భారత ప్రజాస్వామ్యంలో అత్యంత చీకటి అధ్యాయం 1975లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ అంతర్గత ఎమర్జెన్సీని విధించడం. ఆ సమయంలో 20 నెలల పాటు ప్రజల ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయడంతో ప్రపంచంలో ప్రజాస్వామ్య పాలనలో ఉన్న ప్రజల సంఖ్య సగానికి తగ్గిపోయింది. మొదటిసారిగా పత్రికలపై సెన్సార్ షిప్ విధించారు. ప్రతిపక్ష నేతలనే కాకుండా, ఎమర్జెన్సీని వ్యతిరేకించిన వారందరినీ జైళ్లలో ఉంచారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తీవ్ర అణచివేత పరిస్థితులను ఎదుర్కొని మహత్తరమైన నిరసన ఉద్యమం జరిగింది. లక్ష మందికి పైగా జైళ్లకు వెళ్లారు. నాడు తన అధికారానికి తిరుగులేదనుకున్న ఇందిరా గాంధీ ఎన్నికలలో స్వయంగా ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
మొదటి సారిగా కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. దేశ చరిత్ర నూతన మలుపు తిరిగింది.నాడు రాజకీయ పార్టీలలో, పౌర సమాజంలో విలువల పట్ల నిబద్ధత కలిగినవారు గణనీయ సంఖ్యలో ఉండటం, వివిధ స్థాయిలో గల నాయకులు సహితం సత్తా కలిగిన వారు కావడంతో ఆ చీకటి రోజుల నుండి త్వరలోనే బయటపడగలిగాము. 1971 నాటి ఇండో- పాకిస్థాన్ యుద్ధంలో దాదాపు మొత్తం ప్రపంచాన్ని ఎదిరించి, పరిమితమైన సాధన సంపత్తితో వీరోచితంగా పోరాడి పాకిస్థాన్ ను ఓడించడమే కాకుండా, ఎటువంటి ప్రాతిపదిక లేకుండా జరిగిన దేశ విభజన అశాస్త్రీయం అని నిరూపించే విధంగా బంగ్లాదేశ్ అనే నూతన దేశం ఆవిర్భవించింది.
నాడు ప్రతిపక్షాలు సహితం ప్రధాని ఇందిరా గాంధీకి దన్నుగా నిలిచాయి. ఆమె సామర్థ్యాన్ని మెచ్చుకుంటూ ‘అపర దుర్గ’ అంటూ కొనియాడటం కూడా జరిగింది. అయితే ఆ యుద్ధం కారణంగా దేశ ఆర్ధిక పరిస్థితి క్షీణించడం, ఆమె పాలనలో అవినీతి పెరగడం, రాజకీయంగా పలు ఆటుపోట్లు ఎదురు కావడంతో తన పదవి కోసం ఎమర్జెన్సీ విధించి తన ప్రజా జీవనంలోనే చెరిపివేయలేని మచ్చ ఏర్పరచుకున్నారు. ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాష్ నారాయణ, మొరార్జీ దేశాయి వంటి ఎందరో నేతలు ఆమె ప్రలోభాలకు లొంగలేదు. జైళ్లకు పరిమితమయ్యారు. నిషేధానికి గురైన ఆర్‌ఎస్‌ఎస్ వంటి సంస్థలు ప్రజాస్వామ్యం కోసం ఎన్నడూ, ఎవ్వరూ ఊహించనటువంటి ప్రతిఘటన ఉద్యమాలు నడిపాయి. చివరకు ఎవ్వరూ ఊహించని విధంగా ఇందిరా గాంధీ స్వయంగా ఎన్నికలను ప్రకటించారు. ఆ ఎన్నికల్లో భారత ప్రజలు చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారు.
ఆ తర్వాత జనతా ప్రభుత్వంలో నాయకుల మధ్య సయోధ్య ప్రశ్నార్థకంగా మారి పూర్తి కాలం నిలబడలేక పోయినప్పటికీ వారందించిన సుపరిపాలన చరిత్రాత్మకమైనది. ఆ తర్వాత మరెవ్వరూ ఎమర్జెన్సీ విధించే సాహసం చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. పలు ప్రభుత్వాలు మారినా దేశ సుస్థిరత చెక్కుచెదరలేదు. దేశంలో అశాంతికర పరిస్థితులు ఏర్పడలేదు. అందుకు వివిధ స్థాయిలలో గల బలమైన నాయకత్వమే కారణం. అయితే, నేడు దేశంలో అటువంటి నాయకత్వం ఉందా? అనే ప్రశ్న తలెత్తుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదేళ్లలో తొలిసారిగా వైట్ హౌస్‌లో తమ సంప్రదాయం పాటించాల్సిందే అని వత్తిడి చేస్తే, తప్పనిసరి పరిస్థితులలో మీడియా నుండి నేరుగా కేవలం ఒక ప్రశ్నకు మాత్రమే జవాబు చెప్పారు. ఆ జవాబులో సహితం ‘ప్రజాస్వామ్యం’ అనే పదం డజన్ సార్లు పలికి గందరగోళానికి గురయ్యారు. మీడియా ప్రశ్నలకు సమాధానం దాటవేసే ప్రధాని ఏ ప్రజాస్వామ్య దేశంలో అయినా ఊహించగలమా?
