ఇండోనేసియాలోని సుమత్రా దీవిలో కుండపోత వర్షాల కారణంగా వచ్చిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడ్డం కారణంగా కనీసం 10 మంది చనిపోగా, మరో పది మంది గల్లంతయినట్లు అధికారులు శనివారం తెలిపారు. పశ్చిమ సుమత్రా ప్రావిన్స్‌లోని పెసిసిర్ సెలాటన్ జిల్లాలో శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కొండపైనుంచి టన్నుల కొద్దీ బురద, బండరాళ్లు, విరిగిపడిన చెట్లు దొర్లుకొని వచ్చి నదిలో పడడంతో నది కరకట్టలు తెగిపోయి కొండను ఆనుకుని ఉన్న గ్రామాలను వరద ముంచెత్తినట్లు స్థానిక విపత్తుల నిర్వహణ ఏజన్సీ అధిపతి డోనీ యుస్రిజాల్ చెప్పారు.
తీవ్రంగా దెబ్బతిన్న కోటోజీ తరుసన్ గ్రామంలో ఏడుగురి మృతదేహాలను, పక్క గ్రామాల్లో మరో ఇద్దరి మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీసినట్లు ఆయన చెప్పారు. పదుల సంఖ్యలో జనం జాడ తెలియడం లేదని ఆయన తెలిపారు. వరదలు, కొండచరియలు 14 ఇళ్లను నేలమట్టం చేయడంతో పాటుగా మరో 20 వేల ఇళ్లు పైకప్పుదాకా మునిగిపోయాయని ఆయన చెప్పారు. దీంతో దాదాపు 46 వేల మంది తాత్కాలికంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్‌లోకి పరుగులు తీసినట్లు ఆయన చెప్పారు. విద్యుత్ లేకపోవడం, బురద, శిథిలాలతో రోడ్లు మూసుకుపోవడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడినట్లు ఆయన చెప్పారు.