హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఎల్‌బినగర్ చౌరస్తాలో సాధారణ ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులను కలుగజేసిన ముగ్గురు మహిళలను 16వ తేదీ తెల్లవారుజామున ఎల్‌బినగర్ పోలీస్ స్టేషన్ కు పెట్రోలింగ్ పోలీసులు తీసుకెళ్లారు. వారిపై ఐపిసి సెక్షన్ 290 కింద కేసు నమోదు చేసి అనంతరం కోర్టులో హాజరుపరిచారు. అయితే ఒక మహిళ కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆమెపై పోలీసుల దాడికి పాల్పడ్డారని ఆరోపణలు చేయడంతో రాచకొండ పోలీస్ కమిషనర్ డి.ఎస్.చౌహాన్ స్పందించారు. కమిషనర్ విచారణ ఆదేశించి నివేదికను తెప్పించుకోవడంతో పాటు సదరు మహిళపై దాడికి పాల్పడ్డ హెడ్ కానిస్టేబుల్ శివ కుమార్, మహిళా కానిస్టేబుల్ సుమలతపై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆగస్టు 15న మంగళవారం రాత్రి ఎల్బీనగర్ సర్కిల్ లో పోలీసులు తమ వాహనంలో మహిళను ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ తరలించి ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. రాత్రంతా పోలీస్ స్టేషన్ లో ఉంచి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఆమె ఎదురు తిరిగితే సంగతి తెలుస్తామంటూ మోకాళ్లు, పిక్కలు, తొడలపై లాఠీలతో చితకబాది నానా ఇబ్బందులకు గురిచేశారు. ఉదయం ఏడు గంటలకు మరో పోలీస్ అధికారి వచ్చి ఇంటికి పంపించాలని చెప్పడంతో వదిలిపెట్టిన విషయం తెలిసిందే.