Monday, January 20, 2025

పాత కొత్తల ఘర్షణ!

- Advertisement -
- Advertisement -

దేశంలోని సంప్రదాయ శాంతి భద్రతల పరిరక్షణ వ్యవస్థలకు, ఆధునిక ప్రజాస్వామ్య దృక్పథానికి తీవ్ర వైరుధ్యం వున్న చేదు వాస్తవం పదే పదే రుజువవుతున్నది. స్వలింగ జంటల వివాహ హక్కు అభ్యర్థనను తిరస్కరించడంలో, మహిళకు తన శరీరంపై గల హక్కుకు భిన్నంగా పుట్టబోయే బిడ్డ హక్కును ధ్రువీకరించడంలోనూ సుప్రీం కోర్టు ధర్మపీఠాలు ఆధునిక భావజాలాన్ని తిరస్కరించాయనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో మరి రెండు సున్నితమైన అంశాలపై కేంద్రం, న్యాయ వ్యవస్థ ఎటు వైపు నిలబడతాయనే ప్రశ్నకు ఆస్కారం కలిగించే పరిణామం చోటు చేసుకొంటున్నది. భారత శిక్షాస్మృతి(ఐపిసి)ని, నేర శిక్షా స్మృతి(సిఆర్‌పిసి) ని, భారత సాక్షాల చట్టాన్ని తొలగించి వాటి స్థానంలో కొత్త చట్టాలను తీసుకు రావాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. ఇందు కోసం కేంద్రం మూడు బిల్లులను ఆగస్టు 11న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. వలస పాలన వాసనలున్న చట్టాలను తొలగించే ఉద్దేశంతోనే వీటిని తీసుకు వస్తున్నట్టు చెప్పుకొన్నది. భారతీయ న్యాయ సంహిత (2023), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (2023), భారతీయ సాక్ష అధినియం (2023) అని ఈ బిల్లులకు కేంద్రం హిందీలో నామకరణం చేసింది. సత్వర న్యాయం కల్పించడానికే ఈ కొత్త చట్టాలను తీసుకు రాదలచామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక సందర్భలో పేర్కొన్నారు.

ఈ చట్టాలు భారత పౌరుల హక్కులను కాపాడుతాయని కూడా శ్లాఘించారు.ఈ బిల్లులకు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర హోం శాఖ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం చేసినట్టు చెబుతున్న కొన్ని సిఫార్సులు వివాదాస్పదం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాహేతర సంబంధాలు పెట్టుకోడాన్ని నేరంగా పరిగణించే పాత చట్టాన్ని తిరిగి ప్రవేశపెట్టాలనేది ఇందులో ఒకటి. సుప్రీం కోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 2018లో రద్దు చేసిన భారత శిక్షాస్మృతి 497 సెక్షన్ వివాహేతర సంబంధం పెట్టుకొన్న పురుషుడికి ఐదేళ్ళ శిక్షను నిర్దేశిస్తున్నది. ఈ విషయంలో స్త్రీ, పురుషులిద్దరినీ నేరస్థులుగా పరిగణించాలని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసినట్టు తాజా వార్తలు చెబుతున్నాయి. ఇదే జరిగితే దేశంలో గత కాలపు న్యాయం తిరిగి ప్రాణం పోసుకొంటుందని చెప్పవచ్చు. అది బిజెపి పాలకుల హిందూత్వ దృష్టికి, మితవాద దృక్పథానికి అనుకూలంగా వుంటుంది. భారతీయ సామాజిక వ్యవస్థకు వైవాహిక జీవితం ఇరుసుగా కొనసాగుతున్న మాట నిజం.సంప్రదాయబద్ధమైన వివాహ వ్యవస్థలో స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం బొత్తిగా లేదని ఇందులో స్త్రీయే బాధితురాలని భావిస్తున్న ఆధునికులు పూర్వపు ఐపిసి సెక్షన్ 497 ను తీవ్రంగా వ్యతిరేకించారు.

