మాస్కో : ఉక్రెయిన్ సంక్షోభానికి పరిష్కారం లభిస్తుందనడంలో తనకు ఎలాంటి సందేహం లేదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లావ్రోవ్ పేర్కొన్నారు. రష్యా ప్రాథమిక డిమాండ్లనే ముందుంచిందని, దేశ భద్రతకు సవాల్ విసిరేందుకు ఉక్రెయిన్‌ను రష్యా అనుమతించబోదని స్పష్టం చేశారు. రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధి బృందాల మధ్య తదుపరి దశ చర్చలు గురువారం సాయంత్రం జరుగుతాయని తెలిపారు. ఉక్రెయిన్, యూరప్ ప్రాంతానికి భద్రతాహామీలపై చర్చించేందుకు రష్యా సిద్ధంగా ఉందని అన్నారు.
పాశ్చాత్య నేతలు అణుయుద్ధంపై చర్చిస్తున్నారని , అయితే ఇలాంటి ఆలోచనలు రష్యన్లలో లేవని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరం కావడంతో ఎస్400 మిస్సైల్స్‌ను దించేందుకు రష్యా కసరత్తు ముమ్మరం చేసింది. ఎస్400 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిసైల్ సిస్ట్‌మ్స్ సిబ్బంది నొవొసిబిర్క్ ప్రాంతంలో శత్రులక్షాలను ఛేదించేందుకు శిక్షణ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నాయి. ఇక గురువారం రష్యాఉక్రెయిన్ యుద్ధం ఎనిమిదో రోజుకు చేరింది. రష్యా దురాక్రమణ మొదలైనప్పటినుంచి దాదాపు 2000 మందికి పైగా పౌరులు మరణించారని ఉక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీసుల విభాగం వెల్లడించింది.