జాతీయ విద్యావిధానం, త్రిభాషా సూత్రంపై తమిళనాడుకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం (21.3.2025) నాడు రాజ్యసభలో హిందీని సమర్థిస్తూ తమిళనాడుపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. హిందీ ఏ భాషకూ పోటీకాదని, అన్ని భాషలకూ సోదరభాష అని పేర్కొన్నారు. తెలుగు, తమిళం, పంజాబీ, అస్సామీ ఈ విధంగా అన్ని భాషలకూ ప్రాచుర్యం కల్పించడానికి మోడీ ప్రభుత్వం రాజ్యభాషా విభాగాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఇంజినీరింగ్, మెడికల్ విద్యను తమిళంలో అందించాలని తమిళనాడు ప్రభుత్వానికి గత రెండేళ్లుగా కోరుతున్నా పట్టించుకోవడం లేదని, మేం అధికారంలోకి వస్తే మెడికల్, ఇంజినీరింగ్ విద్యను తమిళభాషలోనే అందిస్తామన్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమిళనాడు ఓట్ల వేట కోసం ఇదో పాచిక తప్ప తమిళ భాషలో మెడికల్, ఇంజినీరింగ్ విద్యాబోధన ఎంతవరకు ఆయా అభ్యర్థులకు భవిష్యత్‌లో ప్రయోజనం కలిగిస్తుందో, దాని వల్ల ఉద్యోగాలు తమిళనాడుతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఎంతవరకు లభిస్తాయో ప్రశ్నార్థకమే. ఆంగ్ల (అల్లోపతి) వైద్య విద్యను హిందీలో బోధించే అధ్యాయానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా 2022 లో మధ్యప్రదేశ్‌లో తెరలేపారు. ముందుగా ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులకు అనాటమీ, బయో కెమిస్ట్రీ, ఫిజియాలజీలను హిందీలో బోధించాలని నిర్ణయించారు. ఇది స్థానిక వాదాన్ని బలపర్చడానికి బాగానే ఉన్నట్టు అనిపిస్తోంది. కానీ మధ్యప్రదేశ్‌లో హిందీలో వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులు ఉద్యోగాల వేటలో ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు, ఉదాహరణకు దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లినప్పుడు వారి హిందీ వైద్య విద్య ఎంతవరకు ఆచరణలో ప్రయోజనం కలిగిస్తుందో చెప్పలేం. హిందీ పాఠ్యగ్రంథాల్లో కూడా అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ అనే పదాలను ఉన్నది ఉన్నట్టు హిందీలోనే రాశారని తెలుస్తోంది. ఆ పదాలను హిందీలో ఎందుకు అనువదించలేకపోయారు? అలా అనువదిస్తే ఎవరికైనా అర్థం అవుతుందా? ఆంగ్లంలో ప్రాచుర్యం పొంది, స్థానిక ప్రాంతీయ భాషల్లో కలిసి మన వ్యవహారాల్లో వాడుక అవుతున్న ఆంగ్ల పదాలకు అచ్చమైన తెలుగు పదాలు సరిగ్గా ఉండవు. ఉదాహరణకు రైలు అనే ఆంగ్లపదం ఎవరికైనా సులువుగా అర్థమవుతుంది. దానిని తెలుగులో ధూమశకటం అని పిలిస్తే ఎవరికీ అర్థం కాక గందరగోళం ఏర్పడుతుంది. తెలుగు మాధ్యమంలో చదువుకొన్న పట్టభద్రులు బయట ఉద్యోగాలు దొరక్క, ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడలేక, అభాసుపాలైన ఉదంతాలు ఎన్నో కనిపిస్తాయి. ప్రాంతీయ భాషల్లో ఉన్నత చదువులు చెప్పొద్దని, చదవొద్దని, ఎవరూ అనరు. అది ఎంతవరకు ఉపయోగపడుతుందో అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఉదాహరణకు తెలుగు మాధ్యమంలోని సైన్స్ పుస్తకాల్లో వెన్నెముక కలిగిన జంతువులకు కశేరుకాలు, వెన్నెముక లేని జంతువులకు అకశేరుకాలు అని అనువాదం చేశారు. అది ఎవరికీ అర్థంకాక జుత్తుపీక్కుంటున్నారు. ఇలాంటి పదాలు నేర్చుకుని తెలుగు మాధ్యమ విద్యార్థులు ఏ రకంగా ఉద్యోగాలు సంపాదిస్తారు? అలాగే ఆంగ్ల వైద్య పుస్తకాలను తమిళంలో కానీ, హిందీలో కానీ అనువదించడం రాజకీయ పన్నాగమే తప్ప ఎవరికీ వాస్తవంగా ఎలాంటి ప్రయోజనం ఉండబోదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. వైద్యం లేదా ఇంజినీరింగ్ నిరంతరం జరిగే పరిశోధనల మీద, నూతన ఆవిష్కరణల మీద ఆధారపడి ఉంటాయి. కాలానుగుణంగా ఆధునికంగా వచ్చే పరిణామాల బట్టి బోధనాంశాలు మారుతుంటాయి. సాధారణంగా పరిశోధన గ్రంథాలు ఆంగ్లంలోనే ఉంటాయి. అలాంటప్పుడు ప్రజలకు అర్ధం కాని రీతిలో మాతృభాషలోకి పాఠ్యగ్రంథాలను అనువదించడం ఆయా అభ్యర్థులకు హాని చేయడమే అవుతుంది. ఇంజినీరింగ్ విద్యను మాతృభాషల్లో బోధించాలని నాలుగేళ్ల క్రితం కేంద్రం నిర్ణయించింది. ఆ మేరకు తెలుగుతోపాటు మరో నాలుగు ప్రాంతీయ భాషల్లో ఇంజినీరింగ్ విద్యాబోధనను దేశంలోని 14 ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలోని అణగారిన వర్గాలు, దళితులు ఇంజినీరింగ్ విద్యను సులభంగా నేర్చుకోడానికి ఇది తోడ్పడుతుందని సూచించారు. కానీ మాతృభాషల్లో ఇంజినీరింగ్ తదితర సాంకేతిక విద్యల బోధన అనే లక్షాన్ని సాధించాలంటే ఆంగ్లంలో ఉండే ఆయా పాఠ్యగ్రంథాలను విద్యార్థులు సులభంగా విద్యార్థులు అర్థం చేసుకునేలా ఆయా భాషల్లోకి అనువదింప చేయాలి. అలాగే మాతృభాషల్లో సాంకేతిక విద్యలు చదువుకున్న వారికి తప్పనిసరిగా మంచి ఉద్యోగాలు లభించేలా పాలకవర్గాలు బాధ్యత వహించాలి. అలా కాకుంటే ఆ వైఫల్యం మాతృభాషల్లో పైచదువులు చదువుకునే పిల్లల భవిష్యత్తుపై విపరీత ప్రభావం పడుతుంది. మాతృభాష గొప్పదే అయినా వాస్తవాలను పరిశీలిస్తే కిందిస్థాయి నుంచి పై వరకు తల్లిదండ్రులు తమ పిల్లలను ఆంగ్లంలో బోధించే ప్రైవేట్ పాఠశాలల్లోనే చేర్పించడం పరిపాటిగా సాగుతోంది. కొన్ని రాష్ట్రాలో ఒకటో తరగతినుంచే ఆంగ్లంలో బోధించే పద్ధతిని అనుసరిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ లభించని పరిస్థితుల్లో విద్యావంతులైన యువత ప్రైవేట్ రంగం పైనే ఆధారపడక తప్పడం లేదు. విదేశీ ప్రైవేట్ సంస్థలైతే ఆంగ్ల మాధ్యమంలో చదువుకొనే వారికే ప్రాధాన్యం ఇస్తుండటం అందరికీ తెలిసిందే. ఆంగ్లంలో చదువుకున్న వారికి గల ఉద్యోగ అవకాశాలు మాతృభాషా మాధ్యమాల్లో చదువుకునే వారికి ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడులో వైద్య, ఇంజినీరింగ్ విద్యాబోధనలను తమిళంలోనే అందించాలని కేంద్ర మంత్రి అమిత్ షా పట్టుపట్టడం చూస్తుంటే ఇదో పెద్ద రాజకీయా డ్రామా అనిపించక తప్పదు.
అమిత్ షా భాషా రాజకీయ డ్రామా
- Advertisement -
- Advertisement -
- Advertisement -