ప్రజలలో భావోద్వేగాలు సృష్టించి, వాటి ద్వారా రాజకీయంగా ఎదురులేకుండా కొనసాగడం కాకుండా సంక్లిష్ట పరిస్థితులలో ప్రజలకు ఏ విధంగా ముందుకు తీసుకు వెడతారన్నది ప్రధానం కాగలదు. గత ఏడాది బిజెపిని ఎన్నుకొంటే మణిపూర్‌లో శాంతి నెలకొంటుందని ప్రచారం చేసిన ప్రధాని మోడీ ఎనిమిది వారాలుగా అక్కడ హింసాకాండ జరుగుతుంటే కనీసం ప్రశాంతంగా ఉండమని ప్రజలకు విజ్ఞప్తి చెయలేకపోతున్నారు. మణిపూర్‌లో హింసాకాండ ప్రారంభానికి మూడు రోజుల ముందు మే 1న దట్టమైన అమెజాన్ అడవుల్లో ఓ చిన్న విమానం కూలిపోయి ముగ్గురు పెద్దలు చనిపోగా, తప్పిపోయిన నలుగురు చిన్నారులను కాపాడడం కోసం ఆ దేశ ప్రభుత్వం చూపిన శ్రద్ధ అసామాన్యమైనది. 40 రోజుల పాటు 150 మంది సైనికులు, 80 మంది గిరిజనులతో కలిసి వారి ఆచూకీ కోసం అడవులలో సుమారు 2,500 కిమీ దూరం నడిచారు. ఆ దేశ అధ్యక్షుడు గుస్తావో పెడ్ మొత్తం ఈ ఆపరేషన్‌ను స్వయంగా పర్యవేక్షించారు.
మణిపూర్‌లో శాంతి భద్రతల పరిస్థితికి కేంద్రం నేరుగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ హోం మంత్రికి కర్ణాటక ఎన్నికలను చూసుకొని, అక్కడకు వెళ్లేసరికి సుమారు నాలుగు వారాలు పట్టింది. 3,500కు పైగా పోలీసుల తుపాకులను అపహరించి, వాటితోనే అమాయక ప్రజలను కాల్చి పంపుతున్నారంటే ఎంతగా అరాచకం నెలకొందో వెల్లడి అవుతుంది. స్వయంగా అమిత్ షా ‘దయ చేసి దొంగిలించిన తుపాకులను తిరిగి ఇవ్వండి’ అంటూ బహిరంగంగా అభ్యర్థించడం చూస్తే పరిస్థితులు ఎంత దారుణంగా దిగజారాయో వెల్లడి అవుతుంది. మణిపూర్‌లో నేడు నెలకొన్న దారుణ పరిస్థితులకు సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడమే కారణం అని చెప్పవచ్చు. దేశ సరిహద్దుల్లో సున్నితమైన ఈ ప్రదేశంలో ఇటువంటి హింసాకాండ ప్రబలడానికి ముఖ్యమంత్రి, అధికార పార్టీకి చెందిన మరికొందరు కారణం అంటూ బిజెపి ఎంఎల్‌ఎలే ఆరోపణలు చేస్తున్నారు. అల్లరి మూకల దాడిలో ఇల్లు అగ్నికి ఆహుతి అయిన కేంద్ర మంత్రి రంజిత్ సింగ్ సహితం మణిపూర్‌లో శాంతి భద్రతలు విఫలమైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
కొలంబియాలో స్వయంగా ఆ దేశాధ్యక్షుడు అడవులలో తప్పిపోయిన నలుగురి పిల్లల ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తే, మణిపూర్ లో ఇంతటి దారుణ హింసాకాండ జరుగుతున్నా రాష్ట్రపతి గాని, ప్రధాన మంత్రి గాని పట్టించుకోకపోవడం గమనార్హం. పైగా, ఇటీవల అసోం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మ అక్కడకు వెళ్లి, కొందరు తీవ్రవాద బృందాలతో అనధికార సమాలోచనలు జరపడం, ఆయన వెళ్ళిపోగానే అక్కడ అప్పుడప్పుడే తగ్గుతున్న హింసాకాండ పెచ్చుమీరడం జరిగింది. మరోవంక, ప్రధానిగా ఐదారు సార్లు అమెరికా పర్యటనకు వెళ్లినా మొదటిసారిగా ఆ దేశ అధ్యక్షుడి ఆహ్వానంపై అధికారిక పర్యటనకు మోడీ వెళ్లారు. అయితే, కొద్ది కాలంగా పెండింగ్‌లో ఉన్న రక్షణ సంబంధ ఒప్పందాలను పూర్తి చేసుకోవడం కోసం ఈ పర్యటన పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆసక్తి చూపినట్లు స్పష్టం అవుతుంది.
