మనతెలంగాణ/హైదరాబాద్ : ట్యాంక్‌బండ్‌పై ప్రతి ఆదివారం ఏదో కొత్తదనాన్ని సందర్శకులకు, పర్యాటకులకు అందించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా ఈసారి గ్రీనరీ, బోటింగ్‌తో ట్యాంక్‌బండ్ ఫన్ డే స్పాట్‌గా మారగా తాజాగా ప్రపంచంలోనే అత్యంత పెద్ద బ్యాట్‌ను సందర్శకుల కోసం ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. టీ 20 సందర్భంగా క్రికెట్ అభిమానులకు పెర్నోడ్ రికార్డు ఇండియా కంపెనీ క్రికెట్ అభిమానుల కోసం దీనిని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయించింది. అభిమానుల్లో, ప్రజల్లో నూతన ఉత్సాహం నింపేందుకు అతి పెద్ద బ్యాట్‌ను రూపొందించగా ఇంత పెద్ద బ్యాట్ ప్రపంచంలోనే మొదటిది కాగా, గిన్నిస్ బుక్‌లో సైతం దీనికి చోటు లభించింది. హెచ్‌సిఏ ఆధ్వర్యంలో శనివారం ఈ బ్యాట్‌ను పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ బ్యాట్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
56 అడుగుల పొడవుతో ప్రపంచంలోనే…
భారత్ టీ-20 జట్టుకు మద్దతుగా ప్రజల్లో ఉత్సాహం పెంచేందుకు హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై 56 అడుగుల పొడవుతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ బ్యాట్‌ను ఏర్పాటు చేశారు. పెర్నోడ్ రికార్డు ఇండియా కంపెనీ రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత పెద్ద బ్యాట్‌ను ప్రభుత్వానికి అందించారు. ఈ బ్యాట్ బరువు 9 టన్నుల వరకు ఉండగా, 56.1 అడుగుల పొడవు, పోప్లర్ ఉడ్‌తో నెల రోజుల పాటు దీనిని తయారు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.