Monday, December 23, 2024

శాంతిభద్రతలే బ్రహ్మాస్త్రం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించడానికి బిఆర్‌ఎస్ శాంతిభద్రతలనే ప్రధాన ప్రచార అస్త్రంగా తీసుకెళ్లాలని భావిస్తున్నది. తమ పదేళ్ల పాలన దేశానికి మోడల్ కావడానికి సుస్థిర శాంతిభద్రతలు, మతకల్లోలాలు లేని సామరస్యమే ప్రధాన కారణమని ఆ పార్టీ ప్రజల్లో విస్తృత ప్రచారం చేయనున్నది. ఇందుకు తెలంగాణలో గతంలో చెలరేగిన మతపరమైన అల్లర్లు, దానికి కాంగ్రెస్ ఎలా కారణమైందో వివరించే చరిత్రను తవ్వితీసి ప్రచారం చేయనున్నది. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాత్రం ముఖ్యమంత్రి పదవి కోసం కొట్లాడుకోవడమే సరిపోతుందని, సీఎం సీటును కైవసం చేసుకోవడానికి ఆ పార్టీ నేతల కుమ్ములాటలతో ఉత్పన్నమయ్యే పరిస్థితులను ప్రజలకు వివరిస్తూ బిఆర్‌ఎస్ పార్టీ నేతలు ప్రచారంలో ముందుకు సా గుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అప్పగిస్తే స్వీయ రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తారని, అభివృద్ధి, సంక్షేమ పథకాలను తుంగలోకి తొక్కుతారని, ఈ విష యం ఆ పార్టీ గత చరిత్రే స్పష్టం చేస్తోందని పలవురు బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు.

ఈ విషయం పై ప్రజలకు కూడా స్పష్టత ఉందని,అందుకే ఓటు వేసే సమయంలో జాగ్రత్త వహించాలని ప్రజలను కోరుతున్నామని ఆ పార్టీ నాయకులు వివరించారు. తెలంగాణ రాష్ట్రంగా అవతరించిన ఈ పదేళ్ళ కాలంలో రా ష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆదర్శంగా నిలిచామని, చేసిన అభివృధ్ధిని చూసి, రాష్ట్రంలో నెలకొన్న ప్రశాంత వాతావరణం, శాంతి-భద్రతలు పూర్తిగా అదుపులో ఉండటం వంటి పరిస్థితులను చూస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని బడా పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని వివరించారు. 2014కు పూర్వం రాష్ట్రంలో ఐ.టి ఎగుమతులు కేవలం 50 వేల కోట్లకు పరిమితంగా ఉండేవని, కానీ బిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసిన ఐటి విధానాల మూలంగా ప్రస్తుతం దేశంలోనే ఐటి రంగం అగ్రస్థానంలో దూసుకుపోతోందని, ఇప్పుడు ఏకంగా 2.50 లక్షల కోట్లకు ఐటి ఎగుమతులు పెరిగాయని, తెలంగాణ యువతలో రెండు లక్షలకు పైగా పట్టభద్రులకు ఉపాధి అవకాశాలు లభించాయని వివరించారు. అంతేగాక హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఐటి కంపెనీలను జిల్లా కేంద్రాలకు కూడా విస్తరించామన్నారు. పారిశ్రామిక, ఫార్మారంగాల్లో ప్రపంచ పటంలో తెలంగాణకు ఒక ప్రత్యేకస్థానాన్ని సంపాదించిపెట్టింది కేవలం బిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వమేనని సగర్వంగా వివరించారు.

