అమెరికాలో తుపాకులు ఎప్పుడు మోగుతాయో, ఎవరి ప్రాణాలు హరీమంటాయో చెప్పలేం. విద్యార్థులు తరగతి గదిలోనే కాల్పులు జరిపి తోటి విద్యార్థుల ప్రాణాలు తీసిన సంఘటనలు గతంలో విన్నాం. కానీ, విద్యార్థులకు చదువుసంధ్యలు నేర్పవలసిన ప్రొఫెసరే కాల్పులకు పాల్పడిన సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.
లాస్ వెగాస్ లోని నెవడా యూనివర్శిటీలో ఒక వ్యక్తి బుధవారం కాల్పులకు పాల్పడ్డాడు. ఈ సంఘటనలో ముగ్గురు మరణించారు. విద్యార్థులు చెల్లాచెదరుగా పారిపోయారు. కొందరు తరగతి గదుల్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి, కాల్పులు జరపడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. అతను గతంలో ఈస్ట్ కరోలినా యూనివర్శిటీలో ప్రొఫెసర్ గా పనిచేశాడు. నెవడా యూనివర్శిటీలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నా, ఉద్యోగం మాత్రం రాలేదు. అదే కోపంతో కాల్పులకు తెగబడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.