Monday, December 23, 2024

శ్రీలంకలో మెజారిటీ కోల్పోయిన అధికార సంకీర్ణం

- Advertisement -
- Advertisement -

Sri Lanka crisis
కొలంబో: శ్రీలంకలో అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం తన మెజారిటీని కోల్పోయింది. సంకీర్ణం నుంచి కనీసం 47మంది శాసనసభ్యులు వైదొలిగారు. అనేక రోజులుగా నిరసనలు చెలరేగుతుండడం, ఆర్థిక సంక్షోభం తీవ్రం అవుతుండడంతో పూర్వపు మిత్రపక్షాలు అధ్యక్షుడి రాజీనామాను కోరుతున్నాయి. శ్రీలంక ఆర్థిక మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మరునాడే అలీ సాబ్రి రాజీనామా చేశారు. కాగా నిన్న(సోమవారం) రాజపక్స సాబ్రి సహా నలుగురు కొత్త మంత్రులను తన క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. శ్రీలంక ప్రతిపక్షాలు రాజపక్స ఆహ్వానాన్ని ‘తెలివితక్కువ’(నాన్‌సెన్సికల్) అని కొట్టిపారేయడమేకాక ఆయన రాజీనామాను డిమాండ్ చేశాయి. నేడు పార్లమెంటును తిరిగి సమావేశపరిచినప్పుడు పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ రంజిత్ సియంబలపితియ రాజీనామా చేశారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా అధ్యక్షుడి రాజీనామాను కోరుతూ నిరసనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. ఇదిలావుండగా శ్రీలంకలో రాజకీయ, ఆర్థిక పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) మంగళవారం తెలిపింది. శ్రీలంకలో దశాబ్దాలుగా ఇంతటి ఆర్థిక సంక్షోభం, అశాంతి ఎన్నడూ నెలకొనలేదని తెలిపింది. రాజపక్స కుటుంబం ఆర్థిక స్థితిని దుర్వినియోగం చేయడం వల్లే నేడు అక్కడ విదేశీ మారకం సంక్షోభం తలెత్తిందని ప్రజలు నిరసనలు చేస్తున్నారు. అక్కడి సెంట్రల్ బ్యాంక్ గవర్నర అజిత్ చబ్రాల్ సోమవారం తన పదవి నుంచి దిగిపోయారు. ఆదివారం రాత్రి అధ్యక్షుడు గొటాబయ రాజపక్స, ఆయన అన్న ప్రధాని మహింద రాజపక్స కాక మొత్తం 26 మంది మంత్రులు పదవుల నుంచి దిగిపోయారు. శ్రీలంకలో నిరసనలు పెరిగిపోతుండడంతో ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియాలను బ్లాక్ చేయాల్సిందిగా ముందు ఆదేశించారు. అయితే ఆదివారం రెండో అర్ధభాగంలో ఆ ఆంక్షలను ఎత్తేశారు. ప్రస్తుతం శ్రీలంక తీవ్ర ఆహార, ఇంధన, ఇతర ముఖ్యావసరాల కొరతను ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. బ్రిటన్ నుంచి 1948లో స్వాతంత్య్రం పొందిన శ్రీలంక ఇంతలా ఆర్థిక సంక్షోభాన్ని ఎన్నడూ ఎదుర్కొనలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News