లంచం తీసుకుంటూ మంథని ల్యాండ్ సర్వేయర్ ఏసిబికి చిక్కడంతో మంథని రెవెన్యూ కార్యాలయంలో కలకలం రేగింది. భూ సర్వే కోసం ఓ రైతు వద్ద డబ్బులు డిమాండ్ చేసిన సర్వేయర్ గణేష్ డబ్బులు తీసుకుంటూ గురువారం రాత్రి ఏసిబి అధికారులకు రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. ఏసిబి డిసీబీ డిఎస్పి వివి రమణమూర్తి కథనం ప్రకారం… మంథని మండలం రెవెన్యూ సర్వేయర్‌గా పని చేస్తున్న జాటోతు గణేష్ మంథని రెవెన్యూ గ్రామ శివారులోని రెడ్డి చెరువు వద్ద సర్వే నంబర్ 814/డి/1,815/సి లో ఒక ఎకరం భూమిని కొలిచేందుకు రైతు సువర్ణ క్రాంతి దగ్గర రూ.17 వేలు డిమాండ్ చేశాడని తెలిపారు.
ఈనెల 5వ తేదీన రూ.9 వేల రుపాయలు తీసుకొని మళ్లీ డబ్బులు డిమాండ్ చేయడంతో రైతు ఏసిబిని ఆశ్రయించాడని పేర్కొన్నారు. మరో రూ.3 వేలు రెండవ వాయిదా కింద గురువారం ఇస్తానని ఫోన్ చేయగా ఆఫీస్‌కు కాకుండా బస్టాండ్‌కు రమ్మని బాధితుడికి చెప్పడంతో బాధితుడు బస్టాండ్‌లో రూ.3వేలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని ఎసిబి అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఏసిబీ సిఐలు తిరుపతి, కృష్ణ కుమార్,హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్, కానిస్టేబుల్ శ్రీకాంత్‌తో పాటు అశోక్, సంతోష్‌లు ఉన్నారు.