వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు
ఉద్యోగుల్లో టెన్షన్ టెన్షన్
కోతల జాబితాలో చేరిన మైక్రోసాఫ్ట్, గూగుల్
న్యూఢిల్లీ : ప్రపంచ ఆర్థిక మాంద్యం ఆందోళనలు, ద్రవ్యోల్బణం పెరుగుదల నేపథ్యంలో పలు దేశాల్లో పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి. ప్రధానంగా అమెరికా కంపెనీలు ఉద్యోగాల్లో భారీ కోతలకు సిద్ధమయ్యాయి. దీంతో ఉద్యోగుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. ఇప్పటికే మెటా, ట్విట్టర్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి కంపెనీలు లేఆఫ్‌ల(తొలగింపు)ను చేపట్టాయి. ఇంకా అనేక కంపెనీలు కూడా ఖర్చులను తగ్గించుకునే పనిలో నిమగ్నమయ్యాయి.
వాస్తవానికి కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఇంటి నుండి పని చేస్తున్నప్పుడు ఐటి కంపెనీలకు పెద్ద అవకాశం లభించింది. ఈ సమయంలో కంపెనీలు భారీగా నియామకాలు చేపట్టాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మామూలుగా మారిందని, ఉద్యోగులు ఆఫీసుకు వెళ్లడం మొదలుపెట్టారని, నష్టాలను తగ్గించుకునేందుకు ఇప్పుడు కంపెనీలు కోతలు ప్రారంభించాయి. ఐటి దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో సుమారు 10 వేల మంది ఉద్యోగులను తొలగించింది. బ్లాగ్‌పోస్ట్‌లో కంపెనీ సిఇఒ సత్య నాదెళ్ల ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇది మొత్తం ఉద్యోగుల్లో 5 శాతం లోపు ఉంటుందని నాదెళ్ల పేర్కొన్నారు. ఉద్యోగుల తొలగింపు కష్టమైందే, కానీ అవసరమని ఆయన అన్నారు. ఇప్పటికే ట్విట్టర్, మెటాతో పాటు అనేక ఇతర టెక్ కంపెనీలు లేఆఫ్‌లను మొదలుపెట్టాయి. స్థూల ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి కారణంగా మైక్రోసాఫ్ట్ 5 శాతం ఉద్యోగులను తొలగించింది. ప్రధానంగా ఇంజినీరింగ్ డివిజన్‌కు చెందినవారు ఈ తొలగింపు వల్ల నష్టపోనున్నారు. జూన్ 30 నాటికి కంపెనీలో 2,21,000 మంది ఉద్యోగులు ఉన్నారు. దీనిలో అమెరికాకు చెందిన వారు 1,22,000 మంది, ఇతర దేశాల్లో 99,000 మంది ఉన్నారు.
గత ఏడాది అక్టోబర్‌లో మైక్రోసాఫ్ట్ అన్ని విభాగాల్లో దాదాపు 1,000 మంది ఉద్యోగులను తొలగించింది. మైక్రోసాఫ్ట్ కూడా ఉద్యోగుల తొలగింపుపై కొంతకాలంగా సూచనలు చేస్తూనే ఉంది. కంపెనీ సిఇఒ సత్య నాదెళ్ల సిఎన్‌బిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మైక్రోసాఫ్ట్ ప్రపంచ మార్పులకు అతీతం కాదని అన్నారు. రాబోయే 2 సంవత్సరాలు టెక్ కంపెనీలకు సవాలుగా ఉంటాయని నాదెళ్ల అన్నారు. గత 5 నెలలుగా అనేక అమెరికా టెక్ దిగ్గజాలు నిర్వహణ ఖర్చులను ఆదా చేసేందుకు వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. కొవిడ్ 19 మహమ్మారి సమయంలో ఉక్రెయిన్-రష్యా యుద్ధం, వృద్ధి మందగించడం, అధిక నియామకాలు వంటివి లేఆఫ్‌లకు ప్రధాన కారణమని కంపెనీలు పేర్కొంటున్నాయి. ఆర్థిక మాంద్యం ఆందోళనల నేపథ్యంలో ఇకామర్స్ అమెజాన్ ఉద్యోగాల కొతలను ప్రారంభించింది.
ఈ నెల ప్రారంభంలో సుమారు 18 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నామని కంపెనీ ప్రకటించింది. ఇది కార్పొరేట్ చరిత్రలోనే అత్యధిక ఉద్యోగాల తొలగింపు కావడం గమనార్హం. గత ఏడాదిలోనే తొలగింపులు ప్రారంభమయ్యాయి. ప్రాథమికంగా అమెజాన్ డివైజెస్, సర్వీసెస్ గ్రూప్‌పై కష్టతరమైన పరిస్థితులు నెలకొన్నాయి. దీనిలో ఎక్కువగా రిటైల్ విభాగం, మానవ వనరులపై ప్రభావం ఉండనుంది. గత కొన్నేళ్లుగా కంపెనీ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను రిక్రూట్ చేసిందని, అయితే ఇప్పుడు మాంద్యం భయాల నేపథ్యంలో ఉద్యోగులను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ తొలగింపు వల్ల చాలా టీమ్‌లు ప్రభావితమవుతాయి.
ప్రభావితం కానున్న ఉద్యోగుల్లో ఎక్కువగా అమెజాన్ స్టోర్, పీపుల్, ఎక్స్‌పీరియన్స్ అండ్ టెక్నాలజీ (పిఎక్స్‌టి) టీమ్‌కు చెందినవారు ఉన్నారు. ప్రభావితమైన వారికి సెపరేషన్ పేమెంట్, ట్రాన్సిషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్, ఎక్స్‌టర్నల్ జాబ్ ప్లేస్‌మెంట్ సపోర్టును అందిస్తున్నామని అమెజాన్ తెలిపింది. తాజాగా మరో దిగ్గజ ఐటి సంస్థ గూగుల్ కూడా 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఇది కఠిన నిర్ణయమే అయినా తప్పడం లేదని కంపెనీ పేర్కొంది. గూగుల్ తొలగింపులు కార్పొరేట్ ఫంక్షన్‌తో పాటు ఇంజనీరింగ్, ఉత్పత్తుల బృందంతో పాటు అన్ని టీమ్‌లను ప్రభావితం చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ తొలగింపు జరుగుతోందని, దీని ప్రభావం అమెరికాలో వెంటనే కనిపిస్తుందని గూగుల్ తెలిపింది.
గూగుల్‌లో తొలగింపులకు ఆర్థిక అనిశ్చితే కారణమని కంపెనీ తెలిపింది. గూగుల్, మైక్రోసాఫ్ట్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పిలిచే సాఫ్ట్‌వేర్‌లో పెట్టుబడి పెడుతున్నాయి. ఆల్ఫాబెట్ సిఇఒ సుందర్ పిచాయ్ నోట్‌లో ‘మా మిషన్ బలం, మా ఉత్పత్తులు, సేవలు, కృత్రిమ మేధస్సులో ప్రారంభ పెట్టుబడుల ద్వారా ముందున్న అపారమైన అవకాశాలపై నమ్మకం ఉంది’ అని అన్నారు.