Monday, December 23, 2024

భాషా సాంస్కృతిక ఉద్యమ విజేత

- Advertisement -
- Advertisement -

 

Telangana

తొలి, మలిదశ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలకు సాహిత్య సాంస్కృతిక మూలాలే పునాదిగా నిలిచాయి. ఎన్ని బాధలైనా పడతాం కానీ నా భాషను గేలిచేస్తే నా సంస్కృతిని తక్కువ చేసి చూస్తే మాత్రం సహించమని తన భాషా సాహిత్య అస్తిత్వ జెండాతో తెలంగాణ తిరుగబడింది. అదే ఆధిపత్య సాహిత్య, సాంస్కృతిక వాదాలను తిప్పికొట్టింది.హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ లో కలిపేసినాక తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక మూలాన్ని తొక్కేశారు. ఇక్కడి సాహిత్యాన్ని కనుమరుగు చేశారు. ఆధిపత్య భాషను, ఆధిపత్య సంస్కృతిని తెలంగాణపై రుద్దారు. దీనితో తెలంగాణ తల్లడిల్లింది. పాఠ్యపుస్తకాల్లో, సినిమాల్లో ఆధిపత్య భాష చెలామణి అయ్యింది. తెలంగాణ భాషను హాస్యానికి విలన్ల భాషగా మార్చేశారు. సినిమాల్లో హాస్యం పండించటానికి తెలంగాణ ఉన్నత భాషను దిగజార్చారు.

విలన్లు మాట్లాడే భాషకు తెలంగాణ భాషను జతకట్టారు. ఆంధ్రా ఆధిపత్యవాదుల అహంకారంపై తన భాష, తన యాస, తన సంస్కృతిక మూలాలు, తన నేల ఆదిమూల భాషను మహా యుద్ధాలుగా మలి దశ తెలంగాణ ఉద్యమానికి శంఖారావం పూరించి, చారిత్రక సందర్భానికి తెరలేపిన తెలంగాణ భాషా సాంస్కృతిక యుద్ధయోధుడు, మలిదశ తెలంగాణ భాషోద్యమకారుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. కేసీఆర్ పరిణితి చెందిన రాజకీయ నాయకుడు, ఉద్యమకారుడు, ఉద్యమ రథాన్ని నడిపించిన యోధుడు మాత్రమే కాదు ఆయన తనువంతా తల్లి భాషను నింపుకుని కదిలిన తెలంగాణ భాషా ఉద్యమ కరవాలం. తరతరాలుగా అణగదొక్కబడ్డ సాహిత్య సాంస్కృతిక నూన్యతతో తల్లడిల్లుతున్న జాతికి భాషా సాంస్కృతిక ఉద్యమ ఔషధమిచ్చి జాతిని కదిలించిన భాషా ఉద్యమకారునిగా కేసీఆర్ తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. రాష్ట్రం రాక ముందు గెలిచేయబడ్డ తెలంగాణ భాష ఎక్కడ? రాష్ట్ర అవతరణ తర్వాత తెలంగాణ భాషకు పట్టాభిషేకం జరిపి పాఠ్యపుస్తకాల దగ్గర్నుంచి సినిమా భాష వరకు తెలంగాణదనంతో, తెలంగాణ నుడికారంతో పరవశిస్తున్నాయి. ఇది తెలంగాణ జాతి ఆత్మగౌరవ జెండాను వినువీధుల్లో ఎగురవేయటమే కాకుండా విశ్వసాహిత్య వేదికపై తెలంగాణ భాషా జెండాను గర్వంగా ఎగురవేసిన స్థితి నెలకొంది. ఇది అపూర్వమైనది.

తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి గెలిచి, నిలిచి రాష్ట్రం సాధించుకున్నాక తెలంగాణ సాహిత్య సాంస్కృతిక పురావైభవాన్ని చూడగలుగుతున్నాం. కాళోజీ అన్న రెండున్నర జిల్లాల ఆదిపత్య భాష స్థానంలో తెలంగాణ భాష నిండుకుని పాఠ్య పుస్తకాలలోకి వెళ్లింది. సినిమా హీరోలు తెలంగాణ భాషను వాడితేనే అవి హిట్టు కొట్టే దశకు వచ్చింది.విలన్ల భాష, హాస్యానికి ఉపయోగించిన భాష హీరో భాష అయ్యింది. ‘ప్రతిఘటన’ సినిమాలో కోట శ్రీనివాసరావు మాట్లాడిన ‘పొగడ్తందా? తిడతాందా?’ అన్న విలన్ భాష ఇపుడు తెలుగు హీరోల హిరాయి భాష అయ్యింది. ‘అంతం’ సినిమాలో కోట శ్రీనివాసరావు నేను దేనికైనా ‘ఖండిస్తాన్నా‘ అన్న కామెడీ భాష ఇపుడు సినీ హీరోలు నాగార్జున, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్లలు తెలంగాణ భాషను మాట్లాడుతున్నారు. తెలుగు సినిమా హీరోలు తెలంగాణ భాషను గర్వంగా మాట్లాడుతున్నారు. అలాంటి ఉన్నతదశకు రావటానికి తెలంగాణ ఉద్యమమే కారణం.

దీన్ని ఒక సాంస్కృతిక విప్లవంగా తీర్చిదిద్ది ఉద్యమించిన కేసీఆర్నే కారణం. ఇపుడు రవీంద్ర భారతిలోని హాళ్లన్నీ సాంస్కృతిక సాహిత్య ఉద్యమ భావవాహిక కేంద్రాలుగా మారాయంటే అది స్వరాష్ట్రం సాధించుకున్న ఫలమే. రాష్ట్ర సాధన వల్లనే విలసీగావున్న భాష హిరాయిక్ గా మారింది. ప్రతినాయకంగా వున్న భాష నాయక భాషగా మారింది. దీనికి నాయకుడైన కేసీఆర్ కారణం. ఏ భాషా సంస్కృతినైనా కాపాడటానికి, నిరంతరం ఒక మహోజ్వలమైన ఉద్యమం అవసరం అది తెలంగాణ సమాజం చేసింది. అణిచివేతకు, అవహేళనకు గురైన భాషను తిరిగి నిలబెట్టి హీరో భాషగా మార్చిన ఉద్యమ నాయకుడు కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాషా అణిచివేతకు వ్యతిరేకంగా జరిగిన సాహిత్య సాంస్కృతిక ఉద్యమాన్ని ఊరూరా వాడవాడా తీసుకుపోయి కవులు, రచయితలు, కళాకారుల ధిక్కారస్వరాలను ఉద్యమ కాళికా నాలికగా చేసి తనను తాను తెలంగాణ భాషా సాంస్కృతిక గొంతుకగా మార్చుకుని లక్షల కంఠాలను గర్జించేలా చేసిన నాయకుడు కేసీఆర్. ఈ ఉద్యమ నాయకునికి వున్న మరో పార్శ్వం ఆయన నిరంతర అధ్యయన పరుడు కావటం. తానే ఉద్యమ పాటకు కోరసై పాడటం చేశాడు. కేసీఆర్ అందుకే సాహిత్య సాంస్కృతిక ఉద్యమ నాయకుడయ్యాడు.తెలంగాణ భాష ఇప్పుడొక ఆకర్షణ! ఒక మన ప్రాంతంలోనే మనం నోరు విప్పడానికి భయపడే వాళ్ళమయ్యాం. నీ భాష గ్రామ్యమని, దానికి రచనా యోగ్యత లేదని వెక్కిరించినా సహించాం. తెలంగాణ భాష తౌరక్యాంధ్రమన్నా భరించాం. ఇటు రాయలేక, అటు మాట్లాడలేక ఆలోచనల్ని, ఆవేదనల్ని గొంతులోనే దిగమింగుకున్నాం.

