Thursday, January 23, 2025

సన్నబియ్యం టెండర్లలో రూ.1000 కోట్ల కుంభకోణం

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లు, అంగన్‌వాడీలకు అందించే సన్నబియ్యం టెండర్లలో రూ.వెయ్యి కోట్ల కుంభకోణం జరుగుతోందని బిఆర్‌ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. తమ అనుయాయ సంస్థలకే టెండర్లు దక్కేలా ప్రభుత్వ పెద్దలు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం రైస్ మిల్లర్లను వేధిస్తోందని మండిపడ్డారు. రూ.42 నుంచి 45 మధ్య సన్న బియ్యం సరఫరా చేసేందుకు చాలా సంస్థలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. బహిరంగ మార్కెట్‌లో సన్న బియ్యం కిలో ధర రూ.42 ఉందని.. కానీ రూ. 57 టెండర్ కోట్ చేయడంలో మతలబు ఏంటి..? అని ప్రశ్నించారు. పది పైసల తేడాతో నాలుగు ప్రైవేట్ కంపెనీలు టెండర్లు దక్కించుకున్నాయని ఆరోపించారు. సన్న బియ్యం కిలో రేటును బహిరంగ మార్కెట్ కన్నా అధికంగా నిర్ణయించారని, దాదాపు రూ.330 కోట్ల మేర నష్టపోయే విధంగా టెండర్లు జరిగాయని ఆరోపించారు. ఈ విషయంపై అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. తెలంగాణ భవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

దొడ్డు బియ్యం ధరకే సన్నబియ్యం ఇచ్చే ఆనవాయితీ గతంలో ఉండేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ రైతులకు బోనస్ అని బోగస్ ఇచ్చిందని ధ్వజమెత్తారు. ఢిల్లీకి మూటలు పంపేందుకు డబ్బు వసూలు చేస్తున్నారని విమర్శించారు. గోబెల్స్ టెండర్లతో ప్రభుత్వం అదనంగా డబ్బులు వసూలు చేస్తోందని ఆరోపించారు. సన్నబియ్యం టెండర్లలో కుంభకోణం జరుగుతోందని బిఆర్‌ఎస్ తరఫున అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ టెండర్లలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. అధికార కాంగ్రెస్ నేతలు చేతి వాటంతో టెండర్లు నిర్వహిస్తున్నారని విమర్శించారు. సిఎం రేవంత్‌రెడ్డి, ఎఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ వాటా పేరుతో మిల్లర్లను దోపిడీ చేస్తున్నారని.. ఇందులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయకుండా మీనామేషాలు లెక్కిస్తోందని ధ్వజమెత్తారు. అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. రేవంత్ ప్రభుత్వం సంరక్షణ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అత్యధిక స్థానాలు గెలుస్తోందని పెద్ది సుదర్శన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News