Monday, December 23, 2024

ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నారాయణ్ దాస్ కె.నారంగ్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Leading Producer Distributor Narayan Das K Narang passed away

 

తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నారాయణ్ దాస్ కె.నారంగ్ (78) మంగళవారం ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆయన శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌లో లవ్ స్టోరీ, లక్ష్య వంటి హిట్ చిత్రాలని అందించారు. ప్రస్తుతం నాగార్జునతో ‘ఘోస్ట్’ మూవీతో పాటు ధనుష్‌తో ద్విభాష చిత్రాన్ని, శివ కార్తీకేయన్, -అనుదీప్‌తో ఓ మూవీ, సుధీర్ బాబు, – హర్షవర్ధన్ లతో ఓ మూవీని నిర్మిస్తున్నారు.

నారాయణ్ దాస్ కె.నారంగ్ 1946 సంవత్సరం జూలై 27న జన్మించారు. ఏషియన్ గ్రూప్ థియేటర్స్ అధినేత, గ్లోబల్ సినిమాస్ ఛైర్మన్ అయిన ఆయన నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా పలు విజయవంతమైన చిత్రాలను విడుదల చేశారు. ఫైనాన్షియర్ కూడా అయిన నారాయణ్ దాస్ కె.నారంగ్ చలనచిత్ర రంగంలో అజాత శత్రువుగా పేరుగాంచాడు. నైజాం ఏరియాలో తొలితరం పంపిణీదారులలో నారాయణ దాస్ కె. నారంగ్ ఒకరు. ఎగ్జిబిటర్‌గా, ఫైనాన్షియర్‌గా తెలుగు చిత్ర పరిశ్రమకు సేవలందించారు. ఆయనకు సునీల్ నారంగ్, భరత్ నారంగ్ అనే ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ ఇద్దరిలో సునీల్ నారంగ్ చిత్ర పరిశ్రమలో నిర్మాతగా, ఎగ్జిబిటర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నారు.

సినీ ప్రముఖుల సంతాపం…

తెలుగు చిత్ర పరిశ్రమకు నారాయణ్ దాస్ కె.నారంగ్ చేసిన సేవలని గుర్తు చేసుకుంటూ మెగాస్టార్ నుంచి పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఫిలింనగర్‌లోని ఆయన స్వగృహానికి వెళ్లి నారాయణ్ దాస్ నారంగ్ భౌతిక కాయానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, చిరంజీవి, మహేష్‌బాబు, నాగార్జున, నాగచైతన్య, మంచు విష్ణు, అల్లు అరవింద్, డి.సురేష్‌బాబు, సి.కళ్యాణ్, అశ్వనీదత్, దామోదర్ ప్రసాద్ తదితరులు పూలతో నివాళులర్పించారు. “ప్రదర్శనారంగంలో నిష్ణాతుడు, మాట మీద నిలబడే నిఖార్సైన మనిషి, నిబద్ధత కలిగిన వ్యక్తి, అపార అనుభవజ్ఞుడు, సినీరంగంలో ఒక మహారథి, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు శ్రీ నారాయణ దాస్ నారంగ్‌కి శ్రద్ధాంజలి” అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. “నారాయణ దాస్ నారంగ్ మరణ వార్త విని షాకయ్యాను. మన చిత్ర పరిశ్రలో ఉన్న ఒక గొప్ప వ్యక్తి ఆయన. ఆయనతో కలసి పనిచేయడం ఓ గౌరవం.

సినిమా పట్ల ఆయనకున్న విజన్, అభిరుచి మనలో ఎంతో మందికి స్ఫూర్తి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని మహేష్ బాబు అన్నారు. “ప్రముఖ సినీ పంపిణీదారుడు, ఎగ్జిబిటర్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ అధ్యక్షులు నారాయణ్ దాస్ నారంగ్ మృతికి చింతిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నేను నటించిన చిత్రాలలో కొన్నింటిని వారి సంస్థ ద్వారా రిలీజ్ చేశారు. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులుగా ఆయన ఎన్నో సేవలందించారు. ఆయన తనయుడు సునీల్ నారంగ్, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ ’ అని పవన్ కల్యాణ్ తెలిపారు. వివి వినాయక్ మాట్లాడుతూ “డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, నిర్మాతగా సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా మెలిగే వ్యక్తి నారాయణ్ దాస్ కె.నారంగ్. అలాగే వారి కుమారుడు సునీల్ సక్సెస్‌ఫుల్ పంపిణీ దారుడు. ఇటీవల వరుసగా సినిమాలు నిర్మిస్తూ వున్నారు. అలాంటి సమయంలో నారాయణ్ దాస్ లేకపోవడం పరిశ్రమకి ఎంతో తీరని లోటు. వారి ఆత్మకు శాంతి కలగాలి”అని అన్నారు.

తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శులు టి. ప్రసన్న కుమార్, మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ “నారాయణ్ దాస్ నారంగ్ తెలుగు సినిమా పరిశ్రమకి విశేష సేవలు అందించారు. నారాయణ్ దాస్ నారంగ్ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబం సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాము”అని అన్నారు. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి గౌరవ కార్యదర్శులు కె.ఎల్.దామోదర్ ప్రసాద్, ఎం.రమేష్ మాట్లాడుతూ “నారాయణ్ దాస్ కె.నారంగ్ మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము”అని అన్నారు. నారాయణ్ దాస్ కె.నారంగ్ మృతి పట్ల శివకార్తికేయన్, సుధీర్ బాబు, సుశాంత్, వల్లభనేని వంశీ, నల్లమలుపు బుజ్జి, మెహర్ రమేష్, బండ్ల గణేష్ తదితరులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ఇక నారాయణదాస్ కె నారంగ్ అంత్యక్రియలు హైదరాబాద్‌లోని మహా ప్రస్థానంలో ముగిసాయి. ఈ కార్యక్రమంలో కుటుంబసభ్యులతో పాటు ఫిలిం చాంబర్ సభ్యులు , నిర్మాతల మండలి సభ్యులు , డిస్ట్రిబ్యూటర్స్ , ఎగ్జిబిటర్స్ పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News