మార్చి 1 నుంచి లాసెట్,
మార్చి 3 నుంచి ఇసెట్ దరఖాస్తులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో న్యాయ విద్యలో ప్రవేశాలకు నిర్వహించే టిజిలాసెట్, పిజిఎల్‌సెట్, లాటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టిజిఇసెట్ పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. లాసెట్, ఇసెట్ నిర్వహణకు శనివారం ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి అధ్యక్షతన ఆయా సెట్ కమిటీ సమావేశాలు నిర్వహించారు. సమావేశం అనంతరం ఆయా సెట్ల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ మహమూద్, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, ఒయు వైస్ ఛాన్స్‌లర్ మొలుగరం కుమార్, లాసెట్ కన్వీనర్ విజయలక్ష్మి, ఇసెట్ కన్వీనర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
లాసెట్, ఇసెట్ ప్రవేశ పరీక్షలను ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది.లాసెట్ పరీక్షకు ఈనెల 25వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసి, మార్చి 1 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు సమర్పణకు ఏప్రిల్ 15 చివరి తేదీ. జూన్ 6వ తేదీన ఉదయం 9.30 నుంచి 11 వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి 2 వరకు మూడేళ్ల ఎల్‌ఎల్‌బి, సాయంత్రం 4 నుంచి 5.30 వరకు ఐదేళ్ల ఎల్‌ఎల్‌బి, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్ష జరుగనున్నది. అలాగే లాటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టిజి ఇసెట్‌ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తుంది. ఈ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ను ఈ నెల 25న విడుదల చేసి, మార్చి 3 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్ 19 వరకు విద్యార్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు. మే 12న ఇసెట్ పరీక్ష జరుగనున్నది.
టిజి లాసెట్ షెడ్యూల్
నోటిఫికేషన్ తేదీ : ఫిబ్రవరి 25
అన్‌లైన్ దరఖాస్తులు : మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు(ఆలస్య రుసుం లేకుండా)
పరీక్ష తేదీ : జూన్ 6
టిజి ఇసెట్ షెడ్యూల్
నోటిఫికేషన్ విడుదల: ఫిబ్రవరి 25
ఆన్‌లైన్ దరఖాస్తులు : మార్చి 3 నుంచి ఏప్రిల్ 19 వరకు (అలస్య రుసుం లేకుండా)
పరీక్ష : మే 12