Wednesday, January 22, 2025

అంతరిస్తున్న భాషా సంస్కృతి

- Advertisement -
- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఏడు వేల భాషల్లో దాదాపు 500 వరకు భాషలు పూర్తిగా అంతరించి పోయాయి. ఇంకా వాడుకలో ఉన్న భాషల్లోనూ కొన్ని విలువైన సాహితీ ప్రక్రియలు, వైద్య సమాచారం, ఓషధుల విశేషాలు, ప్రకృతికి సంబంధించిన సమాచారం అంతరించాయి. మరికొన్ని భాషలు ఆఖరి శ్వాసలో ఉన్నాయి. యునెస్కో రూపొందించిన “వరల్డ్ అట్లాస్ ఆఫ్ లాంగ్వేజెస్‌” ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలో సుమారు రెండున్నర వేల భాషలు రానున్న కాలంలో అంతరించే స్థితిలో ఉన్నాయని తెలుస్తోంది. బహుభాషల వారసత్వ సంపదగా వాసిగాంచిన భారత దేశంలో భాషలు వికసించడానికి బదులు వినాశనమవుతున్నాయి. కారణాలు ఏమైనా కావచ్చు. కానీ ఆయా జాతుల , తెగల సంస్కృతికి ప్రతీకలుగా వినిపించే భాషలు అదృశ్యం కావడం ఆందోళన కలిగించే అంశమే. ఇటీవల నీలగిరి కొండల్లో కొన్ని గిరిజన తెగలు మాట్లాడే లిపిలేని తోడా భాష కూడా అంతరించిపోయే స్థితిలో ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ భాషకు లిపిలేకపోయినా, ఏభైకి మించిన ధ్వన్యక్షరాలు ఉన్నాయని ఆ భాషపై పరిశోధన చేస్తున్న పరిశోధకురాలు వాసమల్లి వెల్లడించారు.

తోడా భాషకు నిఘంటువు తయారు చేసే పనిలో ఆమె నిమగ్నమయ్యారు. ఈ భాష మాట్లాడే వారు నీలగిరి కొండల్లో కేవలం 1500 మాత్రమే ఉన్నారు. వారితోనే ఈ భాష అంతరించిపోతుంది. అండమాన్ నికోబార్ దీవుల్లో ‘బో’ భాష మాట్లాడగలిగే ఒకే ఒక్క 85 ఏళ్ల వృద్ధురాలు ‘ బోయెసర్’ 2010 జనవరి 26న పోర్ట్‌బ్లెయిర్ వద్ద చనిపోయింది. ఆమెతోపాటు ఆ భాషా సంస్కృతి సంప్రదాయాలు అదృశ్యమయ్యాయి. అండమాన్ ప్రజలు మాట్లాడే భాషలు ఎన్నో సరిగ్గా నిర్ధారించలేం. కానీ బో భాష మాట్లాడే పెద్ద కుటుంబానికి వారసురాలుగా మిగిలిన ఈ వృద్ధురాలు చిట్టచివరి వ్యక్తి కావడం విశేషం. కొన్ని నెలల్లో ఆమె చనిపోతుందనగా, యునెస్కోవారు ప్రపంచంలో అవసాన దశలో ఉన్న భాషల జాబితా వివరిస్తూ అట్లాస్ విడుదల చేశారు. అందులో భారతదేశం 196 భాషలతో అగ్రస్థానంలో ఉంది. ఆ జాబితాలో 197 భాషగా ‘తులు’ చేర్చారు. ఈ నేపథ్యంలో భాషల పరిరక్షణకు మరోవైపు ప్రయత్నాలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించి భాషల ప్రాజెక్టును గూగుల్స్ చేపట్టిన తరువాత కొన్ని వాస్తవాలు వెలుగు లోకి వచ్చాయి. దేశంలో భాషల పరిరక్షణకు కృషి చేస్తున్న సంస్థల్లో సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ( సిఐఐఎల్ ) ఒకటి.

