రాజస్థాన్ హైకోర్టులో సమ్మెపై సుప్రీంకోర్టు విచారణ
న్యూఢిల్లీ: సమ్మెల ద్వారా న్యాయవాదులు కోర్టు కార్యకలాపాలను అడ్డుకోలేరని, వారి కక్షిదారులకే అది ప్రమాదమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాజస్థాన్ హైకోర్టులో బార్ అసోసియేషన్ పిలుపుతో న్యాయవాదులు సమ్మెలో పాల్గొన్న రోజునే ఓ కేసు విచారణ జరిగిన ఉదంతంపై సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. న్యాయవాదులకు సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉన్నదని, అలాంటివారు సమ్మె కారణంగా కోర్టుకు హాజరు కాకపోవడం వృత్తి ధర్మానికి విరుద్ధమని తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్ 27న రాజస్థాన్ హైకోర్టు న్యాయవాదులు సమ్మెలో పాల్గొన్న ఘటనపై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎఎస్ బోపన్న ధర్మాసనం విచారణ చేపట్టింది. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, కార్యదర్శి, మిగతా కార్యవర్గానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. వారిపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు ఎందుకు చేపట్టకూడదో సమాధానమివ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 25కు వాయిదా వేసింది. న్యాయవాదులు సమ్మెకు వెళ్లడం లేదా సమ్మెకు పిలుపునిచ్చేందుకు హక్కు లేదని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించడం గమనార్హం.