Monday, January 20, 2025

జ్ఞానవాపి మసీదు వద్ద భారీ స్థాయిలో నమాజ్

- Advertisement -
- Advertisement -

ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో బంద్

వారణాసి : వారణాసిలో జ్ఞానవాపి మసీదు వద్ద శుక్రవారం అధిక సంఖ్యలో ప్రజలు నమాజ్ చేశారు. మరొక వైపు నగరంలోని ముస్లిం ప్రాబల్య ప్రాంతాలలో బంద్ పాటించారు. వివాదాస్పద కట్టడం జ్ఞానవాపి మసీదు నేలమాళిగలో పూజకు జిల్లా కోర్టు ఉత్తర్వు జారీ చేసిన రెండు రోజుల తరువాత ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గట్టి బందోబస్తు చర్యల మధ్య శుక్రవారం నమాజ్ శాంతియుతంగా సాగింది.

నమాజ్ కోసం జనం అధిక సంఖ్యలో చేరారు. దీనితో వారిలో కొందరిని పోలీసులు తిప్పి పంపారు. నమాజ్ కోసం వచ్చినవారిలో కొందరిని ఇతర మసీదులకు అధికార యంత్రాంగం పంపింది. శుక్రవారం నమాజ్ కోసం సాధారణంగా వచ్చేవారికి రెట్టింపు సంఖ్యలో జనం వచ్చారని ప్రత్యక్ష సాక్షులు కొందరు తెలిపారు. నగరంలో ముస్లింల ఆధిక్యం ఉన్న ప్రాంతాలలో దుకాణాలను శుక్రవారం మూసివేశారు. జ్ఞానవాపి మసీదు నేలమాళిగలో ప్రార్థనల కోసం హిందువులను అనుమతించేందుకు జిల్లా కోర్టు ఉత్తర్వు జారీ చేసిన నేపథ్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

పరిస్థితిని ఒక కంట కనిపెట్టడానికి డివిజనల్ కమిషనర్ కౌశల్ రాజ్ శర్మ, జిల్లా మేజిస్ట్రేట్ ఎస్ రాజలింగం, పోలీస్ కమిషనర్ ముథా అశోక్ జైన్ మసీదు ప్రాంతం వెలుపల నిలబడ్డారు. మొత్తం నగరంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ తెలియజేశారు. జ్ఞానవాపి మసీదు వ్యవహారాలు చూస్తుండే అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ నగరంలో శుక్రవారం బంద్‌కు పిలుపు ఇచ్చారు. బంద్ ప్రభావం దాల్‌మండి, నయీ సడక్, నాదేశర్ అర్దాల్ బజార్‌లోని మార్కెట్ ప్రాంతాల్లో కనిపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News