ఆదివారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు నాలుగు భాగాలుగా వెల్లడించిన మనోరమ విఎంఆర్ సర్వే, టైవ్‌సు నౌ సర్వే కూడా కేరళలో సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్ మరోసారి అధికారంలోకి రానున్నదని వెల్లడించాయి. మనోరమ ఫిబ్రవరి 15మార్చి 15వ తేదీల మధ్య జరిపిన సర్వే ప్రకారం ఎల్‌డిఎఫ్‌కు కనిష్ఠంగా 77, గరిష్ఠంగా 82 రానున్నాయని వెల్లడించారు. ఇదే విధంగా కాంగ్రెస్ నాయకత్వంలోని యుడిఎఫ్‌కు 5459, బిజెపికి మూడు, ఇతరులకు ఒకటి వస్తాయని పేర్కొన్నది.ఎల్‌డిఎఫ్‌కు 43.65, యుడిఎఫ్‌కు 37.37, బిజెపి కూటమికి 16.46, ఇతరులకు 2.52 శాతం చొప్పున ఓట్లు వస్తాయని తెలిపింది. ముఖ్యమంత్రిగా తగిన వ్యక్తిగా 39 శాతం మంది పినరయి విజయన్‌కు ఓటు వేయగా, తరువాతి స్ధానాలలో ఊమెన్ చాందీ (కాంగ్రెస్) 26, కెకే శైలజ (సిపిఎం), రమేష్ చెన్నితల (కాంగ్రెస్) 11, కె సురేంద్రన్ (బిజెపి) ఐదు, వి.మురళీధరన్ (బిజెపి) మూడు శాతం చొప్పున ఉన్నారు.
తిరువనంతపురం జిల్లాలో పద్నాలుగు స్ధానాలుండగా 12 ఎల్‌డిఎఫ్ గెలుస్తుందని, రెండు బిజెకి రావచ్చని, కాంగ్రెస్‌కు ఒక్కటి కూడా వచ్చే అవకాశం లేదని సర్వే పేర్కొన్నది. బిజెపికి వస్తాయని చెబుతున్న రెండింటిలో ఒకటి గత ఎన్నికల్లో గెలిచిన నీమవ్‌ు స్ధానం ఉంది. అక్కడ మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, ప్రస్తుతం ఎంపిగా ఉన్న కె. మురళీధరన్ కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తూ బిజెపి, కాంగ్రెస్ కుమ్మక్కు అనే ముద్రను తొలగించుకొనేందుకు చూస్తున్నారు. ఇక్కడ బిజెపికి 41.3శాతం, సిపిఎంకు 41.2 వస్తాయని సర్వేలో తేలింది. అయితే సర్వే సమయానికి కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరన్నది ఖరారు కాలేదు. బలమైన మురళీధరన్‌ను ఎంపిక చేసినందున దాని ప్రభావం ఉండవచ్చని పేర్కొన్నది. ఇలాంటి తీవ్ర పోటీ ఉన్న నియోజకవర్గాలు మరికొన్ని ఉన్నాయి. బిజెపి గెలుస్తుందని అంచనా వేసిన మరొక నియోజకవర్గం తిరువనంతపురం. గతం లో ఇక్కడ యుడిఎఫ్ గెలిచింది. ప్రస్తుతం బిజెపి 32.5, సిపిఎం 30.4, కాంగ్రెస్‌కు 25.2శాతం వస్తాయని పేర్కొన్నది.
