డొనాల్డ్ ట్రంప్ తన సుంకాలను ప్రకటించినప్పటి నుండి ప్రపంచం గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటోంది. భయంకరమైన అనిశ్చితిలో మునిగిపోయింది.మెక్సికో వంటి చిన్నదేశాలు సైతం ట్రంప్ ధోరణులను ఎండగడుతూ ఎదురు దాడులకు దిగుతున్నారు. కానీ, ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే భారత దేశ నాయకులు మాత్రం నిస్తేజంగా కనిపిస్తున్నారు. తమ రాజకీయ మనుగడ కోసం దగ్గరిదారులు వెతుకుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గత వారం తన నియోజక వర్గాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎక్కువగా ఆధ్యాత్మిక పోస్టులను సోషల్ మీడియాలో చేశారు. మహావీర్ జయంతి నాడు, ‘భగవాన్ మహావీర్ ఆదర్శాలు నాతో సహా లెక్కలేనన్ని మందికి ఎంతో స్ఫూర్తినిచ్చాయి’ అని పోస్ట్ చేశారు.
వారణాసి నుండి, ప్రధానమంత్రి హనుమంతుడి జన్మదినం నాడు సంకట్ మోచన్ మందిరాన్ని సందర్శించగలిగినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ విశ్వనాథుని ఆశీర్వాదాలు తన నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయడానికి తనను ఎలా ప్రేరేపించాయో చెప్పారు. కొత్త వక్ఫ్ చట్టం, ప్రభుత్వం సాధించిన విజయాలు వంటి అంతర్గత అంశాలపై కొన్ని రాజకీయ అంశాలను కూడా ప్రస్తావించినా ప్రపంచాన్ని ఆర్థిక గందరగోళానికి నెట్టివేస్తున్న తన ‘మిత్రుడు’ ట్రంప్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నారు. ట్రంప్ సుంకాల ప్రభావం గురించి ప్రతిపక్షాలు కోరినా పార్లమెంట్‌లో చర్చకు ప్రభుత్వం సాహసింపలేదు. ఈ గందరగోళం నుండి భారతదేశ ప్రజలకు తగు రక్షణ కల్పిస్తానని ఒక్కసారి కూడా భరోసా ఇచ్చే ప్రయత్నం చేయలేదు. మరోవంక, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అహ్మదాబాద్‌లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ 84వ సమావేశంలో పాల్గొంటూ సుదీర్ఘమైన, ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు గాని అందులో కూడా ఈ సుంకాల గురించి ప్రస్తావించలేదు.
కులజనాభా గణన, 50 శాతం పరిమితికి మించి దిగువ కులాలకు రిజర్వేషన్లు, దళితులు, ఒబిసిలు, గిరిజనులు నరేంద్ర మోడీ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం కారణంగా ఆర్థికంగా ఎదగలేకపోవడం వంటి అంశాలకు పరిమితమయ్యారు. సుంకాలను ప్రస్తావించినా ట్రంప్ తన స్నేహితుడు మోడీని ఎలా నిరాశపరిచాడో ఎగతాళి చేయడానికి పరిమితమయ్యారు. తన సమక్షంలోనే డొనాల్డ్ ట్రంప్ సుంకాలను పెంచే తన ప్రణాళికల గురించి చెబుతున్నా ప్రధాని నిశ్శబ్దంగా కుర్చున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో అటు బిజెపిలో మోడ, ఇటు కాంగ్రెస్‌లో రాహుల్ గాంధీ నాయకత్వాల పట్ల విశ్వాసం సన్నగిల్లుతుంది. మరో నాయకత్వం వైపు ఆయా పార్టీ శ్రేణులు చూస్తున్నారు.
దానితో వారిద్దరూ దేశం ఎదుర్కొంటున్న కీలక సమస్యల పట్ల దృష్టి సారించే పరిస్థితులలో లేరని చెప్పవచ్చు. అంతకు ముందే ప్రధాని మోడీ నాగ్‌పూర్ పర్యటన సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి, ఆ సంస్థ నాయకత్వంతో ఏర్పడిన అగాధాన్ని పూడ్చుకునే ప్రయత్నం చేశారనే వార్తలు వచ్చాయి. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బిజెపి సంస్థాగతంగా బలం పుంజుకుందని, గతంలో మాదిరిగా తమకు ఆర్‌ఎస్‌ఎస్ అండదండలు అవసరం లేదని, తమ వ్యవహారాలను తామే చూసుకోగలమని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ఒక ఇంటర్వ్యూలో పేర్కొనడం సంఘ్‌పరివార్‌లో కలకలం రేపింది. దాని ప్రభావంతోనే 400 సీట్లతో గెలుస్తామని ‘మోడీ గ్యారంటీ’గా చెప్పుకొంటూ ఎంతగా ప్రచారం చేసుకున్నా, 240 సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది. ప్రభుత్వం ఏర్పాటుకు టిడిపి, జెడి(యు) వంటి పక్షాలపై ఆధార పడాల్సివచ్చింది. ఇక మోడీ సారథ్యంలో బిజెపికి భవిష్యత్ లేదనే అభిప్రాయాలు బలం పుంజుకొని వస్తున్నాయి. ఆ తర్వాత జరిగిన హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో అసంభవం అనుకున్న విజయాలను బిజెపి సాధించడం వెనుక ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల వ్యూహాత్మక పనితీరే కారణం అని స్పష్టం కావడంతో ఇప్పుడు తమ భవిష్యత్ గురించి బిజెపి నేతలు ఆ సంస్థ వైపు చూడటం ప్రారంభించారు.