ఇవన్నీ రాష్ట్రంలో శాంతి-భద్రతలు అదుపులో ఉండబట్టే సాధ్యమయ్యిందని అంటున్నారు. సాధారణంగా ఐటి నిపుణులుకానీ, పారిశ్రామికవేత్తలు గానీ ఒక నిర్ధిష్టమైన ప్రశాంత జీవితం, ప్రశాంత వాతావరణం, తమకు అనుకూలమైన ఐటి పాలసీలు, ఇండస్ట్రియల్ పాలసీలు ఉంటేనే పెట్టుబడులు పెట్టేందుకు మల్టీ నేషనల్ కంపెనీలు కూడా ముందుకు వస్తాయని, లేకుంటే రారని, ఈ విషయాలనే ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. ఇలాంటి సానుకూల పరిస్థితులన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తారుమారు అవుతాయని, ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ నేతలు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకోవడమే కాకుండా రాష్ట్ర ప్రగతిని పణంగా పెట్టడానికి వెనుకాడరనే విషయాలను తెలుసుకోవాలని ప్రజలను కోరుతున్నామని వివరించారు. ఇప్పటికే టి పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటుగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క, కేంద్ర ప్రభుత్వ మాజీ మంత్రి రేణుకాచౌదరిలతో పాటుగా తాజాగా సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి (జగ్గారెడ్డి) కూడా ముఖ్యమంత్రి పదవికి తనకు అన్ని అర్హతలూ ఉన్నాయని, రేస్‌లో తాను కూడా ఉన్నట్లుగా ప్రకటించుకొన్నారని, ఈ పరిణామాలే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తెలంగాణ రాష్ట్రం పరిస్థితి ఎంతటి దయనీయంగా ఉంటుందో ఇట్టే అర్ధంచేసుకోవచ్చునని బిఆర్‌ఎస్ నేతలంటున్నారు. అంతేగాక 1990 డిసెంబర్ 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ ఏకంగా పది రోజుల పాటు హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన మతఘర్షణలు, అల్లర్లు, మారణహోమం ఎంతటి చేదు అనుభవాలను మిగిల్చిందో, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో హైదరాబాద్ ప్రతిష్టను ఎంతలా దిగజార్చారోననే అంశాలను కూడా గుర్తుకు తెచ్చుకోవాలని ప్రజలను కోరుతున్నామన్నారు.

1990 డిసెంబర్ నెలలో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డిని సీఎం సీటులో నుంచి దించడానికి ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులే హైదరాబాద్ పాతబస్తీలో నరమేధం సృష్టించారని, ఏకంగా 30 మందిని బలితీసుకొన్న దారుణమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీదనే విషయాన్ని మరోసారి రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నామని వివరించారు. “కేవలం తనను ముఖ్యమంత్రి పదవి నుంచి దించివేయడానికి ఇంతటి మారణహోమాన్ని సృష్టించాలా”అని చెన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్రస్థాయిలో సంచలనం సృష్టించాయని గుర్తు చేశారు. ఆ వెంటనే ఉస్మానియా ఆసుపత్రి నుంచి నేరుగా తార్నాకలోని ఆయన నివాసానికి వెళ్ళి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన వ్యక్తి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి అని, ఈ విషయాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరోసారి వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలను నమ్మవద్దని వేడుకొంటున్నామని బిఆర్‌ఎస్ నాయకులు వివరించారు.

అంతేగాక అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మర్రి చెన్నారెడ్డి విజయవాడ నుంచి వచ్చిన రౌడీలు, గూండాలే పాతబస్తీలో నరమేధానికి పాల్పడ్డారని, ఈ నరమేధం వెనుక ఒక ఎమ్మెల్యే హస్తం ఉందని 1990 డిసెంబర్ 9వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో చెప్పడం, దానిపై మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అప్పటి పరిశ్రమల శాఖామంత్రిగా పనిచేస్తున్న మహ్మద్ జానీ చెప్పడం, నరమేధాన్ని సృష్టించిన ఆ ఎమ్మెల్యే పేరును బయటపెట్టాలని, చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని మరోమంత్రి శ్రీనివాసులురెడ్డి కేబినేట్ భేటీలో ముఖ్యమంత్రి చెన్నారెడ్డిని డిమాండ్ చేసిన అంశాలు ఇప్పటికీ సజీవసాక్షాలుగా ఉన్నాయనే అంశాలను కూలంకషంగా వివరిస్తున్నామని, ఈ చారిత్రక సత్యాలను గుర్తు తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీని నమ్మవద్దని ప్రజలను కోరుతూ ఎన్నికల సభల్లో, ప్రచారంలో ముందుకు సాగుతున్నామని బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News