కొలంబో : శ్రీలంకలో చమురు ధరలు ఆకాశాన్నంటాయి. ఆ దేశ చమురు విక్రయ సంస్థ లంక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఎల్‌ఐఒసి) శుక్రవారంనాడు పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను భారీగా పెంచింది. డీజిల్‌పై లీటరుకు రూ.75, పెట్రోల్‌పై లీటరుకు రూ.50 పెంచినట్లు ఎల్‌ఐఒసి ప్రకటించింది. శ్రీలంక రూపాయి మారకం విలువ భారీగా పడిపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా సంస్థ పేర్కొంది. ఈ ధరల పెరుగుదలతో శ్రీలంకలో లీటరు పెట్రోల్ ధర రూ.254, డీజిల్ ధర రూ.214కు లభిస్తుంది. గత కొన్ని దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా ఆ దేశం ఆర్థిక సంక్షోభం చిక్కుకోవడంతో ఇంధన ధరలు మునుపెన్నడూ లేని విధంగా పెరిగాయి. శ్రీలంక రూపాయి ఏడు రోజుల వ్యవధిలో యుఎస్ డాలరుతో పోలిస్తే రూ.57 క్షీణించింది. ఆ ప్రభావం ఇప్పుడు నేరుగా చమురు, గ్యాసోలిన్ ఉత్పత్తుల మీద పడింది. దీంతో ఆ చమురు, గ్యాసోలిన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రష్యాను ఏకాకిని చేయడానికి, అమెరికాతో సహ ఇతర పాశ్చాత్య దేశాలు మాస్కో మీద అనేక ఆంక్షలు విధించడం వల్ల చమురు, గ్యాస్ ధరలు పెరుగుదలకు కారణం అని ఎల్‌ఐఒసి మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ గుప్తా తెలిపారు.