బనిహాల్ /జమ్ము : జమ్ము లోని భగవతి నగర్ శిబిరం నుంచి శనివారం తెల్లవారు జామున అమర్‌నాథ్ యాత్రకు బయలుదేరిన 3472 మంది యాత్రికుల కాన్వాయ్ మార్గమధ్యలో రాంబాన్ వద్ద కొంతసేపు ఆగిపోయింది. భారీ వర్షాలకు జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలో రెండు చోట్ల కొండ చరియలు విరిగిపడడంతో కొద్దిసేపు ఆపవలసి వచ్చిందని అధికారులు తెలిపారు. 270 కిమీ పొడవున్న ఈ జాతీయ రహదారిలో మెహర్, డాల్వాస్ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. వాటి శిధిలాలను తొలగించిన తరువాత ట్రాఫిక్‌ను మళ్లీ పునరుద్ధరించారు.
Also Read: మణిపూర్ ఫైల్స్ పేరుతో సినిమా తీయాలి : ఉద్ధవ్ థాక్రే
20 వ బ్యాచ్‌లో 3472 మంది యాత్రికులు జమ్ము లోని భగవతి నగర్ స్థావరం నుంచి అమర్‌నాథ్ యాత్రకు శనివారం తెల్లవారు జామున మొత్తం 132 వాహనాల్లో బయలు దేరారు. మధ్యాహ్నానికి వారు బనిహాల్ చేరుకున్నారు. కొద్ది సేపు పోయిన తరువాత వీరు బయలుదేరడానికి అనుమతించారు. వీరిలో 2515 మంది పహల్‌గామ్ నుంచి , మరో 957 మంది గండెర్‌బల్ జిల్లా బల్తాల్ రూటు నుంచి అమర్‌నాధ్ గుహకు వెళ్లేలా ఏర్పాట్లు జరిగాయి. జులై 1 నుంచి ఇప్పటివరకు మూడు లక్షల మంది యాత్రలో పాల్గొన్నారు.