ఆత్మగౌరవ ఉద్యమం మొదలయ్యాక మనలో ఆత్మవిశ్వాసం పురి విప్పింది. ఉద్యమ కాలంలో మన ఉద్యమ నేతల ప్రసంగాలు, మన పాటలు, రచనలు తెలంగాణ భాషా సౌందర్యాన్ని, మన సంస్కృతి ఔన్నత్యాన్ని దేశానికి చాటి చెప్పినవి. ఒకప్పుడు సినిమాలలో, వివిధ సృజన రంగాలో తెలంగాణ భాషను అవమానించిన సందర్భాలు మనకు అనుభవమే. ఇవ్వాళ సినిమా కథానాయికా నాయకులు మాట్లాడే భాష తెలంగాణ భాష. ఒక సినిమా విజయవంతం కావాలంటే మన భాష ఇప్పుడో శక్తి వంతమైన సాధనం. సినిమాలే కాదు వ్యాపార ప్రకటనలు గుప్పించే కార్పొరేట్ శక్తులు కూడా మన భాష సహాయంతో ఉత్పత్తులను అమ్ముకుంటున్నాయి. హాస్య పాత్రా సంభాషణల ద్వారా మన ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసిన వారే తెలంగాణ భాషా రచయితల కోసం వెంపర్లాడుతున్నారు. ‘ట్రిపులార్’ సినిమాలో సుద్దాల అశోక్ రాసిన ‘కొమరుం భీముడో’ పాటకు లభిస్తున్న ఆదరణ మన భాష బలాన్ని చాటి చెబుతున్నది. జాతి రత్నాలు వంటి లోబడ్జెట్ సినిమా యావత్తు తెలంగాణ భాషలో నిర్మించి ఘన విజయాన్ని సాధించడం మనం చూశాం.

ప్రాంతేతర సినిమా హీరోలు తెలంగాణ భాషలో మాట్లాడడానికి నానా తంటాలు పడుతున్నారు. టివి కార్యక్రమాలలో తెలంగాణ భాష ఆధారంగా ఏదో ఒక పాపులర్ కార్యక్రమం ఉండనే ఉంటున్నది. బహిరంగ సభల్లో మన నాయకులు చేసే ప్రసంగాలు, ప్రెస్‌మీట్లల్లో మన వారి మాటల అందం అంతా ఇంత కాదు. తెలంగాణ భాష మీద మంచి పట్టున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రెస్‌మీట్లు ఇప్పటికీ అత్యంత జనాదరణీయమే. కారణం మన భాషలో ఉన్న సౌందర్యమే. తెలంగాణ కవులు, కథకులు ఆత్మ గౌరవ భాషలో భిన్నమైన రచనలు చేసి పాఠకుల మన్ననలు పొందుతున్నారు. ఇటీవల తెలంగాణ సాహిత్య అకాడమీ రాష్ట్రంలోని విద్యార్థుల సృజన శీలతను మేల్కొలుపుతూ ‘మన ఊరు- మన చెట్టు’ అనే అంశం మీద కథల పోటీ నిర్వహించింది. అయిదు లక్షల మంది పాల్గొన్నారు. అందులోంచి వేయి కథలు ఎంపిక చేసి కథా సంకలనం తేనుంది. ఇదో రికార్డు కూడ. ఇదెలా సాధ్యం అంటే ఇంటి భాష ఇచ్చిన ఆత్మ విశ్వాసమనే చెప్పాలి. తడుముకోకుండా, నిస్సంకోచంగా కథలల్లగలిగారు. ఇంటి భాషలో జాతి ఊపిరి దాగి ఉంటుంది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే మన భాష రాజ భాష అయ్యింది. తెలంగాణ ప్రాంత భాష వ్యవహారిక భాష అయ్యింది. తెలంగాణ భాష సాహిత్యంలో ఎలాగూ ఉంది. ఇప్పుడు సినిమా రంగంలోకి వచ్చింది. రాష్ట్రం రాకముందు వరకు కోస్తా సినిమాలు, కోస్తా నవలలు ప్రభావంతో మాట్లాడటం, ఆ పదజాలాలు వాడి రచనలు చేయటం జరిగేది. ఇప్పుడు తెలంగాణ పదజాలం వాడుతున్నాం.

