Wednesday, January 22, 2025

చంద్రబాబుకు బెయిల్‌పై ఎసిబి కోర్టులో పిటిషన్.. శుక్రవారం విచారణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టిడిపి అధినేత చంద్రబాబుకు బెయిలు ఇవ్వాలంటూ ఎసిబి కోర్టులో గింజుపల్లి సుబ్బారావు అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబుపై సిఐడి మోపిన అభియోగాలు నిరాధారమని పేర్కొంటూ ఈ పిటిషన్ వేశారు. ఆయన పేరు ఎఫ్‌ఐఆర్ లో పేర్కొనకుండానే రిమాండ్ రిపోర్టులో ఆయన పేరును ఎ37గా పేర్కొంటూ సిఐడి ఈ కేసు దర్యాప్తు చేస్తోందని, దురుద్దేశపూర్వకంగానే ఈ కేసు నమోదైందని సుబ్బారావు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ అంశంపై విచారణ చేసి, చంద్రబాబుకు బెయిలు మంజూరు చేయాలని అభ్యర్థిస్తూ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన విజయవాడ ఎసిబి కోర్టు దీనిపై నేడు విచారణ చేపట్టనుంది. ఈ పిటిషన్‌కు సంబంధించి ఎపి సిఐడికి నోటీసులు జారీ చేసింది. గతంలోనూ రెండు రోజుల క్రితమూ చంద్రబాబుకు బెయిలు ఇవ్వాలంటూ టిడిపి కార్యకర్త మహేష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్ రెండు పేజీలు మాత్రమే ఉండటం తదితర కారణాల రీత్యా సదరు పిటిషన్ ను తోసిపుచ్చింది.

అయితే న్యాయవాది జి.సుబ్బారావు దాఖలు చేసిన పిటిషన్‌ను మాత్రం స్వీకరించిన ఏసీబీ కోర్టు దీనిపై శుక్రవారం విచారణ చేపట్టనుంది. ఈ మేరకు సిఐడికి నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ఈనెల 19కి వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు సమయం కావాలని సిఐడి కోరడంతో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. సిఐడి విజ్ఞప్తి మేరకు విచారణకు ఒక్కరోజు ముందు వరకు కౌంటర్ దాఖలుకు సమయమిచ్చింది. ఈ నెల 18 లోగా కౌంటర్ వేయాలని సిఐడిని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు ఎసిబి కోర్టులో సిఐడి వేసిన కస్టడీ పిటిషన్ ను ఈ నెల 18 వరకు విచారించవద్దని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. చంద్రబాబును ఐదు రోజుల కస్టడీ కోరుతూ విజయవాడ ఎసిబి కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు సిఐడి పిటిషన్‌పై ఎలాంటి విచారణ జరపవద్దని ఎసిబి కోర్టుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

రాజధాని ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసు పిటిషన్‌పై విచారణ సైతం ఈ నెల 19కి వాయిదా పడింది. సిఐడినమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా కౌంటర్ దాఖలుకు సిఐడి సమయం కోరింది. రాజధాని నగర బృహత్ ప్రణాళిక, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ నిర్ణయం వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని సిఐడి తనపై నమోదు చేసిన కేసులో బెయిలు మంజూరు చేయాలని కోరుతూ టిడిపి అధినేత చంద్రబాబునాయుడు హైకోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేష్‌రెడ్డి ఈ వ్యాజ్యంపై బుధవారం విచారణ జరపనుండగా కౌంటర్ దాఖలుకు సిఐడి సమయం కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News