Friday, November 15, 2024

ములుగులో దివంగత నక్సలైట్ కుమార్తె వర్సెస్ మాజీ నక్సలైట్ పోరు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం 115 మంది అభ్యర్ధులతో సిఎం కెసిఆర్ తొలి జాబితా విడుదల చేశారు. మరో నాలుగు సీట్లు త్వరలో ఖరారు చేస్తామన్నారు. అయితే ఇందులో ఆసక్తికరంగా ములుగు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్ధిగా దివంగత మాజీ నక్సలైట్ బడే నాగేశ్వరరావు అలియాస్ ప్రభాకర్ కుమార్తె బడే నాగజ్యోతికి కెసిఆర్ సీటు కేటాయించడం చర్చనీయాంశమవుతోంది. ఈ సీటులో ఆమె కాంగ్రెస్ సిట్టింగ్ ఎంఎల్‌ఎ, మాజీ నక్సలైట్ కూడా అయిన సీతక్కను ఎదుర్కోవాల్సి ఉంది.

ములుగు జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్‌గా ఉన్న 29 ఏళ్ల బడే నాగజ్యోతిని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు అసెంబ్లీ సీటు నుంచి బరిలోకి దింపాలని బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఇప్పటికే అక్కడ సిట్టింగ్ ఎంఎల్‌ఎగా ఉన్న సీతక్క వరుసగా గెలుస్తూ వస్తున్న నేపథ్యంలో ఆమెకు చెక్ పెట్టేందుకు నాగజ్యోతిని కెసిఆర్ బరిలోకి దింపుతున్నారు. అయితే ఇక్కడ వీరిద్దరి మధ్య మరో సారూప్యత కూడా ఉంది. వీరిద్దరూ నక్సలైట్ నేపథ్యాలు ఉన్నవారే కావడం విశేషం. దీంతో ములుగు నియోజకవర్గంలో పోరు దివంగత నక్సలైట్ కుమార్తె వర్సెస్ మాజీ నక్సలైట్ గా మారింది.

ములుగు జిల్లాలోని ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం కలవపల్లి గ్రామానికి చెందిన నాగజ్యోతి వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ నుంచి ఎంఎస్‌సి (బోటనీ), బిఇడి పూర్తి చేశారు. 2019లో సర్పంచ్‌గా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్ (అప్పటి టిఆర్‌ఎస్)లో చేరి తాడ్వాయి మండలం నుంచి జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపొందారు. ఆ తర్వాత జడ్పీ ఛైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. ఇప్పుడు ములుగు ఎంఎల్‌ఎ టికెట్ దక్కించుకున్నారు. బడే నాగజ్యోతి తండ్రి బడే నాగేశ్వర రావు గతంలో నక్సలైట్ గా పనిచేశారు. ఈ ప్రాంతంలోని గిరిజనుల మద్దతు కలిగిన ఆయన 2018లో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. అలాగే బడే నాగజ్యోతి మామ బడే చొక్కా రావు అలియాస్ దామోదర్ ప్రస్తుతం తెలంగాణలో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి యాక్షన్ టీమ్ కమాండర్‌గా ఉన్నారు. దీంతో ఆమె కుటుంబానికి ఎంత బలమైన మావోయిస్టు నేపథ్యం ఉందో అర్ధం చేసుకోవచ్చు.

మరోవైపు ములుగులో సిట్టింగ్ కాంగ్రెస్ ఎంఎల్‌ఎ సీతక్క కూడా గతంలో కొన్నేళ్లు జనశక్తి నక్సల్ గ్రూపులో పనిచేశారు. 1997లో ప్రభుత్వ క్షమాభిక్ష పథకం కింద పోలీసులకు లొంగిపోయారు. ఆ తరువాత తన చదువును కొనసాగించి న్యాయవాదిగా మారారు. 2022లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో సీతక్క పిహెచ్‌డి పూర్తి చేశారు. ములుగు నియోజకవర్గంలో ప్రధాన ఓటర్లుగా ఉన్న కోయ సామాజికవర్గం మద్దతును కూడగట్టే లక్ష్యంతో కెసిఆర్ నాగజ్యోతిని బరిలోకి దింపినట్లు తెలుస్తోంది. ఈ సీటులో 45,000 మంది ఓటర్లు ఉండగా సీతక్కకు చెందిన లంబాడా సంఘంలో దాదాపు 18,000 మంది ఓటర్లు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News