హైదరాబాద్ : జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి తన లైసెన్స్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…ఎపి రాష్ట్రం, కడప జిల్లాకు చెందిన శివారెడ్డి(44) ఎయిర్‌ఫోర్స్ నుంచి సార్జెంట్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. ఉద్యోగ విరమణ తర్వాత తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు.భార్య నుంచి విడాకులు తీసుకున్న శివారెడ్డి బాగ్‌లింగంపల్లిలోని మానమా అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం 6గంటలకు కడప నుంచి వచ్చిన శివారెడ్డి టీ తాగి తన ఇంటి లోపలికి వెళ్లాడు. తర్వాత తన లైసెన్స్‌డ్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శివారెడ్డి సోదరి మహేశ్వరి చాలా సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో కవాడిగూడలో ఉంటున్న తన స్నేహితురాలు లక్ష్మిభవానికి ఫోన్ చేసింది. తన సోదరుడు ఫోన్ లిఫ్ట్ చేయడంలేదని వెంటనే వెళ్లి చూడాల్సిందిగా కోరింది. లక్ష్మిభవాని తల్లితో కలిసి వచ్చి వాచ్‌మెన్ సాయంతో శివారెడ్డి ఇంటి తలుపు పగులగొట్టి చూడగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చిక్కడపల్లి పోలీసులు తెలిపారు.