కొలంబో: శ్రీలంక సీనియర్ బౌలర్ లసిత్ మలింగ టి20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. శ్రీలంక తరఫున 295 మ్యాచ్‌లు ఆడిన మలింగ 390 వికెట్లు తీశాడు. 2011లో టెస్టులకు, 2019లో వన్డేలకు వీడ్కోలు పలికిన మలింగ తాజాగా ఇప్పుడు టి20 క్రికెట్‌కు కూడా గుడ్‌బై చెప్పాడు. దీంతో అన్ని ఫార్మాట్లనుంచి వైదొలగినట్లయింది. 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు గుడ్‌బై చెప్పినట్లయింది. ‘ ఈ రోజు నాకు చాలా ప్రత్యేకమైంది. నా కెరీర్‌లో నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నా అనుభవాన్ని యువ క్రికెటర్లతో పంచుకుంటా’ అని మలింగ మంగళవారం ఒక ట్వీట్‌లో పేర్కొన్నాడు. తన వీడ్కోలు సందర్భంగా మలింగ శ్రీలంక క్రికెట్ బోర్డుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు.
మలింగ ఇప్పటివరకు 30 టెస్టులు, 226 వన్డేలు, 84 టి 20లలో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించాడు.టి 20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడి జాబితాలో ఇప్పటికీ అతనిదే పై చేయి. అంతేకాదు పొట్టి ఫార్మాట్‌లో 100 వికెట్లు తీసిన తొలి క్రికెటర్ కూడా అతనే. ఐపిఎల్‌లోను మలింగకు ఘనమైన రికార్డు ఉంది. ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మలింగ 122 మ్యాచ్‌లలో 170 వికెట్లు పడగొట్టాడు. మలింగ సారథ్యంలోని శ్రీలంక జట్టు 2014లో టి20 ప్రపంచ కప్ గెలుచుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో రెండు సార్లు నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన ఏకైక బౌలర్ కూడా మలింగనే. అంతేకాదు వన్డేలలో మూడు సార్లు, టి20లలో రెండు సార్లు హ్యాట్రిక్ సాధించిన ఏకైక బౌలర్‌గా కూడా మలింగ పేరు రికార్డులకెక్కింది.