ముంబై: ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యం మళ్లీ క్షీణించిందని, ఆమెకు మళ్లీ వెంటిలేటర్‌పై చికిత్స అందచేస్తున్నారని డాక్టర్లు శనివారం తెలిపారు. 92 సంవత్సరాల లతా మంగేష్కర్ కొవిడ్ సోకడంతో స్వల్ప లక్షణాలతో జనవరి 8న ఇక్కడి బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలోని ఐసియులో చేరారు. ఆమెకు డాక్టర్ ప్రతీత్ సందాని నేతృత్వంలో వైద్యుల బృందం చికిత్స అందచేస్తోంది. ఆమె ఆరోగ్యం మళ్లీ క్షీణించించడంతో ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందచేస్తున్నట్లు సందాని తెలిపారు. కాగా..లతా మంగేష్కర్ క్రమంగా కోలుకుంటున్నారని, ఆమెను వెంటిలేటర్ తొలగించినప్పటికీ ఐసియులోనే ఉంచి చికిత్స అందచేస్తున్నామని జనవరి 29న డాక్టర్ సందాని తెలిపారు. భారతీయ చలన చిత్ర రంగంలో మేటి గాయనీమణులలో ఒకరిగా ఖ్యాతిగాంచిన లతా మంగేష్కర్ 1942లో తన 13వ ఏట తన గాన ప్రస్థానాన్ని ప్రారంభించారు. వివిధ భారతీయ భాషలలో ఆమె ఇప్పటివరకు 30 వేలకు పైగా పాటలు పాడారు. గానకోకిలగా పేరుగాంచిన లతను భారతదేశ అత్యున్నత పురస్కారం భారత రత్నతోపాటు పద్మ భూషణ్, పద్మ విభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించాయి.