Friday, December 20, 2024

ప్రపంచ శాంతి దూత మిఖాయిల్ కన్నుమూత..

- Advertisement -
- Advertisement -

Last Soviet leader Mikhail Gorbachev dies at 91

సోవియట్ తుది నేత ..ప్రపంచ శాంతిదూత
మిఖాయిల్ గోర్బచేవ్ కన్నుమూత
అంతర్యుద్ధం అంతమొందించారు
కమ్యూనిస్టుసంస్కరణల దిశగా పయనం
మాస్కో: పూర్వపు సోవియట్ యూనియన్ (రష్యా) మాజీ అధ్యక్షులు మిఖాయిల్ గోర్బచేవ్ మంగళవారం కన్నుమూశారు. ఈ నేత నోబెల్ శాంతి పురస్కార గ్రహీత కూడా. దేశంలో పలు చారిత్రక, రాజకీయ పరిణామాలకు సాక్షిగా నిలిచిన ఈ నేత తమ 91వ ఏట సుదీర్ఘ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో మృతి చెందారని స్ఫుత్నిక్ వార్తా సంస్థ తెలిపింది. నేతగా తన సత్తాను చాటుకున్న గోర్బచేవ్ దేశంలో అంతర్యుద్ధం నివారించగలిగారు. అయితే సోవియట్ యూనియన్ పతనాన్ని నిలువరించలేకపొయ్యారు. మిఖాయిల్ సెర్గివిచ్ గోర్బచేవ్ పలు అనారోగ్య సమస్యలతో కన్నుమూశారని సెంట్రల్ క్లినికల్ హాస్పిటల్ వెలువరించిన అధికారిక ప్రకటనను ఉటంకిస్తూ వార్తా సంస్థలు వార్తలు వెలువరించాయి. గోర్బచేవ్ సోవియట్ యూనియన్‌కు 1985 నుంచి 1991లో పతనం వరకూ అధినేతగా ఉన్నారు.

ఆయన భారతదేశం పట్ల తరచూ అభిమానం చూపుతూ వచ్చారు. భారత్‌లో 1986, తరువాత 1988లో పర్యటించారు. యునైటెడ్ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్టు రిపబ్లిక్స్(యుఎస్‌ఎస్‌ఆర్)కు ఆయన తుది అధినేతగా వ్యవహరించారు. దేశంలోని కమ్యూనిస్టు అధికారిక వ్యవస్థలో పలు కీలక మార్పులు తీసుకురావాలని, సంస్కరణల ప్రక్రియ ప్రవేశపెట్టాలని కోరుకున్న యువ, సమర్థవంతమైన నేతగా ఆయన తమ హయాంలో నిలిచారు. పౌరులకు భావస్వేచ్ఛను అందించడం ద్వారా ప్రజాస్వామిక సిద్ధాంతాలకు అనుగుణంగా వినూత్న రీతిలో దేశ పాలన సాగించాలని భావించారు. 1989లో దేశంలో ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమాలు బలీయ రీతిలో తలెత్తినప్పుడు గోర్బచేవ్ వీటిని అణచివేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపలేదు. ఉద్యమకారులపై నిర్బంధకాండలకు వెళ్లలేదు. ఈ విధంగా తన ప్రజాస్వామ్య అనుకూలతనే చాటుకున్నారు. భావస్వేచ్ఛ లేదా పారదర్శక పరిపాలనల గ్లాస్నోస్త్ పాలసీని అమలుచేయాలని నిర్ణయించారు.

