శ్రీలంక అధ్యక్షుడి వైపే పార్లమెంట్ మొగ్గు
కొలంబో: గతంలో కనీవినీ ఎరుగని రీతిలో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకలో దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా కోసం ప్రజా నిరసనలు దేశవ్యాప్తంగా సాగుతున్న నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా ప్రతిపక్షం పార్లమెంట్‌లో ప్రవేశపెటిన అవిశాస తీర్మానం మంగళవారం వీగిపోయింది. అవిశ్వాస తీర్మానంలో అధ్యక్షుడు రాజపక్స మెజారిటీ ఓట్లతో విజయం సాధించారు. అధ్యక్షుడు రాజపక్సపై తమ అసంతృప్తిని వ్యక్తం చేసేందుకు అనుగుణంగా స్టాండింగ్ ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని కోరుతూ ప్రతిపక్ష తమిళ్ నేషనల్ అలయన్స్(టిఎన్‌ఎ) ఎంపి ఎంఎ సుమంతిరన్ మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన తీర్మానానికి వ్యతిరేకంగా 119 మంది ఎంపీలు ఓటు వేయడంతో తీర్మానం వీగిపోయింది. కేవలం 88 మంది ఎంపీలు మాత్రమే తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారని ది ఎకానమీ నెక్ట్ వార్తాపత్రిక తెలిపింది. అధ్యక్షుడు రాజపక్స రాజీనామా కోసం దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న నిరసనలను పార్లమెంట్‌లో తీర్మానం ద్వారా ప్రతిఫలించడానికి ప్రతిపక్షం చేసిన ప్రయత్నం ఓటమిపాలైనట్లు పత్రిక పేర్కొంది. తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసిన వారిలో కొత్తగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రణిల్ విక్రమసింఘె ఉన్నారని ప్రధాన ప్రతిపక్షం సమగి జన బలవేగయ(ఎస్‌జెబి) ఎంపి హర్ష ది సిల్వ తెలిపారు. తీర్మానాన్ని ఎస్‌జెబి బలపరిచింది.