హైదరాబాద్ : జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (జెపిఎస్) హక్కుల కోసం పోరాడుతుంటే బెదిరింపులతో సమ్మెను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని బిజెపి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ధ్వజమెత్తారు. గురువారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో లక్ష్మణ్ మాట్లాడారు. జెపిఎస్‌లను ఉద్యోగాల నుంచి తీసివేస్తామని బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జెపిఎస్ సమస్యలను తక్షణమే పరిష్కరించి.. రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ‘ఐదు వేలకు పైగా వీఆర్వోలు తమ హక్కుల కోసం పోరాటం చేస్తే వీఆర్వో వ్యవస్థనే లేకుండా చేశారు. ఆర్టీవీ సమ్మెపైనా ప్రభుత్వం ఉక్కు పాదం మోపింది.
అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులకు అందించే పరిహారం విషయంలో ముఖ్యమంత్రికి సమీక్ష చేసే తీరిక లేకపోవడం చూస్తే.. అన్నదాతల పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధి అర్ధమవుతోంది. ప్రచారం కోసం రూ. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టేందుకు బిఆర్‌ఎస్ సర్కారు సిద్ధంగా ఉంది తప్పు.. రైతుల కోసం రూ.300 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా లేదని ఆరోపించారు. ఉగ్రవాద కార్యకలాపాలను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేయాలి. దేశంలో ఎక్కడేమి జరిగినా దాని మూలాలు హైదరాబాద్‌లో ముడిపడి ఉంటున్నాయి. ఇది తెలంగాణ రాష్ట్ర భద్రతకు ముప్పుగా వాటిల్లే ప్రమాదం ఉంది‘ లక్ష్మణ్ తెలిపారు. మరోవైపు కర్ణాటక ఎన్నికల ఎగ్జిట్ పోటీపైనా లక్ష్మణ్ స్పందించారు. ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మడం లేదని.. పీపుల్స్ పోల్స్‌ను మాత్రమే నమ్ముతామని తెలిపారు. కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందనే విశ్వాసం ఉందన్నారు.