Saturday, November 23, 2024

సూయజ్‌లో అడ్డం తిరిగిన సరుకుల నౌక

- Advertisement -
- Advertisement -

Large cargo ship capsized in Suez Canal

 

రవాణాకు భారీ విఘాతం, నిలిచిన కార్గొలు

దుబయ్ : ప్రపంచ స్థాయిలో వ్యాపారానికి ప్రధాన మార్గం అయిన సూయజ్ కాల్వలో బుధవారం ఓ భారీ స్థాయి సరుకురవాణా నౌక (ట్యాంకర్) అడ్డం తిరిగింది. దీనితో ఈజిప్టు దేశ పరిధిలోని ఈ కెనాల్‌లో దాదాపు ఓ భాగం మూసుకుపోయింది. భారీ ట్యాంకర్ ప్రమాద కారణంగా కాలువ మధ్యలో దిశ మార్చుకుని అడ్డం తిరగడంతో ఈ మార్గం గుండా ప్రధాన సరుకుల నౌకల రాకపోకలు నిలిచిపొయ్యాయి. ఇప్పటికే కరోనా మహమ్మారితో ప్రపంచ షిప్పింగ్ వ్యవస్థ చితికిపోయి ఉన్న దశలో ఇప్పటి పరిణామం మరింత విషమ పరిస్థితిని తెచ్చిపెట్టింది. పనామాలో రిజిస్టర్ అయి ఉన్న ఈ నౌక చైనా నుంచి సరుకులతో బయలుదేరి నెదర్లాండ్స్‌లోని రోటర్‌డామ్‌కు వెళ్లాల్సి ఉంది. నుంచి వస్తున్న ది ఎంవి ఎవర్‌గ్రీన్ అనే ట్యాంకర్ 400 మీటర్ల పొడవు, 59 మీటర్ల వెడల్పుతో ఉంది. ఇది సూయజ్ ఉత్తర ప్రాంతంలో వెళ్లుతున్నప్పుడు అదుపు తప్పి అడ్డం తిరిగింది. దీనితో ఇది ఇసుకలో కూరుకుపోయినట్లు తెలిసింది.

దీనిని తిరిగి యధాతథ స్థితికి తెచ్చేందుకు ప్రత్యేక పడవలను రప్పించారు. వెనువెంటనే దీనిని సక్రమ స్థితికి తీసుకురావడం కుదరదని, కొన్నిరోజులు పడుతుందని నిపుణులు తెలిపారు. అంతవరకూ ఆసియా యూరప్ మధ్య వాణిజ్యంపై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే సూయజ్ కాల్వలో ఓడలు బారులు తీరాయి. ప్రపంచ దేశాలకు వెనువెంటనే సకాలంలో వివిధ అత్యవసర సరుకులు ఈ మార్గం గుండానే వెళ్లాల్సి ఉంది. అయితే ఇప్పటి కార్గో అడ్డం తిరిగిన ఘటనతో ప్రపంచ వాణిజ్యంపై తీవ్రస్థాయి ప్రభావం పడుతుందని విశ్లేషిస్తున్నారు. ఈ కార్గోలో సరుకులతో కూడిన కంటైనర్లు ఉన్నాయి. కార్గో తీవ్రస్థాయి ఆటుపోట్లు తెచ్చిపెట్టిన పెను గాలుల మధ్యనే రెడ్ సీ మీదుగా ఈ కాలువలోకి చేరుకుంది. ఉధృత గాలులు ఉన్నప్పటికీ కంటైనర్లు ఏవీ చెక్కుచెదరలేదు. మునిగిపోలేదు. మధ్యధర సముద్రాన్ని ఎర్ర సముద్రానికి కలిపేందుకు అనువైన జలమార్గంగా ఇది మానవనిర్మిత కెనాల్‌గా 1869లో రూపుదిద్దుకుంది. సూయజ్ కెనాల్‌లో ఈ భారీ రవాణా నౌక ఎందుకు అడ్డం తిరిగిందనేది ఇప్పటికిప్పుడు స్పష్టం కాలేదు.

అయితే ప్రతికూల వాతావరణంలోనే ఇది ఉత్తరదిశలో దూసుకువెళ్లిన దశలో ప్రమాదం జరిగిందని గ్లోబల్ షిప్పింగ్, సంబంధిత విషయాల కంపెనీ జిఎసి తెలిపింది. వివరాలను పొందుపర్చలేదు. ఈ సరుకుల నౌకను తైవాన్ షిప్పింగ్ కంపెనీ ఎవర్‌గ్రీన్ మెరైన్ నిర్వహిస్తూ వస్తోంది. ప్రస్తుత పరిస్థితిపై ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేమని ఈజిప్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే పెనుగాలులతో ఇది అడ్డం తిరిగి ఉంటుందనే వాదన సరైనదే అన్నారు. ఈ ప్రాంతంలో రెండు రోజులుగా గంటకు 50 కిలోమీటర్ల ఉధృతితో గాలులు వీస్తున్నాయి. ప్రస్తుత ఘటనలో సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని , వారి క్షేమసమాచారం తెలియచేశారని దీని నిర్వాహక సంస్థ తెలిపింది. ప్రమాదం జరిగిన చోట వేచి ఉన్న ఓ కార్గో నుంచి కొందరు ఈ భారీ ట్యాంకర్ అడ్డం తిరిగి దారులు బంద్ చేసిన ఫోటోలను సెల్‌ఫోన్ల ద్వారా చిత్రీకరించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇవి వైరల్ అయ్యాయి. ఈ ప్రాంతంలోకి పెద్ద ఎత్తున టగ్‌బోట్స్‌ను తరలించారు. అడ్డం తిరిగిన ట్యాంకర్‌ను దారికి తెచ్చి ట్రాఫిక్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టినల్లు అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News