మరో అమెరికా కంపెనీకి బాస్‌గా భారతీయుడు
న్యూయార్క్ : స్టార్‌బక్స్ కార్ప్ కొత్త సిఇఒ (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)గా లక్ష్మణ్ నరసింహన్ నియమితులయ్యారు. ప్రపంచంలోనే అతిపెద్ద కాఫీ చైన్ పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే కొత్త నాయకత్వం కోసం కసరత్తు చేసిన తర్వాత ఆఖరికి భారతీయుడికి బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం నరసింహన్ రెకిట్ సిఇఒగా ఉన్నారు. ఈ సంస్థ డ్యూరెక్స్ కండోమ్‌లు, ఎన్‌ఫామిల్ బేబీ ఫార్ములా, ముసినెక్స్ కోల్డ్ సిరప్‌లను కూడా తయారు చేస్తుంది. అయితే నరసిహన్ తన కొత్త బాధ్యతల గురించి ముందుగానే ప్రకటించగా, ఎఫ్‌టిఎస్‌ఇకి చెందిన రెకిట్ షేర్లు 4 శాతం పతనమయ్యాయి. స్టార్‌బక్స్ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. గతేడాదిలో 200కి పైగా అమెరికా స్టోర్లు సంఘటితమవ్వగా, ద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యంలో మెరుగైన ప్రయోజనాలు, వేతనాలు కోసం కార్మికులు పోరాటం చేస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో నరసింహ్మన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అక్టోబర్‌లో ఆయన స్టార్‌బక్స్‌లో చేరనున్నారు.