శ్రీనగర్: నగంలోని పరింపొరా ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తొయిబాకు చెందిన కమాండర్ నదీమ్ అబ్రార్‌తోపాటు మరో పాకిస్తానీ జాతీయుడు మరణించినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. అనేక హత్యలతో సంబంధమున్న పేరుమోసిన లష్కరే ఉగ్రవాది అబ్రార్‌ను భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక కారులో పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి ఒక పిస్టల్, కొన్ని హ్యాండ్ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. అతడితో పాటు కారు డ్రైవర్‌ను కూడా వారు అదుపులోకి తీసుకున్నారు.
ఒక ఎకె 47 రైఫిల్‌ను మలూరా ప్రాంతంలోని ఒక ఇంట్లో దాచినట్లు అబ్రామ్ చెప్పడంతో దాన్ని స్వాధీనం చేసుకోవడానికి అతడిని తీసుకుని పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లారు. అయితే ఆ ఇంటికి చేరుకోగానే లోపల దాగి ఉన్న ఒక పాకిస్తానీ ఉగ్రవాది సిఆర్‌పిఎఫ్ సిబ్బందిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పులలో ముగ్గురు జవాన్లతోపాటు అబ్రార్ కూడా గాయపడ్డాడు. జవాన్లు జరిపిన ఎదురుకాల్పులలో అబ్రార్‌తోపాటు లోపల ఉన్న మరో ఉగ్రవాది కూడా మరణించినట్లు అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. సంఘటన స్థలి నుంచి రెండు ఎకె 47 తుపాకులు, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు.