హైదరాబాద్: ఎపిలోని సత్యసాయి పుట్టపర్తి జిల్లాకు చెందిన ఓ న్యాయవాది పదకొండేళ్ళు తన భార్యని ఇంట్లో నిర్భందించిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని విజయనగరం కంటోన్మెంట్ బాలాజీ మార్కెట్ సమీపంలో ఉంటున్న గోదావరి మధుసూదన్ అనే న్యాయవాది 2008లో సాయి సుప్రియను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం కలిగారు. ఈ క్రమంలో తల్లి గోదావరి ఉమామహేశ్వరితో పాటు తన తమ్ముడి మాటలు విని కట్టుకున్న భార్య సుప్రియను వేధించాడు. చీకటిగదిలో నరకం అనుభవిస్తున్న సుప్రియ తనను విడిచిపెట్టాలని ఎన్నిసార్లు బ్రతిమలాడినా మధుసూదన్ కనికరించలేదు. బాధితురాలు తల్లిదండ్రులను కూడా బెదిరించేవాడు. సహనం కోల్పోయిన బాధితురాలు తల్లిదండ్రులు ఇటీవల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
దీంతో ఒకటో నెంబర్ పట్టణ పోలీసులు గతనెల 28న మధుసూదన్ ఇంటికి వెళ్ళి పరిశీలించారు. తమ ఇంటిని తనిఖీ చేసే అధికారం మీకు లేదని , తనిఖీ చేసేందుకు కోర్టు ఆదేశాలు ఏమైనా ఉన్నాయా అంటూ మధుసూదన్ పోలీసులను ప్రశ్నించడంతో వారు వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో బాధితురాలు తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి సెర్చ్ వారెంట్ తీసుకొచ్చారు. దీంతో బుధవారం పోలీసులు న్యాయవాది మధుసూదన్ ఇంటిని తనిఖీ చేయగా సాయిప్రియ బక్క చిక్కిన శరీరంతో చీకటి గదిలో దుర్భలమైన పరిస్థితిలో కనిపించింది. దీంతో పోలీసులు ఆమెను బయటకు తీసుకొచ్చి న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు నిందితులపై చర్యలు తీసుకుంటామని వన్‌టౌన్ సిఐ బి. వెంకట్రావు తెలిపారు.