జమ్ము : సరిహద్దుల్లో ఆయుధ డంపు చూపించడానికి తీసుకెళ్లిన ఓ ఉగ్రవాదిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దేశం లోకి అక్రమంగా ఆయుధాలను చేరవేసి విధ్యంసం సృష్టించేందుకు పాక్ చేసిన ప్రయత్నాలను జమ్ము పోలీసులు అడ్డుకున్నారు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి డ్రోన్ ద్వారా జారవిడిచిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయుధాల గురించి సమాచారం ఇచ్చిన లష్కరే తోయిబా కమాండర్ అతి తెలివి ప్రదర్శించగా, పోలీసులు ఎన్‌కౌంటర్ చేసి హతమార్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్నియా సెక్టార్‌లో డ్రోన్ ద్వారా ఆయుధాలను జార విడిచిన ఘటనపై పోలీసుల దర్యాప్తులో పాక్‌కు చెందిన లష్కరే తోయిబా కమాండర్ మహ్మద్ అలీ హుస్సేన్ అలియాస్ ఖాసిమ్ పేరు బయటికొచ్చింది.
జైలులో ఉన్న అతన్ని తీసుకెళ్లి కోర్టులో హాజరు పర్చగా న్యాయస్థానం రిమాండ్‌కు ఆయనను అప్పగించింది. అయితే విచారణ సమయంలో హుస్సేన్ చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు అతడ్ని పల్లియన్ మండల్ ప్రాంతం లోని అంతర్జాతీయ సరిహద్దు వద్దకు తీసుకెళ్లి ఉగ్రవాదులు డ్రోన్ ద్వారా జారవిడిచిన ఓ ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్యాకెట్‌లో ఒక ఎకే రైఫిల్, మాగజైన్, పిస్టోల్ , రెండు పిస్టోల్ మ్యాగజైన్లు, రెండు గ్రనేడ్లు, బుల్లెట్లు ఉన్నాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుంటుండగా హుస్సేన్ ఓ పోలీస్ నుంచి సర్వీస్ రైఫిల్‌ను లాక్కొని కాల్పులు ప్రారంభించాడు. అక్కడ నుంచి పారిపోడానికి ప్రయత్నించడంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపి అతడిని మట్టుబెట్టారు.