ఏ భాష అయినా ప్రజల నాలుకలపై జీవిస్తే చాలు. ఎవరి గుర్తింపూ అక్కరలేదు. మాండలికమైనా సరే ఆ భాషను పరిరక్షించడానికి ప్రయత్నించడమే సిఐఐఎల్ కర్తవ్యం. ఇదే విధంగా అమెరికాలోని ఒరెగాన్‌లో లివింగ్‌టంగ్స్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఎండేంజర్డ్ లాంగ్వేజెస్ అనే సంస్థ భారత దేశం లోని గిరిజన భాషలపై అధ్యయనం సాగిస్తోంది. ముండా, టిబెటోబర్మన్ కుటుంబ భాషలతోపాటు బోండా (రెమో), దిదే, సోరా (ఒడిశా), ముండా (ఝార్ఖండ్),ఖసిన్ (మేఘాలయ), కోరోఅకా (అరుణాచల్ ప్రదేశ్ ) తదితర భాషలపై విస్తృతంగా అధ్యయనం చేస్తోంది. ఈ సంస్థ సేకరించిన సమాచారం ప్రకారం కేవలం మాటలకే పరిమితమైన భాషల్లో 50 శాతం భాషలే మనుగడ సాగిస్తున్నాయని తేలింది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఒడిశా, అంధ్రా సరిహద్దుల్లో గిరిజనులు మాట్లాడే సవర భాషపై వ్యావహారిక భాషా ఉద్యమ నేత గిడుగు రామమూర్తి ఎన్నో ఏళ్లుగా అధ్యయనం చేయడమే కాదు, వారితో కలిసిమెలసి వారి జీవన వ్యవహారాలను సంస్కృతిని పూర్తిగా తెలుసుకుని వెలుగులోకి తెచ్చారు. అంతవరకు లిపి అంటూ లేని సవరభాషకు నిఘంటువు తయారు చేసి చరిత్ర సృష్టించారు.

1961 జనాభా లెక్కల ప్రకారం 1652 భారతీయ మాతృభాషలున్నట్టు తేలగా, 1971 జనాభాలెక్కల ప్రకారం 109 భాషలు మాత్రమే ఉన్నట్టు తేలింది. ప్రతి మాతృభాషను భాషా వాదులు భాషగా గుర్తించక పోవచ్చు. 1971లో భాషల జాబితాను రెండు కేటగిరీలుగా విభజించారు. ఒకటి ఎనిమిదవ షెడ్యూల్ కింద రాజ్యాంగం ప్రకారం పరిగణించినవి కొన్ని కాగా, మిగతా భాషలు కనీసం పదివేల మంది మాట్లాడేవిగా లెక్కకట్టారు. పదివేల కన్నా తక్కువ మంది మాట్లాడే భాషలను ఒక గుంపుగా ఒకే ఒక్క కేటగిరిలో “ మిగతావి” అన్న విభాగంలో చేర్చారు. అప్పటినుంచి ఈ విధానం జనగణన జాబితాలో కొనసాగుతూ వస్తోంది. అధిక సంఖ్యలో వలస వచ్చే జనాభా కలిగిన దేశాల్లో జనాభా లెక్కల సేకరణ ఎంత క్లిష్టమైనదో తెలుస్తుంది. నిర్ధిష్టంగా భాషా స్థాయిలను బట్టి సేకరించిన జనాభా లెక్కలు ఎంతవరకు కచ్చితమైనవో ఏం చెప్పగలం? విచిత్రం ఏమిటంటే దాదాపు 310 భాషలు, ఐదుగురు కన్నా తక్కువ మంది మాట్లాడే 263 భాషలు, 1000 మంది కన్నా తక్కువ మంది మాట్లాడే 47 భాషలు చాలావరకు క్షీణదశలో ఉన్నాయి. ఈ అవసాన దశ లోని 310 భాషలు 1961 నాటి 1652 భాషల జాబితాలో ఉన్నవే. వీటిలో పది భాషలు మాత్రమే ప్రస్తుతం మనుగడ సాగిస్తున్నాయి.

మరోవిధంగా చెప్పాలంటే భారత దేశ భాషా వారసత్వ సంప్రదాయంలో ఐదో వంతు గత ఏభై ఏళ్లలో క్షీణదశకు చేరుకుందని నిర్ధారించవచ్చు. ఎన్ని భాషలను మనం పోగొట్టుకున్నామో తేల్చడానికి శాస్త్రీయ ప్రమాణాలు లేవు. కానీ ఇటీవల వృద్ధ తరానికి ( 60 నుంచి 80 ఏళ్ల వయసున్న వృద్ధులు), యువతరానికి ( 10 నుంచి 30 ఏళ్ల వయసున్న వారు) మధ్య భాషాపరమైన అంతరం ఇదివరకెన్నడూ లేనంతగా పెరుగుతోంది. ప్రస్తుతం యువకుల్లో చాలా మంది తమ మాతృభాషలో సరిగ్గా ఒక వాక్యమైనా రాయలేని పరిస్థితి కనిపిస్తోంది. వారి మాటల్లో ఎక్కువగా ఇంగ్లీష్‌తోపాటు ఇతర భాషల పదాలు చోటు చేసుకొంటున్నాయి. ప్రజాభాషలపై అధ్యయనంలో తేలిన ప్రధాన అంశాలను పరిశీలిస్తే తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్, ఝార్ఖండ్, ఒడిశా , ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపు 20 శాతం భాషలు అవసాన దశలో ఉన్నాయని తేలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News