గతంలో ప్రధాన మంత్రిగా పలు సందర్భాలలో నాగ్‌పూర్ సందర్శించిన మోడీ ఏనాడూ ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం సందర్శించే ప్రయత్నం చేయలేదు. అందుకనే 12 ఏళ్ళ తర్వాత ఇపుడు సందర్శించడం, ఈ సందర్భంగా తమ పరిపాలన తీరుపై పలు ప్రశ్నలను ఎదుర్కోవాల్సి రావడంతో ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నది. కొన్ని అంశాలపై గతంలో సైతం ఆర్‌ఎస్‌ఎస్- బిజెపిల మధ్య అంతరాలు ఏర్పడినప్పటికీ వాజపేయి హయాంలో పరస్పరం చర్చల ద్వారా అపరిష్కరించుకొనే వారు. నాటి ఆర్‌ఎస్‌ఎస్ అధినేత సుదర్శన్ నేరుగా వాజపేయిని కలిసి పరిష్కారం కనుగొనేవారు. ఏనాడూ సుదర్శన్ సూచనలను వాజపేయి పక్కనపెట్టిన ఉదంతాలు లేవు. వాజపేయి తన మంత్రివర్గంలో జస్వంత్ సింగ్‌ను ఆర్థిక మంత్రిగా తీసుకోవాలని రాష్ట్రపతి భవన్ మంత్రుల జాబితాను పంపిన అనంతరం సుదర్శన్ కలిసి ఎన్నికల్లో ఓటమి చెందిన వారిని మంత్రివర్గంలోకి తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెడతాయని వారిస్తే, వంటనే ఆ పేరు మార్చారు. కానీ మోడీ తన మొదటి మంత్రివర్గంలో ఎన్నికల్లో ఓటమి చెందిన అరుణ్ జైట్లీ వంటి వారిని ఏకపక్షంగా తీసుకున్నారు.
గత 11 ఏళ్ళల్లో ఏనాడూ వ్యక్తిగతంగా ఆర్‌ఎస్‌ఎస్ అధినేత డా. మోహన్ భగవత్‌తో కలిసి విధానపర అంశాలపై మోడీ సమాలోచనలు జరిపిన ఉదంతాలు లేవు. అందుకనే నేడు తమ మధ్య అగాధం ఏర్పడినట్లు గ్రహించినట్లు కనిపిస్తున్నది. దేశంలో అన్నిరాజకీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారాయని భావిస్తున్న సమయంలో ఏకైక ప్రజాస్వామ్య పార్టీగా భావిస్తున్న బిజెపిలో సంస్థాగత ఎన్నికలలో ఏర్పడిన ప్రతిష్టంభన ఈ సందర్భంగా మోడీ నాయకత్వంపై నీలినీడలు ప్రసరింపచేస్తున్నాయి. బిజెపి అధ్యక్ష పదవి కాలపరిమితి మూడేళ్లు మాత్రమే. కానీ గత 11 ఏళ్ళల్లో ఇద్దరు మాత్రమే అధ్యక్షులుగా ఉన్నారు. ప్రస్తుత అధ్యక్షుడి కాలపరిమితి గత ఏడాది ప్రారంభంలోనే పూర్తయినా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకొనే సాహసం చేయలేక పోతున్నారు.
