తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ఆగస్ట్ 15లోగా రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించిన ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అంతకు నెల రోజుల ముందే ఈ పథకాన్ని అమలు చేసి చూపించారు. రాష్ట్రంలో మొత్తం 32.50 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేసేందుకు రూ.31 వేల కోట్ల రుణమాఫీకి ప్రభుత్వం నిధులు కేటాయించి దేశంలోనే కొత్త రికార్డు నెలకొల్పింది. జులై 15వ తేదీన రుణమాఫీ జీవో జారీ చేసిన ప్రభుత్వం.. మూడు రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయటం మొదలు పెట్టింది. జులై 18వ తేదీన మొదటి విడతగా లక్ష రూపాయల స్లాబ్ వరకు రుణమున్న రైతు కుటుంబాలన్నింటికీ ఏకకాలంలో రుణమాఫీ చేసింది. 11,14,412 మంది రైతులకు రూ.6034.97 కోట్లు విడుదల చేసింది. జులై 30వ తేదీన అసెంబ్లీ వేదికగా రెండో విడత రుణమాఫీ కార్యక్రమం అమలు చేసింది.
ఒక లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు రుణమున్న రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేసింది. దాదాపు 6,40,823 మంది రైతుల ఖాతాల్లో రూ.6190.01 కోట్లు జమ చేసింది. కేవలం 12 రోజుల్లోనే దాదాపు 17.55 లక్షల రైతుల కుటుంబాలకు రూ.12 వేల కోట్లకుపైగా రుణమాఫీ నిధులు జమ చేయటం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారి. ఆగస్ట్ 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మూడో విడత పంట రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. అమెరికా పర్యటన నుంచి వచ్చీ రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మూడో విడతలో రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేస్తారు. ఆ రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. దీంతో రుణమాఫీలో కీలక ఘట్టం ముగియనుంది. రూ.2 లక్షలకు మించి పంట రుణాలున్న రైతులకు చివరి విడతగా నిధులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రుణమాఫీ విధి విధానాల్లో ఈ విషయాన్ని ముందుగానే వెల్లడించింది.