Sunday, December 22, 2024

ఉత్తరాది జలవిల..

- Advertisement -
- Advertisement -

సిమ్లా : వానవరద నీటిలో నానినాని మునిగిపోతున్నపలు అంతస్తుల కాంక్రీటు భవనాలు, పడవలలాగా కొట్టుకుపోతున్న కార్లు, వాహనాలు, అతలాకుతలం అయిన జనజీవితం. ఇదీ ఇప్పుడు ఉత్తర భారతంలో సకాలంలో ప్రవేశించి హిమాలయాల్లో జల విలయం సృష్టించిన వైనానికి తార్కాణం. దాదాపు అర్థశతాబ్ధంలో ఎప్పుడూ లేని స్థాయిలో కురిసిన భారీ వర్షాలతో పంటపొలాలు నీట మునిగిపోతున్నాయి. నివాసిత ప్రాంతాలు చెరువులు అవుతున్నాయి. ఉత్తరభారతంలో ఇప్పటి వర్షంతో ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలు తల్లడిల్లుతున్నాయి. ప్రత్యేకించి పర్యాటక కేంద్రం అయిన హిమాచల్ ప్రదేశ్‌లో పరిస్థితి దారుణంగా మారింది.

మంచుచరియలు విరిగి పడిన, ఇప్పటికీ దొర్లుకుంటూ చాలా ఎత్తు నుంచి పడుతున్న చరియలతో ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. కొండచరియలు విరిగి పడిన ఘటనల్లోమరో నలుగురు దుర్మరణం చెందారు. 200 మందికి పైగా జలదిగ్బంధంలో చిక్కుపడ్డారు. వీరిని రక్షించేందుకు సహాయక బృందాలు వాతావరణాన్ని ఎదిరించి శ్రమిస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిపడుతున్న భారీ వరదలతో పలు నదులు పొంగిపొర్లుతున్నాయి. జనావాస ప్రాంతాలను కోసుకుంటూ దూసుకువెళ్లుతున్నాయి. ఢిల్లీలో యమునా నది ప్రవాహం పోటెత్తింది.ప్రత్యేకించి హిమాచల్ ప్రదేశ్‌లోని పర్వత ప్రాంతాల్లో నెలకొని ఉన్న పర్యాటక కేంద్రాలకు తరలివచ్చిన బహుదూరపు యాత్రికులు నానా పాట్లు పడుతున్నారు.

సిమ్లాలో కొండచరియలకు నలుగురు బలి
వరదలతో సిమ్లా ప్రాంతం ఎక్కువగా దెబ్బతింది.కొండచరియలు విరిగిపడటంతో సిమ్లా, సిమ్లా కల్క ప్రాంతాలలో నలుగురు చనిపొయ్యారు. సిమ్లా , సిమ్లా కల్కా హైవే సోమవారం ఉదయం నాటి భారీ వర్షాలతో నిలిచిపోయింది. ఈ పర్వత రాష్ట్రంలో వరుసగా మూడోరోజు కూడా వాన వరదల తీవ్రస్థాయి భీభత్సం సృష్టించింది. గత రెండు రోజుల్లో వర్షాలతో జరిగిన ప్రమాదాలకు దాదాపు 17 మంది చనిపోయినట్లు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ తెలిపారు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ప్రాంతం అయిన సిమ్లా కల్కా రూట్లో రాకపోకలను మంగళవారం వరకూ నిలిపివేశారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలలో స్థానిక అధికార యంత్రాంగం తోడుగా జాతీయ విపత్తు సహాయక చర్యల బృందాలు (ఎన్‌డిఆర్‌ఎఫ్), రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలు (ఎస్‌డిఆర్‌ఎఫ్) లు సమన్వయంతో వ్యవహరిస్తున్నాయి.

స్పందించిన అధికార , రాజకీయ యంత్రాంగం
ఉత్తరభారతంలో జలవిలయం పరిస్థితిపై ఓ వైపు అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. మరో వైపు ప్రస్తుత పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరభారతానికి చెందిన పలువురు సీనియర్ మంత్రులతో, అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. బాధితులను తగు విధంగా ఆదుకోవాలని ఆదేశించారు. హిమాచల్ ప్రదేశ్‌లో పరిస్థితిని రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మంగళ, బుధవారాల వరకూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలియచేయడంతో , పెద్ద ఎత్తున ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలంతా తమతమ నియోజకవర్గాలకు పరిమితం అయ్యి సహాయక చర్యలను చేపట్టాలని సూచించారు. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ఇప్పటి పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత రాష్ట్రాలకు వెంటనే కేంద్ర ప్రభుత్వం పిఎం కేర్స్ ఫండ్ నుంచి అదనపు సాయం అందించాలని కోరారు. హిమాచల్ ప్రదేశ్ సిఎంతో ఫోన్‌లో మాట్లాడారు.

పరిస్థితిని బట్టి ప్రజల తరలింపు ః కేజ్రీవాల్
దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది ఉప్పొంగిన దశలో పరిస్థితిపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. పల్లపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విషయంపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. అయితే నది 206 మీటర్ల ప్రమాద సూచీని దాటితే వెంటనే పల్లపు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడం జరుగుతుందని విలేకరులకు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News