కేరళలో విషాద ఘటన చోటుచేసుకుంది. వయనాడ్ జిల్లాలో మెప్పాడి సమీపంలోని కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో కొండచరియల క్రింద వందలాది మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 42 మంది మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న కేరళ విపత్తు నిర్వహణ సంస్థ, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈఘటనలో గాయపడినవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
కొండచరియలు విరిగిపడిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. వయనాడ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడిన విషయం తెలిసి ఆందోళనకు గురయ్యానని చెప్పారు. ప్రమాదంలో గాయపడిన, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల చుట్టూ తన ఆలోచనలు తిరుగుతున్నాయన్నారు. కేరళ సీఎం పినరయి విజయన్‌తో మాట్లాడి కేంద్రం నుంచి అవసరమైన అందిస్తామని చెప్పామని ప్రధాని తెలిపారు.
“కొండ చరియలు విరిగిపడిన వార్త విని ఆవేదనకు గురయ్యాను. మృతుల కుటుంబాలకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నా” అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.