కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన
న్యూఢిల్లీ: దేశంలో న్యాయస్ధానాలలో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య 5 కోట్లకు చేరుకోనున్నదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఒక న్యాయమూర్తి 50 కేసులను పరిష్కరిస్తే వెంటనే 100 కొత్త కేసులు దాఖలవుతున్నాయని, దేశంలో న్యాయస్థానాలపై ప్రజలకు అవగాహన విపరీతంగా పెరిగిందని ఆయన అన్నారు. శనివారం నాడిక్కడ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో సాయుధ దళాల ట్రిబ్యునల్‌కు సంబంధించిన ఒక సదస్సులో రిజిజు పాల్గొన్నారు. న్యాయస్థానాలలో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్యను తగ్గించడానికి కేంద్రం టెక్నాలజీ సాయాన్ని తీసుకుంటోందని చెప్పారు. దేశంలోని దిగువ కోర్టులలో 4 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉండగా సుప్రీంకోర్టులో 72 వేలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి తెలిపారు. మధవర్తిత్వం ద్వారా కక్షిదారుల మధ్య రాజీ కుదిర్చేందుకు తీసుకురానున్న చట్టం వల్ల కూడా కోర్టులలో పెండింగ్ కేసుల సంఖ్య తగ్గగలదని ఆయన చెప్పారు. దేశంలోని పెండింగ్ కేసులను ఇతర దేశాలతో పోల్చకూడదని, మన దేశంలో సమస్యలు వేరని ఆయన అన్నారు. కొన్ని వేరే దేశాలలో జనాభా 5 కోట్లు కూడా ఉండదని, కాని మన దేశంలో పెండింగ్ కేసులే 5 కోట్ల వరకు ఉంటాయని ఆయన చెప్పారు.