వివాహేతర సంబంధంపై నిషేధం రాజ్యాంగం 14, 15, 21 అధికరణలకు ఉల్లంఘన అని మహిళ స్వయం ప్రతిపత్తిని దెబ్బ తీస్తుందని ధర్మపీఠం అభిప్రాయపడింది. పర్యవసానంగా సుప్రీం ధర్మాసనం దానికి స్వస్తి చెప్పింది.వివాహం పురుషాధిక్య సమాజ వ్యవస్థ అని వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించకుండా వుండేంత వరకు అందులో ఎప్పుడూ మహిళలే బాధితులవుతారని, వివాహేతర సంబంధాన్ని తిరిగి నేరంగా పరిగణించి ఉభయులను నేరస్థులను చేయడం స్త్రీని మరింతగా బాధితురాలిని చేస్తుందని వాదిస్తున్న హక్కుల కార్యకర్తలున్నారు. వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణించడం వల్ల ఆ సంబంధం పెట్టుకొన్న స్త్రీ నిందలకు, వేధింపులకు గురయ్యే అవకాశాలు ఎక్కువని కూడా వీరు భావిస్తున్నారు. వివాహ వ్యవస్థ నిలబడాలంటే దాని కట్టుబాట్లను స్త్రీ మౌనంగా అంగీకరించి, వాటికి లోబడి ప్రవర్తించడమే శరణ్యమని మితవాదులు భావిస్తున్నారు. వివాహ వ్యవస్థ లోపలే స్త్రీకి పురుషుడితో సమానంగా ఆత్మగౌరవాది హక్కులు వుండాలని కొందరి ఆధునికుల అభిప్రాయం. సంసార జీవన వ్యవస్థకు ఎటువంటి ముప్పు వాటిల్లకూడదన్నది నిర్వివాదం. అదే సమయంలో స్త్రీకి మెరుగైన జీవనం లభించాలి.

ఈ రెండింటి మధ్య సమన్వయం సాధించడంలోనే భారతీయ విలువల మనుగడ ఇమిడి వుంటుంది. మరణ శిక్షను రద్దు చేయడమా, కొనసాగించడమా అనే విషయంలో బిజెపి ఎంపి బ్రిజ్‌లాల్ అధ్యక్షతన గల పార్లమెంటరీ కమిటీ ఏ విషయాన్నీ తేల్చలేదు. దీనిని ప్రభుత్వ నిర్ణయానికే వదిలి వేస్తున్నట్టు అది ప్రకటించింది.ఈ శిక్ష కొనసాగుతుందని గతంలో ఐక్యరాజ్య సమితికి ఇండియా స్పష్టం చేసి వుంది. కాంగ్రెస్ నాయకులు పి.చిదంబరం, దిగ్విజయ్ సింగ్, తృణమూల్ కాంగ్రెస్ తరపున డెరెక్ ఓబ్రీన్ ఈ విషయంలో అసమ్మతి అభిప్రాయాలను కమిటీకి తెలియజేశారు. బ్రిటిష్ కాలం నాటి అమానుష చట్టాలను తొలగిస్తామని చెబుతూ మరణ శిక్షను కొనసాగించడం, దాని పరిధిలోకి మరి నాలుగు నేరాలను చేర్చబోవడం అసంబద్ధమని వారు అభిప్రాయపడ్డారు. మొత్తానికి పాతకు, కొత్తకు మధ్య ఘర్షణ జరుగుతున్నది. వలస పాలకుల నాటి దుసంప్రదాయాలను తొలగిస్తున్నామని చెప్పుకొంటున్న బిజెపి ప్రభుత్వం కొత్త సీసా లో పాత సారాయి మాదిరిగా మళ్ళీ అవే అనాగరక పద్ధతులను ప్రవేశపెడితే హర్షించలేము.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News