అంతకు ముందు సోవియట్ యూనియన్‌లో పౌరుల భావవ్యక్తీరణకు పలు ప్రతిబంధకాలు బిగిస్తూ కమ్యూనిజం సాగింది. దేశంలో ఆయన హయాంలోనే ఆర్థిక సంస్కరణల ప్రక్రియను పెరెస్ట్రోయికా లేదా పునర్యవస్థీకరణ పేరిట ఆరంభం అయింది. అప్పట్లో సోవియట్ యూనియన్ అంతర్గత ద్రవ్బోల్బణం , సరఫరాల కొరతతో కొట్టుమిట్టాడుతూ వచ్చిన దశలో ఈ విధమైన ఆర్థిక సంస్కరణలు అనివార్యం అయ్యాయి. ఆయన అధికారిక దశలో మీడియాకు సాంస్కృతిక స్వేచ్ఛ, కళాకారులకు స్వేచ్ఛ కల్పించారు. ప్రభుత్వ అధికార యంత్రాంగంపై పార్టీ ఆధిప్యతాన్ని తగ్గించేందుకు పలు కీలక మార్పులు తీసుకువచ్చారు. ఆయన హయాంలోనే వేలాది మంది రాజకీయ ఖైదీలు, అసమ్మతివాదులు జైలు నుంచి విడుదల అయ్యారు. అమెరికాతో అణ్వాయుధ నిరాకరణ ఒప్పందం కుదిరేలా చేయడంలో ఆయన సాగించిన కృషికి ఫలితంగా నోబెల్ శాంతిబహుమతి అందుకున్నారు. గోర్బచేవ్ అధికారంలోని తొలి ఐదేళ్లు పలు విజయాలు రికార్డుగా నిలిచాయి. ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్ హయాంలో అమెరికాతో తొలిసారిగా ఆయుధ నిర్మూలన ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఈ ప్రక్రియలో భాగంగా ఈస్టర్న్ యూరప్ నుంచి సోవియట్‌కు చెందిన పలు వ్యూహాత్మక అణ్వాయుధాలను ఉపసంహరించారు. అఫ్ఘనిస్థాన్‌పై 1979లో దాడి, తొమ్మిదేళ్ల పాటు స్వాధీనపర్చుకున్న ప్రక్రియ పూర్తిగా బెడిసికొట్టిందని, ఇది వ్యూహాత్మక వైఫల్యం అని అంగీకరిస్తూ ఆ తరువాత అక్కడి నుంచి గోర్బచేవ్ హయాంలోనే సోవియట్ సేనలు వెనుదిరిగాయి. గోర్బచేవ్ మరణం వార్త తెలియగానే పలువురు ప్రపంచ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ప్రపంచ రాజకీయ పరిణామాల దశలో ఆయన సోవియట్ యూనియన్‌కు ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. గోర్బచేవ్ దార్శనికత గల నాయకుడని అమెరికా అధ్యక్షులు జో బైడెన్ తెలిపారు. అమెరికాతో కలిసి ప్రపంచంలో అణ్వాయుధాల బెడదను తగ్గించేందుకు ఆయన ఎనలేని విధంగా పాటుపడ్డారని బైడెన్ కొనియాడారు. గోర్బచేవ్ సోవియట్ నేతగా ఉన్న దశలో బైడెన్ అమెరికాలో సెనెట్ ఫారెన్ కమిటీ సభ్యులుగా ఉన్నారు.
భారత్ రష్యా బంధం బలోపేతం: మోడీ
గోర్బచేవ్ హయాంలోనే భారత్, రష్యా సత్సంబంధాలు మరింత విలసిల్లాయని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం తెలిపారు. ఆయన మరణం పట్ల తమ సంతాపం వ్యక్తం చేశారు. 20వ శతాబ్దపు ప్రముఖ రాజకీయవేత్త, ఆయన చరిత్ర గమనంలో తన వ్యవహారశైలితో చెక్కుచెదరని గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. ఆయన హయాంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టం అవుతూ వచ్చాయని, ఇది భారతదేశానికి అత్యంత కీలక పరిణామమని ప్రధాని మోడీ తెలిపారు. ఈ దిశలో ఆయన పాత్ర చిరస్మరణీయం అని స్పందించారు.
శనివారం అంత్యక్రియలు
పుతిన్ హాజరుకావడం లేదు
సోవియట్ యూనియన్ అంతిమనేత గోర్బచేవ్ మృతి పట్ల రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. విషయం తెలియగానే పుతిన్ మాస్కోలో గోర్బచేవ్ భౌతికకాయం ఉన్న ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ దివంగత నేతకు నివాళులు అర్పించారని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్ తెలిపారు. అయితే నిర్ణీత కార్యక్రమాల షెడ్యూల్ వల్ల అంత్యక్రియల ఘట్టానికి పుతిన్ హాజరుకావడం లేదని ఈ ప్రతినిధి విలేకరులకు చెప్పారు. సోవియట్ నేతకు గౌరవ వందనం సమర్పించారని, గోర్బచేవ్‌కు అధికారిక గౌరవ మర్యాదలతో కూడిన అంత్యక్రియలు జరుగుతాయి. గౌరవ వందనాలు, ఇతర పద్ధతులు అన్నింటిని పాటిస్తారని అధికార ప్రతినిధి వివరించారు. గోర్బచేవ్ అంత్యక్రియలు మాస్కోలోని నోవోడెవిచి శ్మశాన వాటికలో జరుగుతాయి.

Last Soviet leader Mikhail Gorbachev dies at 91

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News