ఈ సర్వే సమయంలో, తరువాత జరిగిన పరిణామాలన్నీ ఎల్‌డిఎఫ్‌కు అనుకూలంగానే ఉన్నాయి. ఈ సర్వే ప్రకారం మంజేశ్వరం నియోజక వర్గంలో బిజెపికి విజయావకాశాలు ఉన్నాయి. అయితే ఆ పార్టీ అనుసరిస్తున్న ఎత్తుగడలు దానికి ఎదురు తగిలి ముస్లిం లీగుకు ఉపయోగపడతాయని తాజాగా మనోరమ విశ్లేషణ పేర్కొన్నది. ఈ నియోజకవర్గంలో బిజెపి రాష్ర్ట అధ్యక్షుడు సురేంద్రన్ పోటీ చేస్తున్నారు. కాసరగోడ్ జిల్లాలో కర్ణాటకు దగ్గరలో ఉన్న ఈ నియోజకవర్గంలో 53 శాతం ఓటర్లు ముస్లింలే ఉన్నారు. కర్ణాటక నుంచి వస్తున్న బిజెపి నేతలందరూ కేవలం హిందూ ఓటర్లనే కలుస్తూ బిజెపిని గెలిపించాల్సిన అవసరాన్ని వివరిస్తుండటంలో మిగిలిన వారు బిజెపిని ఓడించేందుకు సంఘటితం అవుతున్నారు. గత ఎన్నికల్లో కేవలం 89 ఓట్లతో బిజెపి సురేంద్రన్ ఓడిపోయారు. మరోసారి ఎల్‌డిఎఫ్ విజయం సాధించనున్నదనే వాతావరణం ఎల్లెడలా ఉండటం, మీడియా సర్వేలు కూడా దానినే నిర్ధారించటంతో ఓటర్లు ముస్లిం లీగు వైపు మొగ్గుతారా లేక సిపిఎం వైపు చూస్తారా అన్నది ప్రశ్నార్దకంగా మారింది.గత ఏడు దఫాలుగా ఈ నియోజకవర్గంలో బిజెపి రెండవ స్దానంలో వస్తోంది.
బిజెపి రాష్ర్ట అధ్యక్షుడు సురేంద్రన్ ఇక్కడి నుంచి పోటీ చేయటం వరుసగా ఇది మూడవసారి, ఇక్కడ గెలిచే నమ్మకం లేకపోవటంతో పత్తానంతిట్ట జిల్లాలోని కొన్ని నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నారు. మంజేశ్వరంలో పదివేల మెజారిటీతో గెలుస్తానని సురేంద్రన్ చెబుతున్నారు.ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముస్లింలీగ్ సభ్యుడు బంగారు ఆభరణాల కుంభకోణంలో పీకల్లోతు మునిగి ఉన్నారు. ఈ కుంభకోణంలో బాధితులు అత్యధికులు ముస్లింలే. దీంతో ఆ పార్టీ నేతలు సమర్ధించలేని స్ధితిలో పడిపోయారు. దీంతో వేరొకరిని నిలిపారు. సిపిఎంకు ఆదరణ పెరగవచ్చని భావిస్తున్నారు. టైవ్‌సు నౌ సర్వే వివరాలు కూడా తాజాగా వెలువడ్డాయి. దాని విశ్లేషణ ప్రకారం ఎల్‌డిఎఫ్‌కు 77, యుడిఎఫ్‌కు 62, బిజెపికి ఒక స్ధానం వస్తుందని పేర్కొన్నారు.
రానున్న ఎన్నికలలో ఎల్‌డిఎఫ్ తిరిగి విజయం సాధించనున్నదని మాజీ ముఖ్యమంత్రి, 97 సంవత్సరాల సిపిఎం నేత విఎస్ అచ్యుతానందన్ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. గత ఐదు సంవత్సరాలలో ప్రభుత్వం వరదలు, ఓఖి, నిఫా, కరోనా వైరస్‌లను తట్టుకున్నదని చెప్పారు. విజయన్ ప్రభుత్వం మీద వచ్చిన విమర్శల గురించి చెబుతూ తన మీద కూడా ఇలాంటి ఆరోపణలు చేశారని, ఏకంగా ఒక కమిటీని కూడా వేశారని గుర్తు చేశారు. వచ్చిన ఆరోపణల మీద కేంద్ర సంస్ధలు దర్యాప్తు జరపాలని రాష్ర్ట ప్రభుత్వమే కోరిన విషయాన్ని చెబుతూ ఎన్నికల సమయంలో ప్రచారానికి దర్యాప్తు సంస్దలను వినియోగిస్తున్నారని అన్నారు. విజయం సాధించేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నాల గురించి అడగ్గా స్వాతంత్య్ర ఉద్యమ కాలం నుంచి వామపక్ష ప్రజాతంత్రశక్తులు ఎంత చురుకుగా ఉన్నాయో సంఘవ్యతిరేక శక్తులు కూడా అదే విధంగా ఉన్నాయని అన్నారు. కేరళలో బిజెపి గెలిచే అవకాశాలు లేవని, దేశాన్ని అమ్మివేస్తున్న బిజెపికి తగిన బుద్ది చెబుతారని అన్నారు. రాజకీయ పార్టీల పని తీరుతెన్నులు మారిపోయాయని, గతంలో ఇచ్చిన నినాదాలు ఇప్పుడు పని చేయవన్నారు.