ఆయన ప్రభుత్వం మోడీకి ఘన స్వాగతం పలికినా, ఆయన పర్యటన పట్ల అమెరికాలో ఎదురైనా వ్యతిరేకత ఇటీవల కాలంలో మరే భారత ప్రధానికీ ఎదురు కాలేదని చెప్పవచ్చు.
ప్రజాస్వా మ్యం గురించి, మానవ హక్కుల గురించి, అందరి అభివృద్ధి గురించి మనం చెబుతున్న మాటలకు, చేతలకు సంబంధం లేదనే విమర్శలు చెలరేగడమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. 75 మంది డెమొక్రాటిక్ పార్టీ కాంగ్రెస్ సభ్యులు బైడెన్‌కు రాసిన లేఖలో భారత దేశంలో మీడియా స్వాతంత్య్రం, మానవ హక్కులు, మైనారిటీల పరిస్థితుల గురించి భారత ప్రధానితో నిక్కచ్చిగా మాట్లాడాలని కోరడం జరిగింది. వాస్తవానికి ఈ అంశాలను గత ఏడాది పర్యటనలో కమలా హరీష్ వంటి వారు లేవనెత్తడంతో అసౌకర్యానికి గురైన ప్రధాని మోడీ తన ఆరు రోజుల పర్యటనను మూడు రోజులకు కుదించుకొని తిరిగి వచ్చేశారు. అయితే, ఈసారి భారత్‌తో రక్షణ ఒప్పందాల గురించి పట్టుదలగా ఉన్న అమెరికా ముందుగానే అటువంటి విషయాలు బైడెన్- మోదీ చర్చలలో ప్రస్తావనకు రాబోమంటూ వైట్ హౌస్ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. ముఖ్యంగా భారత్‌లో మీడియా స్వాతం త్య్రం ఎమర్జెన్సీ తర్వాత మొదటిసారిగా అంతర్జాతీయంగా నేడు ప్రశ్నార్ధకంగా మారడం ఆందోళన కలిగిస్తుంది.
మోడీ పర్యటన సందర్భంగా రెండు అంతర్జాతీయ మీడియా స్వేచ్ఛ సంస్థలు భారత్‌లో మీడియా స్వాతంత్య్రం గురించి ప్రత్యేక నివేదికలను ఈ సందర్భంగా విడుదల చేశాయి. గత ఏడాది మీడియా వేధింపులకు సంబంధించి భారత్‌లో 200 సంఘటనలు జరిగాయని ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక వెల్లడించింది. బహుశా ఈ మధ్య కాలంలో ఇంత భారీ సంఖ్యలో మీడియాపై వేధింపులు జరిగి ఉండకపోవచ్చు. భారత్‌ను ప్రజాస్వామ్యం మాతృమూర్తిగా చెప్పుకొంటున్నాము. అయితే, సవాళ్లు ఎదురైనప్పుడు నిలదీసేందుకు అవసరమైన నైతిక నాయకత్వ లోపం నేడు దేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. రాజకీయ పార్టీలు, మీడియా సంస్థలు, ఇతర సామాజిక బృందా లు సహితం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మారిపోవడంతో ప్రజల సాధికారికత కోసం ముందుకు రాలేకపోతున్నారు. ప్రజాస్వామ్యం చైతన్యవంతమైన ప్రజలను బట్టే బలోపేతంగా ఉంటుం ది. ప్రజలలో అటువంటి చైతన్యం లోపించినా, ప్రజలను సమీకరించ గల నాయకత్వం లోపించినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అందుకనే చట్ట ప్రకారం దేశంలో ఎమర్జెన్సీ అమలులో లేకపోయినప్పటికీ సామాజిక జీవనంలో పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయని చెప్పాలి.