న్యూఢిల్లీ : ఉమ్మడి పౌరస్మృతిపై అభిప్రాయాలు తెలియజేయడానికి గడువు సమీపిస్తుండడంతో సోమవారం సాయంత్రానికి లా కమిషన్‌కు 46 లక్షల అభిప్రాయాలు వచ్చాయి. రానున్న రోజుల్లో వివిధ సంస్థలు, పౌరుల అభిప్రాయాలను నేరుగా వినేందుకు లా కమిషన్ సిద్ధమవుతోంది. ఈమేరకు పలువురికి ఆహ్వానాలు వెళ్లాయి. ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్)పై లా కమిషన్ జూన్ 14 నుంచి సంప్రదింపులు సాగిస్తోంది.
30 రోజుల్లో అభిప్రాయాలను పంపాలని గడువు విధించింది. గుర్తింపు పొందిన మతపరమైన సంస్థలతోపాటు పౌరులు, వివిధ భాగస్వాములు తమ అభిప్రాయాలను తెలియజేయాలని అభ్యర్థించింది. ఇంతకు ముందు 21 వ లా కమిషన్ కూడా ఈ అంశాన్ని పరిశీలించినప్పటికీ , దాని గడువు 2018తో ముగిసింది. ఆ తరువాత “ కుటుంబ చట్టంలో సంస్కరణలు ”పేరుతో 2018 ఆగస్టు 31న ఓ నివేదిక విడుదల చేసింది.
అది జారీ చేసి ఇప్పటికి మూడేళ్లకు పైగా సమయం గడిచిపోవడంతోపాటు ఈ మధ్యలో ఇదే అంశంపై వివిధ న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వులను , ఈ అంశానికి ఉన్న ప్రాధాన్యతను , అవసరాన్ని పరిగణన లోకి తీసుకుని మళ్లీ ఇప్పుడు తాజాగా సంప్రదింపులు మొదలు పెడుతున్నామని 22 వ లాకమిషన్ పేర్కొంది. జూన్ 14న విడుదల చేసిన పబ్లిక్ నోటీస్‌లో ఈ విషయం వివరించింది.
అందుకోసం ఉమ్మడి పౌర స్మృతిపై ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నట్టు వివరించింది. రానున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఉమ్మడి పౌరస్మృతిపై కేంద్ర ప్రభుత్వం బిల్లు తీసుకురావచ్చన్న ప్రచారం జరుగుతున్న సమయంలో లాకమిషన్ దీనిపై ప్రజాభిప్రాయాలను సేకరించడం ప్రాధాన్యం సంతరించుకొంది. ఉమ్మడి పౌరస్మృతిలో మతంపై ఆధారపడకుండా దేశ పౌరులందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. వారసత్వం, దత్తత, వారసుల ఎంపిక తదితర అంశాల్లో వివిధ మతాలకు ఉండే ‘పర్సన్‌ల్ చట్టాలన్నీ’ ఈ చట్టంతో ఒకే ఉమ్మడిస్మృతి కిందకు వస్తాయి.