ఎప్పటికైనా రాజకీయనేతలకు మౌలిక విలువలు, త్యాగం, నిజాయితీ ముఖ్యమని వాటిని కాపాడుకొంటూ పని చేయటం ద్వారా వామపక్ష శక్తులు ముందుకు పోతాయని అన్నారు. ముఖ్యమంత్రి, ఇతర అధికారపక్ష నేతలకు వ్యతిరేకంగా బంగారం స్మగ్గింగ్ కేసులో ఒక నిందితుడితో బలవంతంగా ప్రకటన చేయించటం, దాన్ని కోర్టులో సమర్పించిన కేంద్ర ప్రభుత్వ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులపై కేరళ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఆ కేసును ఎత్తివేయాలని, దర్యాప్తు మీద స్టే ఇవ్వాలని ఇడి చేసిన అభ్యర్ధనను రాష్ర్ట హైకోర్టు తిరస్కరించింది. విచారణ కొనసాగించవచ్చని పేర్కొన్నది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరంతరం పని చేస్తున్న నాయర్ సర్వీస్ సొసైటీ తీరు తెన్నుల గురించి ప్రజలూ, ప్రభుత్వమూ గమనిస్తున్న విషయాన్ని ఆ సంస్ధ కూడా గుర్తించటం అవసరం అని ముఖ్యమంత్రి పినరయి విజయన్ విలేకర్ల ప్రశ్నలకు జవాబిచ్చారు. అసలు వారెందుకు అలా ఎందుకు వ్యవహరిస్తున్నారో మీరైనా తెలుసుకోండని విలేకర్లతో అన్నారు.
దీని మీద సొసైటీ ప్రధాన కార్యదర్శి సుకుమారన్ నాయర్ తాము సమదూరం పాటిస్తున్నామని, శబరిమల ఆలయం మీద ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్‌ను వెనక్కు తీసుకోవాలని కోరుతున్నామని, పది శాతం ఇబిసి రిజర్వేషన్లు అమలు జరపాలని, సంస్ధ నేత మన్మాత్ పద్మనాభన్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని కోరుతున్నట్లుగా చెప్పారు. కేరళలో ఇఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వాన ఏర్పడిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కాంగ్రెస్, ఇతర మతశక్తులతో కలసి సాగించిన ఆందోళనలో పద్మనాభన్ ఒక ముఖ్యపాత్రధారిగా ఉన్నారు. ఏడాది తరువాత తిరువనంతపురంలోని కాంగ్రెస్ కార్యాలయ మెట్లెక్కిన మాజీ ముఖ్యమంత్రి ఏ కె ఆంటోని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై తన అక్కసును వెళ్లగక్కారు.ఆయనకు గర్వం ఎక్కువ, హిందువులు, ఇతర సామాజిక తరగతులను తప్పుదారి పట్టించారు.
సిపిఎం పొలిట్‌బ్యూరో కూడా ఆయనను అదుపు చేయలేదు అంటూ విరుచుకుపడ్డారు. విజయన్ ఎంతో ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా ప్రతి సర్వేలోనూ వెల్లడి అవుతోంది. రెండోసారి అధికారం చేపట్టబోతున్నారని ఇప్పటికే రెండు ప్రధాన మీడియా సంస్ధలైన మాతృభూమి, మలయాళ మనోరమ తమ సర్వేల్లో వెల్లడించిన నేపథ్యంలో గందరగోళ పడిన ఆంటోని సహజంగానే తమ కార్యకర్తల మనోనిబ్బరాన్ని కాపాడుకొనేందుకు పూనుకున్నట్లు స్పష్టంఅయింది. తమ భవిష్యత్ బాగుండాలంటే విజయన్‌కు రెండోసారి అవకాశం ఇవ్వవద్దని తాను నిజమైన కమ్యూనిస్టులను కోరుతున్నట్లు ఆంటోని చెప్పారు. ఇంతకాలంగా కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను గత స్థానిక సంస్ధల ఎన్నికల్లో ఓటర్లు తిరస్కరించారు. ఇప్పుడు పాడిందే పాడ రా అన్నట్లు అంటోని కూడా పునశ్చరణ చేస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