మన భాషకు గొప్ప గౌరవాన్ని కల్పిస్తూ సినిమాలు తీస్తున్నారు. సినిమాలు అవసరాలు, వ్యాపార రీత్యా తీస్తున్నప్పటికీ తెలంగాణ వ్యవహారిక భాష వాడక తప్పనిస్థితి వచ్చింది. తెలంగాణ పల్లెలు, నగరాల్లో ఉండే భాషంతా ఇప్పుడు వ్యవహారిక భాషలోకి వచ్చింది. ఇప్పుడు తెలంగాణ మారుమూల మాండలిక భాషకాదు. 1956కు ముందు తెలంగాణ భాష ఇప్పుడులేదు. రాష్ట్రం వచ్చాక తెలంగాణ తన భాషను రూపొందించుకుని వ్యవహారిక భాషగా, రాత భాషగా మారింది. రాష్ట్రం వచ్చాక రెండున్నర జిల్లాల భాష నుంచి తెలంగాణ భాష విముక్తికి దారి దొరికింది. ఇప్పుడు తెలంగాణ కథ, నవల, సినిమాలలో తెలంగాణ భాష వాడకం పెరిగింది. ఇక మన భాష, మన తెలుగు, మన నేలతల్లి భాష, మన ఇంటి భాష అంతా వ్యవహారిక ప్రామాణిక భాషగా మారింది. సాహిత్యంలో కొంతమంది కవులు, రచయితలు, కథకులు మాట్లాడే రాసే భాష మాత్రమే కాదు మొత్తం సమాజం వ్యవహారిక భాష అయ్యింది. ‘సోపతి’ అన్న పదం ఇప్పుడు ఆర్‌ఆర్ సినిమాలోకి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ ల మధ్య వాళ్లిద్దరి సోపతి చర్చకు వచ్చింది. సినిమా మాస్ మీడియాలో తెలంగాణ భాష విస్తరించటం మంచి పరిణామం. ఇది రాష్ట్ర ఏర్పాటు వల్ల వచ్చింది. ఉద్యమ నాయకుడే పాలకుడు కావటం వల్ల కెసిఆర్ తెలంగాణ భాషను మరింత సుసంపన్నం చేస్తున్నారు. కెసిఆర్‌కు సాహిత్యంపై పట్టు ఉండటంతో ఆయన దార్శనిక ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ తనదైన భాష, తనదైన శైలి, తనదైన ముద్రలతో రూపాంతరం చెందుతుంది. వ్యవహారిక భాషగా విస్తరిస్తుంది. ఇది పెద్ద సాహిత్య సాంస్కృతిక విప్లవమే. దీనికి కర్త కర్మ క్రియ కెసిఆర్ ఆలోచనల విప్లవమే.

తెలంగాణ నిఘంటువుకు పూర్వరంగం సిద్ధం చేసే పనిలో సాహిత్య అకాడమి సన్నద్ధమవుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రంగాలను పునర్నిర్మిస్తున్న కెసిఆర్ తెలంగాణ సాహిత్య రంగాన్ని ఆత్మగౌరవ సాహిత్య రంగంగా తీర్చిదిద్ది దేశపటంపై నిలబెట్టే స్థాయికి తీసుకుపోవాలని మార్గ నిర్దేశం చేశారు. ఆ దిశగానే సాహిత్య అకాడమి అడుగులు వేస్తుంది. మన తెలంగాణలోని 33 జిల్లాల సాహిత్య చరిత్రలను ప్రత్యేకంగా రాయించి వెలుగులోకి తేవడం జరిగింది. రాష్ట్ర అవతరణ తర్వాత జరిగిన మార్పులన్నిటికి కారణం మనం స్వరాష్ట్రాన్ని సాధించుకోవడమే.

అందులో భాగంగా డా॥ సగిరి సుధారాణి రచన గోండ్వానా లాండు ఎంత ప్రాచీనమైనదో తెలుగు కూడా అంతే ప్రాచీనమైనది, శాతవాహనుల నుండి కాకతీయుల వరకు, కాకతీయుల నుండి అసఫ్ జాహీల వరకు గ్రంథాలకు గల చరిత్ర, సంస్కృతి, భాష, సాహిత్యంలపై పరిశోధనాత్మక వ్యాసాలు రాయించి ప్రచురించడం జరిగింది. ఇవి కాకుండా తెలుగుపై ఉర్దూ పారశీకముల ప్రభావం అని కె. గోపాల కృష్ణ రావు రాసిన పుస్తకాన్ని వెలుగులోకి తెచ్చారు. అదే విధంగా సాహిత్య విభాగంలో తెలంగాణ పద్య కవిత వైభవం – (డా. గండ్ర లక్ష్మణ రావు), తెలంగాణ పదసం కీర్తనలు (డా. పి భాస్కర యోగి), తెలంగాణలో భావ కవితా వికాసం – ( సామిడి జగన్ రెడ్డి), ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కవిత్వం – (డా. వెల్డండి శ్రీధర్) లాంటి ప్రసిద్దాలచే రచనలు చేయించి గ్రంథాలను వెలువరించటం జరిగింది.

జూలూరు గౌరీశంకర్
(తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News