Wednesday, January 22, 2025

బిజెపికి దూరమౌతున్న నేతలు

- Advertisement -
- Advertisement -

గత ఎన్నికల్లో టికెట్లు రాని నాయకులు కాంగ్రెస్ బాట
విక్రం గౌడ్, జయసుధ పార్టీకి రాజీనామా

మన తెలంగాణ/హైదరాబాద్:  లోక్ సభ ఎన్నికలకు ముందు కమలం పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. రోజుకో నాయకుడు పార్టీ వీడేందుకు సిద్దమైతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇతర పార్టీలకు వలసలు వెళ్లడంతో క్యాడర్ చతికిలపడింది. త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికల ముందు మరికొంతమంది నాయకులు దూరమైతున్నారు. గురువారం దివంగత ముఖేశ్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ ఆపార్టీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గోషామహల్ నియోజకవర్గం నుంచి పార్టీ టిక్కెట్‌ను ఆశించారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కే పార్టీ మళ్లీ టిక్కెట్ ఇచ్చింది. దీంతో ఇన్నాళ్లుగా పార్టీకి దూరంగా ఉంటూ చివరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత లేదని కొద్దిమందికే అన్ని పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. గ్రూపులను కాకుండా పార్టీని నమ్ముకున్న తనలాంటి వారికి అన్యాయం జరిగిందని వాపోయారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు ఉన్నాయని, ఇప్పటికీ పార్టీలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని ఆరోపించారు.

కమలానికి సినీ నటి జయసుధ గుడ్‌బై:  ప్రముఖ తెలుగు సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బిజెపికి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ఆమె తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. జయసుధ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. జయసుధ గత అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ ఆ పార్టీ ఇతరులకు టిక్కెట్‌ను కేటాయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News