత్తున బూధాన్ భూములను బినామీ పేర్లపై రాయించుకొని ప్లాట్లుగా మార్చుకొని విక్రయించుకున్నారు. అదే విదంగా గతంలో బిఆర్‌ఎస్ పార్టీలో కొనసాగి ప్రస్తుతం అధికార పార్టీలో కొనసాగుతున్న మరో నాయకుడు కూడా ఈ భూముల వ్యవహారంలో ఉన్నట్లు సమాచారం. ఇక జడ్చర్లలో కూడా పెద్ద ఎత్తున భూధాన్ భూములన్నీ హాంఫట్ చేశారు.

చక్రం తిప్పిన కొందరు రెవెన్యూ అధికారులు

గత ప్రభుత్వ హాయంలో ప్రజలకు ఉపయోగపడే పనుల కంటే రాజకీయ నాయకుల పనులను చక్కబెట్టుందుకే కొందరు రెవెన్యూ అధికారులు ఎక్కవ ఆసక్తి కనబర్చారు. రెవెన్యూలో కొందరు అధికారులు సిబ్బంది నిజాయితిగా ఉన్నప్పటికీ వారిపై లేనిపోనివి చెప్పి బదిలీ చేయించేవారు. దీంతో తహశీల్దార్ కార్యాలయాలను వారి అదుపాజ్ఞలో ఉంచుకోని ఇష్టారాజ్యంగా రికార్డులను మార్చడం, తారుమూరు చేయడం, తగదాలు పెట్టడం వంటి అనేకం పెట్టి పేద రైతులకు, మాజీ రిటైర్ట్ సైనికుల భూములను సైతం మార్పులు చేసి మాయ చేశారన్న ఆరోపణలు వచ్చాయి.

ఎన్‌ఒసిల పేరుతో కాసుల పంట పండించుకున్నారు.ఈ వ్యవహారంలో కొందరు కలెక్టర్లు పెద్ద ఎత్తున పాలమూరు జిల్లా పరిధిలో కోట్లు విలువ చేసే భూములు సైతం కొనుగోలు చేశారంటే వారి అవినీతి ఎలా సాగిందో ఊహించుకోవచ్చు. తలాపాపం తిలా పిడికెడు అన్న చందంగా ప్రభుత్వ ఆస్తులను అన్యాక్రాంతం చేయడంలో రాజకీయ నాయకులకు చేసిపెట్టి వారిచ్చే ముడుపులతో భూములను,ఆస్తులను కొనుగోలు చేశారు. బినామీ పేర్లత పెద్ద ఎత్తున కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

పేదలకు కనీసం డబుల్ బెడ్‌రూంలు ఇవ్వని రాజకీయ నేతలు, రెవెన్యూ ఉన్నతాదికారులు వారు మాత్రం కోట్లలో ఆస్తులను వెనుకేసుకున్నారు. తహశీల్దార్ కార్యాలయాల్లో ప్రభుత్వ భూములపై అనుభవం ఉన్న డిటిలు, తహశీల్దార్లతో ఈ తప్పుడు పనులు చేయించి కోట్లు వెనుకేసుకున్నట్లు ఆరోపణలు వచ్చా యి. ఈ వ్యవహారంలో వారు కూడా భూములు,ఆస్తులు పెద్ద ఎత్తున పాలమూరు,నవాబుపేట,రాజాపూర్, బాలానగర్, హైదరాబాద్, జాతీయ రహదారుల పక్కన కొనుగోలు చేసుకున్నారు. ఈ వ్యవహారాలపై ఈడి,సిబిఐ విచారణ చేస్తే ఆటంబాంబుల్లా అవినీతి పేలుతుందన్న చర్చ నడుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News