కొడంగనల్లూరు నియోజకవర్గంలో యుడిఎఫ్ అభ్యర్ధి శోభా సుబీన్‌కు రెండు నియోజకవర్గాలలో మూడు చోట్ల ఓట్లు ఉన్నాయంటూ సిపిఎం కార్యకర్తలు గుర్తింపు కార్డులతో సహా వివరాలను మీడియాకు అందచేశారు. ఎక్కువ చోట్ల ఓట్లు ఉన్నవారు ఓటేసేందుకు అర్హత లేదంటున్న రమేష్ చెన్నితల తమ అభ్యర్ధి అసలు పోటీకి ఎలా అర్హుడో చెప్పాలని ప్రశ్నించారు. ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్న విషయం, ఎలా జరిగిందో తనకసలు తెలియనే తెలియదని సుబీన్ చెబుతున్నారు. ఒకవేళ ఎన్నికల సిబ్బంది తప్పు చేస్తే వారే దాన్ని సరిదిద్దాలని సుబీన్ అన్నారు. అదే సూత్రం ఇతర చోట్ల వర్తించదా అని రమేష్ చెన్నితలను సిపిఎం ప్రశ్నిస్తోంది. తాను గురువాయూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నానని అయితే పార్టీ నేత (నరేంద్ర మోడీ) త్రిసూర్ లేనా హయ్ అన్నారు, దాన్ని మన్నించి ఇక్కడ పోటీ చేస్తున్నా, ఇక్కడ ఓటర్లేమో త్రిసూర్‌ను మీకే ఇస్తున్నాం అని చెబుతున్నారని ప్రముఖ నటుడు సురేష్ గోపి చెప్పుకున్నారు.
గురువాయూర్‌లో నామినేషన్ పత్రాలు సరిగా వేయని కారణంగా అసలు అక్కడ బిజెపికి అభ్యర్థే లేకుండాపోయారు. ఈ ఎన్నికల్లో శబరిమల ఒక అంశం కాదని అయితే మనోభావాలు ఉన్నాయని అన్నారు. వామపక్షాలు గెలుస్తాయని సర్వేలు చెబుతున్నాయి. వాటిని నిలిపివేయాలని కోరుతున్నా కాని అది అసాధ్యమని ఎన్నికల కమిషన్ చెప్పింది. మరోవైపు శబరిమల గురించి చర్చించకూడదని కమిషన్ చెబుతోంది. పౌరుల విశ్వాసాలు, సంప్రదాయాలను కాపాడాలంటే శబరిమల గురించి చర్చించాలని అన్నారు.
గత ఎన్నికల్లో తన విజయానికి కృషి చేసిన వారిలో కొందరు మత ఉగ్రవాదులు ఉన్నారని తరువాత తనకు తెలిసిందని ఈ ఎన్నికల్లో వారి ఓట్లు తనకు వద్దని కొట్టాయం జిల్లాలో పూంజార్ నియోజకవర్గంలో తిరిగి పోటీ చేస్తున్న పిసి జార్జి ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారు. ఎరాట్టుపేట అనే ప్రాంతంలో కొందరు జార్జి ప్రచారాన్ని అపహాస్యం చేయటంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. అలాంటి వారి ఓట్లతో తాను ఎంఎల్‌ఏ కావాలనుకోవటం లేదని మీడియాతో చెప్పారు.
తమకు అధికారమిస్తే దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి ఆరు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని, దళితులు, గిరిజనులకు ఐదేసి ఎకరాల చొప్పున వ్యవసాయ భూమి ఇస్తామని బిజెపి తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నది. అలాగే వృద్దాప్య పెన్షన్‌గా మూడున్నరవేల రూపాయలు చెల్లిస్తామని పేర్కొన్నది. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా అమలు జరపని ఈ పధకాలను కేరళలో ఎలా అమలు జరుపుతారంటూ నెటిజన్లు స్పందించారు. ఒక వైపు కేంద్రంలో ఉన్న సర్కార్ ఉన్న గ్యాస్ సబ్సిడీనే ఎత్తివేస్తుంటే వీరు ఆరు సిలిండర్లు ఉచితం అంటే కేరళీయులు ఎలా నమ్ముతారని ప్రశ్నిస్తున్నారు.శబరిమలలో ఆచారాల పరిరక్షణకు ప్రత్యేక చట్టాన్ని తెస్తామని వాగ్దానం చేసింది.