75 సంవత్సరాలకు పదవులను త్యజించాలనే వరవడిని ఏర్పాటు చేసిన మోడీ ఇప్పుడు తానే ఆ పరిస్థితి ఎదుర్కోవాల్సి రావడం ఈ ప్రతిష్టంభనకు మూల కారణంగా కనిపిస్తోంది. కొత్త ప్రధాని విషయం తేలితే గాని, కొత్త అధ్యక్షుడి విషయం తేలదని చెబుతున్నారు. గతంలో బిజెపిలో సంస్థాగత కార్యక్రమాలు నియమబద్ధంగా జరుగుతూ ఉండెడివి. ప్రతి ఏడాది రెండు సార్లు జాతీయ మండలి, మరో రెండు సార్లు జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతూ ఉండెడివి. కానీ ఇప్పుడు మొక్కుబడిగా మాత్రమే జరుగుతున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల అనంతరం ఇప్పటివరకు బిజెపి పార్లమెంటరీ సమావేశం జరగకపోవడం గమనార్హం. సభ నాయకుడిని ఓ పార్టీ ఎంపిలు ఎన్నుకొని, ప్రభుత్వం ఏర్పాటుకు ఇతర పార్టీల మద్దతు తీసుకోవడం ప్రజాస్వామ్యంలో ఆనవాయితీ. కానీ మొదటిసారిగా, గత ఏడాది మోడీని ఎన్నికల అనంతరం తమ నాయకుడిగా బిజెపి ఎంపిలు కాకుండా ఎన్‌డిఎ ఎంపిలు ఉమ్మడిగా ఎన్నుకున్నారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రతి బుధవారం జరిగే బిజెపి ఎంపిల సమావేశానికి బదులుగా ఇప్పుడు ఎన్‌డిఎ ఎంపిల సమావేశాలు జరుగుతున్నాయి. బిజెపి ఎంపిల సమావేశాలు జరిపితే ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు కురిపించేందుకు సిద్ధంగా కొందరు పార్టీ ఎంపిలు ఉన్నారనే భయంతోనే ఈ విధంగా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
మోడీ బలమైన నాయకుడిగా అంతర్జాతీయంగా ప్రచారం పొందారు. రాజకీయంగా ఆయన ప్రభుత్వానికి అడ్డు అంటూ లేదు. అయినప్పటికీ కీలకమైన సమస్యలపై ఈ ప్రభుత్వం చురుకుగా వ్యవహరించడం లేదనే విమర్శలు చెలరేగుతున్నాయి. మణిపూర్‌లో రెండేళ్లుగా రావణకాష్ఠంగా చెలరేగుతున్న హింసాయుత సంఘటనల విషయంలో, ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో మొత్తం పాలనా యంత్రాంగం కేంద్రం కనుసన్నలలో నడుస్తున్నా దాదాపు ప్రతిరోజూ ఉగ్రవాదులతో కాల్పులు జరుగుతూ ఉండటం, ఎప్పుడో సమాధి అయినా ఖలిస్థాన్ తీవ్రవాదం తిరిగి పడగ విప్పడం, ఉత్తరాదిన రైతులలో అసంతృప్తి కొనసాగుతూ ఉండడం.. సమస్యల పరిష్కారంలో ఈ ప్రభుత్వ సామర్థ్యంపై ప్రశ్నలను తలెత్తే విధంగా చేస్తున్నది. మరోవంక, కాంగ్రెస్‌లో బాధ్యత లేకుండా పెత్తనం చెలాయింప చూస్తే రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల విశ్వాసం సన్నగిల్లుతుంది. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పరాజయానికి బిజెపి అనుసరించిన ఎత్తుగడల ప్రభావం ఒక కారణమైతే, రాహుల్ బృందం అనుసరించిన అసమర్థ విధానాలు మరో కారణంగా ఆ పార్టీ నేతలు గుర్తిస్తున్నారు. అందుకనే ప్రియాంక గాంధీని కార్యనిర్వాహక అధ్యక్షురాలిగా చేయాలనే డిమాండ్ బయలుదేరుతుంది. అయితే ఆమె నాయకత్వ సామర్థ్యం కూడా ఇప్పటివరకు నిరూపితం కాలేదు.
చివరకు ఆమె భర్త కూడా పార్టీ కోరితే రాజకీయ ప్రవేశం చేస్తా అంటూ చాలాకాలంగా ఎదురు చూస్తున్నారు. బిజెపిలో నాయకత్వం ఒక బృందంగా చర్చలు జరిపి, నిర్ణయాలు తీసుకోవాలని చాలాకాలంగా ఆర్‌ఎస్‌ఎస్ పెద్దలు సూచిస్తున్నారు. కానీ, ఒకరిద్దరు వ్యక్తులే నిర్ణయాధికారంగా మారడంతోనే ఆ పార్టీ ప్రధానంగా పట్టు కోల్పోయే ప్రమాదం ఎదుర్కొంటున్నది. కాంగ్రెస్‌లో సైతం క్షేత్రస్థాయిలో పట్టుగల క్రియాశీల నాయకులను పక్కన పెట్టి రాహుల్ ‘భజన బృందం’ పెత్తనం చేస్తున్న కారణంగానే ఆయన విఫల నాయకుడిగా మిగిలిపోతున్నారు. ఏ రాష్ట్రంలో అయితే బలమైన నాయకత్వం ముందుకు వస్తుందో అక్కడే కాంగ్రెస్ విజయాలు సాధింపగలుగుతున్నది. పార్టీలో బలమైన నాయకత్వం ఏర్పడకుండా రెండు పార్టీలలోని కీలక నాయకులే అడ్డుపడుతూ ఉండటం గమనార్హం.
చలసాని నరేంద్ర
98495 69050
- Advertisement -