మేయర్ దత్తతతో 15 రోజుల్లో సుందరీకరణ
హైదరాబాద్: నిన్నటి వరకు కాలుష్యా వ్యర్థాలు, గుర్రపు డెక్కతో కంపుకొట్టిన లంగర్‌హౌజ్ చెరువు రూప రేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ చెరువును జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి దత్తత తీసుకోవడంతో ఆగమేఘాలతో సుందరీకరణ బాట పట్టింది. లంగర్‌హౌజ్ చెరువును అభివృద్ది పర్చాలన్నా పురపాలక శాఖ మంత్రి ఆదేశాల మేరకు మేయర్ విజయలక్ష్మి ఈ చెరువుతో పాటు ఆక్కట ఉన్న హుడా పార్కును దత్తతకు తీసుకున్న విషయం తెలిసిందే… ఇందులో భాగంగా ఈనెల 4 వ తేదీన మేయర్ విజయలక్ష్మి లంగర్ హౌజ్ చెరువను సందర్శించడమే కాకుండా సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని అదేశించారు.
దీంతో అధికారులు చెరువలో పేరుకుపోయిన గుర్రపు డెక్కతో పాటు కాలుష్యా వ్యర్థాలను తొలగించి చెరువును పరిశుభ్ర పర్చారు. గుర్రపు డెక్క తొలగింపు ప్రక్రియతో పాటు చెరువులో దోమల నివారణకు జిహెచ్‌ఎంసి యు.బి.డి, ఎంటమాలజి శాఖలు సమన్వయంతో యాంటీ లార్వా ఆపరేషన్‌ను నిర్వహించారు. జిహెచ్‌ఎంసి ఖైరతాబాద్ జోన్ అధికారులతో పాటు ఎంటమాలజీ విభాగం సిబ్బంది సమిష్టి కృషితో 15 రోజుల్లో ఈ పనులను పూర్తి చేశారు. మేయర్ ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించడంతో పాటు అధికారులపు అప్రమత్తం చేయడంతో 41 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు పూర్తిగా పరిశుభ్రంగా మారింది. చెరువు పరిశుభ్రతకు విశేష కృషి చేసిన వివిధ విభాగాల అధికారులు, సిబ్బందిని మేయర్ విజయలక్ష్మి అభినందనలను అందుకున్నారు.
హెచ్‌ఎండిఎ పార్కుకు మహార్ధశ
చెరువుతో పాటు అక్కడ ఉన్న హెచ్‌ఎండిఎ పార్కు అభివృద్ది సైతం మేయర్ విజయలక్ష్మి శ్రీకారం చుట్టారు. ఈ పార్కును సుందరీకరణ బాధ్యతలను యుబిడి విభాగం అధికారులకు అప్పగించారు. పార్కులో వాకింగ్ ట్రాక్‌తో పాటు పూర్తిగా ఆహ్లాదకరాన్ని పంచే విధంగా ఈ పార్కును తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా సువాసను వెదజల్లే ప్రత్యేక మొక్కలను నాటుతున్నారు. ఈ పార్కు సుందీకరణ పూరైతే పరిసర ప్రాంతాల్లో 40 కాలనీలో నివాసం ఉంటున్న 3 లక్షల మందికి ఉపయోగపడనుంది.